విజయవాడ: రాష్ట్రంలో ఆర్యవైశ్యులపై జరుగుతున్న వరుస దాడులు, వేధింపులపై వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్యవైశ్యులపై దాడులు మితిమీరుతున్నాయని, వ్యాపారం కూడా చేయనీయకుండా కూటమి నేతలు అడ్డుపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వెలంపల్లి శ్రీనివాసరావు ఓ వీడియో మీడియాకు విడుదల చేశారు. ఇటీవల పొదిలిలో ఎస్ఐ వ్యాపారి అవినాష్ , ఆయన తండ్రిపై అమానుషంగా దాడి చేసిన ఘటనను గుర్తు చేసిన వెలంపల్లి, నేడు దర్శి నియోజకవర్గం గంగ దేవరపల్లిలో డిపో నిర్వహిస్తున్న సత్యనారాయణపై జరుగుతున్న వేధింపులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. దశాబ్దాల కాలంగా రేషన్ డీలర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణను, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డీలర్‌షిప్ వదులుకోవాలని కూటమి నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. డీలర్‌షిప్ వదులుకోకపోతే కిడ్నాప్ చేస్తామని కూడా బెదిరింపులకు పాల్పడినట్టు తెలిపారు. ఈ బెదిరింపులను తట్టుకోలేక సత్యనారాయణ దేవస్థానంలో తలదాచుకున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో దర్శి పోలీసులు కూటమి నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, బాధితుడికి న్యాయం చేయడంలో విఫలమవుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోజుకు ఒకచోట ఆర్యవైశ్యులపై దాడులు జరుగుతున్నాయని, ఆర్యవైశ్యులు బతకాలంటేనే భయం వేస్తోందని వెలంపల్లి అన్నారు. కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న ఆర్యవైశ్య మంత్రి, ఎమ్మెల్యేలు ఈ దాడులపై ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పొదిలిలో ఆర్యవైశ్యులపై దాడి చేసిన ఎస్ఐపై ఇప్పటివరకు ఎందుకు సస్పెన్షన్ వేటు వేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆర్యవైశ్యులంటే చులకన భావం ఉందని ఆరోపించిన వెలంపల్లి, ఒకవైపు తెలుగుదేశం నేతలతో దాడులు, మరోవైపు అధికారులు, పోలీసులతో వేధింపులు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి ఆర్యవైశ్యులపై దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులంతా కలిసి తిరుగుబాటు చేయాల్సి వస్తుందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు.