సావిత్రీబాయి పూలే స్ఫూర్తిని కొనసాగించిన వైయ‌స్ జ‌గ‌న్‌ విద్యా సంస్కరణలు

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి

తిరుపతిలో ఘనంగా సావిత్రీబాయి పూలే విగ్రహావిష్కరణ

తిరుపతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విద్యా సంస్క‌ర‌ణ‌ల ద్వారా  సావిత్రీబాయి పూలే స్ఫూర్తిని  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొన‌సాగించార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.  తిరుపతి బి.సి. సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కూడలిలో సావిత్రీబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీషా, బి.సి. నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలో ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ, మహిళల సాధికారత, అందరికీ విద్య అనే మహోన్నత లక్ష్యాలతో సావిత్రీబాయి పూలే సుమారు 200 సంవత్సరాల క్రితమే అనేక సామాజిక అవరోధాలను ఎదుర్కొంటూ పోరాటం చేశారని గుర్తు చేశారు. మూఢనమ్మకాలతో నిండిన అప్పటి సమాజంలో మహిళలకు చదువు నేర్పేందుకు ఆమె చేసిన త్యాగం, జ్యోతిరావ్ పూలేతో కలిసి ముందుకు తీసుకెళ్లిన ఆశయాలు నేటి తరాలకు చిరస్మరణీయమైన స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.

మహిళల విద్య కోసం సావిత్రీబాయి పూలే కోరుకున్న ఆశయాలకు ప్రతీకగా మహిళా విశ్వవిద్యాలయం ముందే ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ఎంపీ పేర్కొన్నారు. “ఒక బ్యానర్ కొద్ది మందికే ప్రేరణనిస్తే, ఒక విగ్రహం తరతరాలకు కోట్ల మందికి స్ఫూర్తినిస్తుంది” అని వ్యాఖ్యానిస్తూ, ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన బి.సి. సంఘర్షణ సమితికి, బి.సి. నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహ‌న్ రెడ్డి పాలనను ప్రస్తావించిన ఎంపీ గురుమూర్తి, సావిత్రీబాయి పూలే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆయన ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలను సమూలంగా మార్చారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో చేపట్టిన పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాలు, ఇంగ్లీష్ మీడియం విద్య, శుభ్రమైన వాతావరణం, తాగునీరు, యూనిఫార్ములు, పుస్తకాలు, అమ్మ ఒడి వంటి పథకాల ద్వారా విద్య నిరాటంకంగా కొనసాగేందుకు చేసిన కృషి ప్రశంసనీయమని తెలిపారు.

ప్రభుత్వాలు మారినా విద్యపై ఉన్న ఈ స్ఫూర్తి కొనసాగాలని, ప్రతి బిడ్డ మంచి చదువుతో ఉన్నత స్థాయికి ఎదగాలంటే అన్ని ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు బాధ్యతతో పనిచేయాలని ఎంపీ మద్దిల గురుమూర్తి పిలుపునిచ్చారు.

Back to Top