కూట‌మి పాల‌న‌లో దేవుడికే ర‌క్ష‌ణ కరువు

గోవిందరాజస్వామి ఆలయ ఘటన టీటీడీ పాలనా వైఫల్యమే

కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు ఆగ్రహం

తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు. 

వైకుంఠ ఏకాదశి రోజు భక్తులకు దర్శనాలు ఆపడం దుర్మార్గం

తిరుమలకు భక్తులకు రావద్దనడం చరిత్రలో ఇదే ప్రధమం

లక్షలాది భక్తులు వస్తారని తెలిసినా ఏర్పాట్లలో టీటీడీ వైఫల్యం

గోవిందమాల స్వాములనూ అడ్డుకోవడం తీవ్ర అవమానం

సామాన్య భక్తులను గాలికొదిలి... వీఐపీల సేవలో ముగినిన టీటీడీ 

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు తీవ్ర ఆక్షేపణ.

తాడేప‌ల్లి: కూట‌మి ప్రభుత్వ పాల‌న‌లో దేవుడికే ర‌క్ష‌ణ కరువైందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవిందరాజస్వామి ఆలయ ఘటన టీటీడీ పాలనా వైఫల్యానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి రోజు భక్తులకు దర్శనాలు ఆపడం దుర్మార్గమని, తిరుమలకు భక్తులకు రావద్దనడం చరిత్రలో ఇదే ప్రధమమని ఆక్షేపించారు. లక్షలాది భక్తులు వస్తారని తెలిసినా, కనీస ఏర్పాట్లు చేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైందని, చివరకు గోవిందమాల స్వాములనూ అడ్డుకున్న టీటీడీ తీరుపై అభ్యంతం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులను గాలికొదిలి... టీటీడీ వీఐపీల సేవలో ముగిని తేలడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో తొక్కిసలాటలు, శివలింగం ధ్వంసం వంటి వరుస అపచారాలు జరుగుతున్నాకనీస చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే... 

గోవిందరాజు స్వామి ఆలయ ఘటన ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే...
నిన్న తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయంలో ఒక ఉన్మాది ఆలయం లోపలి నుంచి పైకి ఎక్కి కలశాలను ధ్వంసం చేయడం అత్యంత ఆందోళనకరం. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, దేవాదాయ శాఖ, భద్రతా సిబ్బంది, విజిలెన్స్‌ అధికారుల ఘోర వైఫల్యమే. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది భక్తులు తిరుమ‌ల‌కు వస్తారని ముందే తెలిసినా, సరైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఒక ఉన్మాది ఆల‌యంపైకి ఎక్కడమే కాకుండా కలశాలను, దేవుడి విగ్రహాలను కాళ్లతో తన్ని ధ్వంసం చేయడం టీటీడీ పాలన మండలి పనితీరుకు నిదర్శనం. టీటీడీ బోర్డు మొత్తం సామాన్య భక్తులను పక్కన పెట్టి వీఐపీల సేవలోనే మునిగిపోయింది. గోవింద మాల వేసుకున్న భక్తులను కూడా అనుమతించకపోవడం అత్యంత బాధాకరం. చంద్ర‌బాబు కూటమి పాలనలో గత 20 నెలలుగా టీటీడీలో కోకొల్లలుగా అవకతవకలు జరుగుతున్నాయి. మద్యం, మాంసం యథేచ్ఛగా కొండపైకి వెళ్లడం, చెప్పులు వేసుకుని దర్శనానికి వెళ్లడం వంటి ఘటనలు జరుగుతున్నా పాలక మండలి చోద్యం చూస్తోంది. స్వామి వారికి జరగాల్సిన నిత్య సేవలు కూడా ఆలస్యమవుతున్నాయి, ఏకంగా ఎలక్ట్రానిక్‌ పరికరాలు స్వామివారి సన్నిధిలోకి తీసుకెళ్తున్నారు.

తిరుమలకు ఎవరూ రావద్దంటూ ప్రకటనలా?

వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతి, తిరుమలకు ఎవరూ రావద్దంటూ ప్రకటనలు చేయించిన చరిత్ర ఈ పాలక మండలికే దక్కుతుంది. “దేవుడి దగ్గరకు భక్తులు రావాల్సిన పనిలేదు, తిరుమలకు రాకున్నా నష్టం లేదు” అంటూ ప్రకటనలు చేయించడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. సామాన్య భక్తులను దూరం పెట్టి, వీఐపీలకు మాత్రం అడ్డంకులు లేకుండా ద‌ర్శ‌నాలు చేయించ‌డం ఎంతవరకు న్యాయం. ఆ రోజు ఎంతమంది వీఐపీలకు దర్శన టికెట్లు ఇచ్చారో ఆ జాబితాను  ప్రజల ముందుంచాలి.

వ‌రుస ఘ‌ట‌న‌ల నుంచి గుణ‌పాఠాలు ఏవీ?

గత ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు మృతి చెందారు, కాశీనాయన ఆశ్రమంలో కూల్చివేతలు, సింహాచలం ఆలయంలో గోడ కూలి భక్తుల ప్రాణాలు పోవడం వంటి ఘటనల నుంచి ప్రభుత్వం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు. ద్రాక్షారామంలో టీడీపీ కార్యకర్త శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటనను త్వరగా ముసుగు వేసి దాచిపెట్టింది. శాస్త్రోక్త విధానాలు పాటించకుండా హడావుడిగా శివలింగాన్ని ప్రతిష్టించడం ద్వారా ఆ పురాతన శివలింగానికి ప్రాముఖ్యత లేదన్నట్లుగా వ్యవహరించారు.

మంత్రి రాజీనామా చేయాలి క‌దా?

ఇటీవల విజయవాడ ఇంద్రకీలాద్రిలో అమ్మవారి దేవస్థానంలో మూడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం ఘోర తప్పిందం. ఆ సమయంలో దాదాపు 70 వేల మంది భక్తులు ఆలయంలో ఉన్నారు. దీనికి చిన్న అధికారిని బాధ్యుడిగా చేస్తూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. సీఎంవోకు తెలియ‌కుండా క‌రెంట్ స‌ర‌ఫ‌రా నిలిపివేశారా? ఇందుకు మంత్రి రాజీనామా చేయాలి క‌దా?. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా హిందూ దేవాలయాలకు భద్రత ఉండదు, గతంలో విజయవాడలో 40 గుళ్లు కూల్చిన చరిత్ర ఆయ‌న‌ది. తిరుమల లడ్డూలో కల్తీ, జంతు కొవ్వు క‌లిసిందంటూ  ఆరోపణలు చేసిన‌ రోజు నుంచే రాష్ట్రానికి అపచారం మొదలైంది. నేడు దేవాలయాలకు భద్రత లేదు, హుండీలకు భద్రత లేదు, గోశాలలో గోవులకు రక్షణ లేదు. నాణ్యతలేని ప్రసాదాలు పంపిణీ, అమాయక భక్తుల మరణాలు నిత్య‌కృత్యంగా మారాయి.

టెంపుల్‌ సిటీలో గోవిందరాజస్వామి ఆలయంలో ఒక ఉన్మాది విధ్వంసం చేస్తుంటే ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందని... హిందూ ధర్మాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోందని మల్లాది విష్టు నిలదీశారు. ఇకనైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఇప్పటివరకు జరిగిన అన్ని ఘటనలకు ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
 

Back to Top