వారం రోజులుగా అడ్రస్ లేని చంద్రబాబు, లోకేష్

కనీస సమాచారం లేకుండా విదేశీ పర్యటనలు

ఆచూకీ చెప్పాలని నిలదీస్తున్న ప్రజలు

మండిపడ్డ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నెల్లూరు వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

ప్రజలు నిలదీయడంతో మరోసారి డైవర్షన్ పాలిటిక్స్

పోర్భ్స్ పెట్టుబడులు పేరుతో తండ్రీకొడుకుల కట్టుకథలు 

కాగితాలమీద ప్రతిపాదనలనే పెట్టుబడులుగా చిత్రీకరణ

ప్రజలను మభ్యపెడుతూ కుట్రకు తెరతీసిన చంద్రబాబు, లోకేష్ 

ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

22ఏ జాబితాలో భూములు చేర్చిందే చంద్ర‌బాబు

పేద‌ల భూములు కాజేసేందుకు నాడు కుట్ర‌లు 

స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపించిన వైయ‌స్ జ‌గ‌న్ 

మా ప్రభుత్వంలో పరిశ్రమలు, తయారీ రంగంలో సౌత్ లోనే ఏపీ టాప్

వైయస్.జగన్ ప్రభుత్వంలో సింగిల్ విండో విధానం

సకాలంలో భూకేటాయింపులు, క్లియరెన్స్ లు

స్పష్టం చేసిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

వైయస్.జగన్ హ‌యాంలోనే స‌మ‌గ్ర భూస‌ర్వే

నాడు భూములు కాజేస్తున్నారంటూ దుష్ప్ర‌చారం 

ఇప్పుడు అదే విధానాల‌ను అవలంభిస్తూ తామే క‌నిపెట్టిన‌ట్టు ప్ర‌చారం 

కూటమి తీరుపై కాకాణి తీవ్ర ఆక్షేణ 

హైపర్ లూప్, డ్రోన్ ఇండస్ట్రీ, సెమీకండక్టర్ యూనిట్ పేరుతో ప్రచారం

ఒక్కటంటే ఒక్కటీ ఏర్పాటు చేయని కూటమి ప్రభుత్వం

ప్రకటనలు తప్ప.. కార్యరూపం దాల్చని హామీలు

చంద్రబాబు ప్రభుత్వంపై కాకాణి పైర్.

నెల్లూరు: రాష్ట్ర ప్రజలకు కనీస సమాచారమివ్వకుండా సీఎం చంద్రబాబు,ఆయన కుమారుడు లోకేష్ లు రహస్యంగా విదేశీ పర్యటనలకు వెళ్లడంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తండ్రీ కొడుకుల రహస్య పర్యటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే... దాన్నుంచి దృష్టి మరల్చడానికి మరలా డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే పోర్భ్స్ పెట్టుబడులు పేరుతో తండ్రీకొడుకుల కట్టుకథలు ప్రచారం చేస్తూ..  కాగితాల‌పై రాసుకున్న‌ ప్ర‌తిపాద‌న‌ల‌నే పెట్టుబ‌డులుగా చూపించి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే కుట్ర చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. వైయ‌స్.జగన్  హ‌యాంలో త‌యారీ, ప‌రిశ్ర‌మ‌ల రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించ‌డంలో ద‌క్షిణాదిలోనే ఏపీ ముందంజ‌లో ఉంద‌ని, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక పెట్టుబ‌డుల స‌ద‌స్సుల‌న్నీ ఫార్సుగా మారిపోయాయ‌ని తేల్చి చెప్పారు. గ‌తంలో 2014-19 మ‌ధ్య ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు గిట్ట‌ని వారి భూముల‌ను 22ఏ జాబితాలో చేర్చి ఎంతోమందికి తీర‌ని వేద‌న మిగిల్చితే, వైయ‌స్ జ‌గన్ సీఎం అయ్యాక ఆ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపించారని స్పష్టం చేశారు. హైపర్ లూప్, డ్రోన్ ఇండస్ట్రీ, సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు పేరుతో ప్రచారం చేసుకున్న... చంద్రబాబు వీటిలో కనీసం ఒక్కటంటే ఒక్కటీ ఏర్పాటు చేయలేదని, కేవలం ప్రచారం తప్ప.. ఒక్క ప్రాజెక్టూ పట్టాలెక్కలేదని ఫైర్ అయ్యారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.... 

