తాడేపల్లి: భారతదేశపు తొలి మహిళా గురువు, మహానీయ సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని వైయస్‌ఆర్‌సీపీ నేతలు కొనియాడారు. మహిళాభ్యుదయం, మహిళా సాధికారత సాధనలో ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని వారు పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు నారాయణ మూర్తి, బీసీ సెల్ జనరల్ సెక్రటరీ దస్తగిరితోపాటు పలు పార్టీ విభాగాలనాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రీ బాయి పూలే ఆశయాలకు అనుగుణంగానే గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో మాజీ సీఎం వైయస్ జగన్ గారు వినూత్న మార్పులు తీసుకురావడమే కాకుండా మహిళలను ఉన్నత స్థానాల్లో నిలబెట్టి రాజకీయంగా ప్రోత్సహించారని గుర్తు చేశారు. ఆఖరి శ్వాస వరకు కూడా ప్రజా సేవలోనే గడిపిన సావిత్రీ బాయి జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమన్నారు. ఎన్నో అవమానాలు, అవరోధాలను దాటుకుని భర్త సహకారంతో మహిళల కోసం విద్యాలయాలు స్థాపించి వారి అభ్యున్నతి కోసం కృషి చేశారని చెప్పారు.