స్వప్రయోజనాల కోసం తెలంగాణా సీఎంతో కుమ్మక్కైన చంద్రబాబు

 బాబు ద్రోహాన్ని అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టిన రేవంత్ రెడ్డి

 రాయలసీమ ప్రజల భవిష్యత్తుని తాకట్టు పెట్టిన బాబు

 భావితరాలకూ చంద్రబాబు తీరని ద్రోహం

 తీవ్ర స్ధాయిలో మండిపడ్డ కర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి

క‌ర్నూలు లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన క‌ర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు ఎస్వీ మోహ‌న్‌రెడ్డి.

 కేంద్రంలో కీలకంగా ఉన్నా రాయలసీమకు ప్రత్యేక గ్రాంట్స్ ఊసేలేదు 

 రాయలసీమ మంత్రులకు ప్రజా ప్రయోజనాలు పట్టవా?

 జరుగుతున్న అన్యాయంపై మీ నోళ్లు ఎందుకు లేవడం లేదు?

 సూటిగా నిలదీసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి

 రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వెంటనే ప్రారంభం కావాలి

 లేని పక్షంలోప్రజల తరపున వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం

 వైయస్.జగన్ సీఎం అయిన వెంటనే  లిఫ్ట్ స్కీం పూర్తి చేస్తాం

స్ప‌ష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్‌రెడ్డి 

కర్నూలు: కేవలం తన స్వప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు తెలంగాణా సీఎంతో కుమ్మక్కై.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను నిలిపివేశారని కర్నూలు వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు.  శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి...చంద్రబాబు ద్రోహాన్ని బయటపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులు నిలిపివేయడం ద్వారా...చంద్రబాబు రాయలసీమ ప్రజల భవిష్యత్తున తాకట్టు పెట్టడంతో పాటు, భావితరాలకు తీరని ద్రోహం చేశారని తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలో కీలకంగా ఉన్నా కూడా చంద్రబాబు రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్స్ గురించి  ఊసెత్తడం లేదన్న ఆయన...  రాయలసీమ మంత్రులుకూ ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు పట్టవా అని నిలదీశారు. జరుగుతున్న అన్యాయంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.  తక్షణమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించాలన్న ఆయన.. లేనిపక్షంలో ప్రజల తరపున వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తుందని తేల్చి చెప్పారు.  ఇంకా ఆయన ఏమన్నారంటే...

  
● చంద్రబాబు, రేవంత్‌ కుమ్ముక్కు రాజకీయాలు బట్టబయలు

తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గం, ఆయన చంద్రబాబు శిష్యుడు, రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మాట్లాడుకుని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపాను అని ధైర్యంగా చెప్పారు, ఇది చంద్రబాబు రేవంత్‌ ల మధ్య ఉన్న అక్రమ సంబంధం బట్టబయలు చేసింది, నాడు జగన్‌ గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు మొదలుపెట్టగానే చంద్రబాబు కొంతమంది టీడీపీ అనామకులతో కేసులు వేయించి ఆపాలని ప్రయత్నించాడు, కానీ జగన్‌ గారు పనులు జాప్యం జరగకూడదని మొదలుపెట్టారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి అప్పటి సీఎం కేసీఆర్‌ తనను ఇబ్బంది పెడతాడనే భయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ల విషయంలో ఏం చేస్తున్నా నోరుమెదపలేదు. రాయలసీమ హక్కులను చంద్రబాబు కాలరాశారు, రాయలసీమ తాగునీటి అవసరాలను ఆయన తెలంగాణకు ఫణంగా పెట్టాడు. శ్రీశైలం రిజర్వాయర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లుగా ఖాళీ చేస్తున్నారని జగన్‌ గారు సీఎం అయిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించి శరవేగంగా పూర్తిచేసే ప్రయత్నం చేశారు. (వైయస్‌ జగన్‌ హయాంలో పనులు జరుగుతున్న ఫోటోలు, వీడియోలు మీడియాకు చూపారు). వేలకోట్లు ఖర్చుపెట్టిన పనులు తెలంగాణ సీఎం అడగగానే ఆపడం ఎక్కడైనా ఉంటుందా, ఇది రాయలసీమ ప్రజల గొంతు కోయడం కాదా, ఎక్కడైనా గురుదక్షిణ ఇస్తారు కానీ ఇక్కడ శిష్యదక్షిణ ఇచ్చాడు చంద్రబాబు రేవంత్ కు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గ్రీన్‌ ట్రిబ్యునల్ లో వాదనలు జరిగే సమయంలో ఉద్దేశపూర్వకంగా ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించలేదు, రాయలసీమ తాగునీటి అవసరాలకు ఈ ఎత్తిపోతల పథకం కడుతున్నామని ఒక మాట మీరెందుకు చెప్పలేకపోయారు

● కేంద్రం నుంచి రాయలసీమకు ప్రత్యేక గ్రాంట్స్‌ ఎందుకు సాధించలేకపోతున్నారు

నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ కెపాసిటీ పెంచితే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ఇదే కర్నూలులో నాడు జగన్‌ గారు జలదీక్ష చేశారు. చంద్రబాబు గారు మీకు రాయలసీమ ప్రజల ఆకాంక్షలు పట్టవా, పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను కూడా చంద్రబాబు ఆపలేకపోయారు. కారణం ఏంటని మేం ప్రశ్నిస్తున్నాం. మేం కుమ్ముక్కై ఆపామని రేవంత్ రెడ్డి ఓపెన్ గా అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు, చంద్రబాబు మీకు రేవంత్ అంటే కూడా అంత భయమా, లేక శిష్యుడి మీద వాత్సల్యం చూపుతున్నారా, ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు, రాయలసీమ గొంతుకోశారు. గుండ్రేవుల రిజర్వాయర్‌ను పూర్తిచేస్తే రాయలసీమలో కొంత కరువు తీరుతుందంటే ఖర్చుపెట్టరు కానీ అమరావతి రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చుపెడుతున్నారు. కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగా కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు కేంద్రం నుంచి రాయలసీమకు ప్రత్యేక గ్రాంట్స్‌ ఎందుకు తెప్పించరు, అదే అమరావతి కోసం వేలకోట్లు తెస్తారు. చంద్రబాబు మీరు రాయలసీమ అవసరాలు ఫణంగా మీ శిష్యుడికి ఫణంగా పెడతానంటే రాయలసీమ వాసులు ఎవరూ చూస్తూ ఊరుకోరు. రేవంత్ రెడ్డి మీ కుమ్ముక్కు రాజకీయాలపై అంత ధైర్యంగా ప్రకటన చేశారంటే ఏమనుకోవాలి, పోతిరెడ్డిపాడు నుంచి దాదాపుగా 101 టీఎంసీల కేటాయింపులు ఉన్నా కూడా ఏ ఏడాది కూడా అంత నీటిని తీసుకునే వీలు లేకుండా పోయింది. సుమారుగా రెండు దశాబ్ధాల లెక్కలు చూస్తే కేవలం ఒకటి రెండు సంవత్సరాలు మాత్రమే కేటాయించిన నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ నుంచి తీసుకోగలిగాం, మిగిలిన సంవత్సరాలంతా కరువుతోనే సతమతమయ్యాం. 

● రాయలసీమ ప్రాంత టీడీపీ నేతలారా ఇకనైనా నోరువిప్పండి

చంద్రబాబు రాయలసీమ ప్రజలు మిమ్మల్ని క్షమించరు, మా ప్రజల భావితరాల అవకాశాన్ని కాలరాశారు, రాయలసీమ కరువు కాటకాలతో వలసలు వెళ్ళేలా చేసిన చేసిన పాపం చంద్రబాబుదే, రాయలసీమ టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులను ప్రశ్నిస్తున్నాం, మీకు పదవులు ముఖ్యమా, మీ ప్రాంత ప్రజల మనోభావాలు ముఖ్యమా, మీరు తేల్చుకుని సమాధానం చెప్పండి, సీమ ప్రజల గొంతు కోస్తుంటే చూస్తూ ఊరుకుంటే మీ భవిష్యత్‌ను ఇక్కడి ప్రజలు తేలుస్తారు, మీరు చంద్రబాబును నిలదీయలేకపోతే రాయలసీమ ప్రజలు మీకు సమాధి కట్టడం ఖాయమని హెచ్చరించారు.  ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలకోసం నోరువిప్పాలని, ప్రశ్నించకపోతే రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోవడం ఖాయమని హెచ్చరించారు. దీనిపై వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందన్న మోహన్ రెడ్డి.. రాయలసీమ  ప్రాంత ప్రజలు, రైతులతో కలిసి ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు. వైయస్.జగన్ మళ్ళీ సీఎం అవగానే ఈ పనులు మొదలుపెట్టి రాయలసీమ ప్రజల ప్రయోజనాలకు కంకణ బద్దులమవుతామని స్పష్టం చేశారు.

Back to Top