● ర‌హ‌స్యంగా ఉండాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది?

పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డంలో త‌మ‌కు ఎవ‌రూ సాటిలేర‌న్న‌ట్టు, తమ ఘనత గురించి ఫోర్బ్స్ ఒక స్టోరీ రాసిందంటూ తండ్రీ కొడుకులు చంద్ర‌బాబు, లోకేష్‌లు సోష‌ల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు. చంద్రబాబుగారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయ‌న పెట్టుబడులన్నీ కట్టుకథలే త‌ప్ప ఏ ఒక్క‌టీ నిజం లేదు. చంద్ర‌బాబు రాష్ట్రంలోనే లేక‌పోయినా స‌రే రెవెన్యూ పుస్త‌కాల ముద్ర‌ణ, పంపిణీ గురించి చ‌ర్చించిన‌ట్టు ఎక్స్‌లో పోస్టులు పెట్టి ప్ర‌జ‌ల‌ను డైవ‌ర్ట్ చేస్తున్నారు. వారం రోజులుగా లోకేష్‌, చంద్ర‌బాబు క‌నిపించ‌డంలేద‌ని సోష‌ల్ మీడియాలో, రాష్ట్రంలో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతుంటే, బాధ్య‌త‌గా ఎక్క‌డున్నారో చెప్ప‌డం మానేసి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారు. బాధ్య‌తాయుత‌మైన రాజ్యాంగ ప‌ద‌వుల్లో ఉండి ఇలా ర‌హ‌స్య ప్ర‌దేశాల నుంచి ట్వీట్లు వేయ‌డం వెనుక ఉద్దేశం ఏమిటి? ఆఖ‌రుకి టీడీపీ అనుకూల మీడియాకి కూడా తండ్రీకొడుకులు ఆచూకీ చెప్ప‌డం లేదంటే ఏదో జ‌రుగుతుందోన‌న్న అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డుతున్నాయి. మా నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్ గారు గ‌తంలో త‌న కుమార్తె గ్రాడ్యుయేష‌న్ డే కోసం లండ‌న్ వెళ్తున్న‌ట్టు ప్ర‌క‌టించి వెళ్లినా స‌రే దాని గురించి ఈ తండ్రీకొడుకులు చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. కానీ చంద్ర‌బాబు, లోకేష్ ప్ర‌త్యేక విమానాలో విదేశాల‌కు వెళ్లి కూడా ఎక్క‌డున్నారో చెప్ప‌కుండా ర‌హ‌స్య జీవితం గడుపుతున్నారు. అంత ర‌హ‌స్యంగా ప‌ర్య‌ట‌నలు చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది?  

● అవన్నీ కార్య‌రూపం దాల్చే పెట్టుబ‌డులేనా?

వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతామంటూ వచ్చిన ప్రతిపాదనల్లో ఏపీ ముందు వరసలో ఉందనేది ఫోర్బ్స్ పత్రిక క‌థ‌నం సారాంశం. ఫోర్బ్స్ పత్రిక ఏం రాసిందో చాలా మంది ప్రజలకు తెలియ‌దు కాబ‌ట్టి దాన్ని త‌న‌కు అనుకూలంగా చంద్ర‌బాబు ప్ర‌చారం చేసుకుంటున్నాడు. కేవ‌లం  కాగితాల మీద చేసుకున్న ఎంవోయూల ఆధారంగా రూపొందించిన లెక్కలు చూపించి ఏపీని రూపురేఖ‌లు మార్చేసిన‌ట్టు తండ్రీకొడుకులు డ‌బ్బా కొట్టుకుంటున్నారు. వాస్తవ రూపంలోకి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు. మన పిల్లలకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. అనే వివ‌రాలు మాత్రం చెప్ప‌లేరు. ఎందుకంటే ఏమీ చేయ‌డం లేదు కాబ‌ట్టే. చంద్రబాబు చెప్పే పెట్టుబ‌డుల లెక్క‌లు ఆకాశంలో ఉంటే, వాస్త‌వాలు అందుకు భిన్నంగా ఉంటాయి. 2014-19 మధ్య గ‌త టీడీపీ హ‌యాంలో భాగస్వామ్య సదస్సుల ద్వారా 1,761 ఒప్పందాల జ‌రిగితే రూ. 18.87 లక్షల కోట్ల పెట్టుబడులు వ‌చ్చిన‌ట్టు, 30.91 లక్షల మందికి ఉపాధి వస్తుందని ఊదరగొట్టారు. కానీ నిజానికి వాటిలో 10 శాతం మాత్ర‌మే కార్య‌రూపం దాల్చాయి.  పరిశ్రమల శాఖ స్వయంగా కుదుర్చుకున్న రూ. 7.68 లక్షల కోట్ల విలువైన 327 ఒప్పందాల్లో వాస్తవంగా అమల్లోకి వచ్చినవి 45 మాత్రమే. అంటే కార్యరూపంలోకి వచ్చినవి 13 శాతం లోపే. అలాగే 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో మొత్తం 17 సార్లు ఎస్ఐపీబీ (SIPB) సమావేశాలు జరిగితే అందులోరూ.  1.70 ల‌క్ష‌ల కోట్ల విలువైన 91 మెగా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటిలో అమల్లోకి వచ్చినవి కేవలం 5.69 శాతం మాత్రమే. 2014-19 మధ్య మూడుసార్లు నిర్వహించిన సీఐఐ (CII) సదస్సు సహా అనేక సందర్భాల్లో చంద్రబాబు పెట్టుబడులు, పరిశ్రమలపై గొప్పగా ప్రకటనలు చేశారు. వీటిలో ఏ ఒక్క‌టీ అమ‌లు కార్య‌రూపం దాల్చ‌లేదు. 

● వీటిలో ఒక్క‌టైనా వ‌చ్చిందా?

అమరావతి నుంచి విశాఖ నిమిషాల్లో చేరుకునే హైపర్లూప్ అన్నారు. దొనకొండ వద్ద డ్రోన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుఖోయ్ ఎయిర్క్రాఫ్ట్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ కలిపి యూనిట్ ఏర్పాటు అన్నారు. నెక్స్ట్ ఆర్బిట్ వెంచర్స్ ద్వారా సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్స్ యూనిట్ అన్నారు. కాకినాడ వద్ద పెట్రో కెమికల్ యూనిట్ వస్తోందని హడావుడి చేశారు. టైటాన్ ఏవియేషన్ విమానాల తయారీ అన్నారు. స్విట్జర్లాండ్‌కి చెందిన ఏరోస్పేస్ వెంచర్స్ రూ.10 వేల కోట్ల పెట్టుబడి అన్నారు.  ఎయిర్ బస్ అన్నారు, మైక్రోసాఫ్ట్ అన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీకి విశాఖ కేరాఫ్ అన్నారు. వీటిలో ఏ ఒక్క‌టీ ఏపీకి రాలేదు.  

● వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో 91.6 శాతం కార్య‌రూపం

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో 2023 గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో మొత్తం 394 ఒప్పందాలు చేసుకుంటే, రూ.13.15 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, త‌ద్వారా 6.16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని లక్ష్యంగా పెట్టుకున్నాం. మొదటి ఏడాదిలోనే 20% కార్యరూపం దాల్చాయి. అందులో పరిశ్రమల శాఖ ద్వారా 99 ఒప్పందాలు చేసుకుంటే, 91 శాతం స్ట్రైక్ రేటు సాధించాం. ఆ ఒప్పందాలు జరిగిన రెండేళ్లలోపే 90కి పైగా యూనిట్లు నిర్మాణ పనులు ప్రారంభించగా, వాటిలో 39 కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తిని కూడా ప్రారంభించి వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పరిశ్రమల శాఖకు సంబంధించి మొత్తం పెట్టుబడుల్లో 91.6 శాతం అంటే రూ.  6,01,071 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు స్వయంగా చంద్రబాబు ప్రభుత్వమే ప్రకటించింది. చంద్రబాబు హయాంలో 2014-19 మధ్య ఏడాదికి వచ్చిన పెట్టుబడులు సగటున రూ.12 వేల కోట్లే. రెండేళ్లపాటు కోవిడ్ ఉన్నా సరే వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో వచ్చిన పెట్టుబడులు సంవత్సరానికి సగటున దాదాపుగా రూ.15,700 కోట్లు. పరిశ్రమల విషయంలో ఇదీ మా ప్రభుత్వ స్ట్రైక్ రేట్.

● నాడు త‌యారీ, ప‌రిశ్ర‌మ‌ల రంగాల్లో సౌత్‌లో ఏపీ టాప్‌ 

పెట్టుబడి సదస్సులనేవి ఫార్స్ గా మారకూడదని వైయ‌స్ జ‌గ‌న్ గారు చెప్పేవారు. వీలైన‌న్ని వాస్తవ రూపంలోకి రావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తరఫు నుంచి మానిటరింగ్, ఇంప్లిమెంటేషన్ ప్యానల్ ను చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఏర్పాటు చేశాం. పరిశ్రమల శాఖ అధికారులు, సీఎంఓ అధికారులు ప్రతివారం సమావేశమై ఒప్పందాలు కుదుర్చుకున్న పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ వాస్తవరూపం దాల్చడానికి ఒక ఫాస్ట్ ట్రాక్ మార్గాన్ని ఏర్పాటు చేశాం. సింగిల్ విండో పద్ధతుల్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. భూకేటాయింపులు, క్లియరెన్సులు, టైమ్ లైన్ లోగా ఇప్పించే ప్రయత్నాలు చేశాం. పారిశ్రామిక వేత్తలకు ఒక ఫోన్ కాల్ దూరంలో ఉండేవాళ్లం. అందుకనే మా స్ట్రైక్ రేటు ఈ స్థాయిలో ఉంది. కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ.. దీనికి పూర్తి విరుద్ధంగా, 2019-24 కాలంలో దక్షిణ భారతదేశంలో తయారీ రంగ జీవీఏ వృద్ధిలోనూ, మొత్తం పరిశ్రమల రంగ జీవీఏ వృద్ధిలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఇది పూర్తిగా వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన విధానాల ఫలితమే. ఈ వాస్తవ గణాంకాలు, 2019-24 కాలంలో “బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ నాశనం అయింది” అంటూ టీడీపీ ఏళ్ళ తరబడి ప్రచారం చేసిన అబద్ధాలను పూర్తిగా బట్టబయలు చేస్తున్నాయి. 

● 22 ఏలో భూములు చేర్పించింది చంద్రబాబే

రెవెన్యూ సమస్యలను తామే పరిష్కరిస్తున్న‌ట్టుగా కూట‌మి ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటోంది. అసలు 22ఏ జాబితాలో భూములను పెట్టిందే చంద్రబాబైతే ఆ భూముల విషయంలో ఒక వక్రీకరణతో కూడిన ప్రచారం చేస్తోంది. 2014-19 మధ్య వెబ్ ల్యాండ్ పేరు చెప్పి, ఎమ్మార్వో కార్యాలయాల్లో టీడీపీ కార్యకర్తలను, వారికి సంబంధించిన మనుషులను పెట్టి గిట్టనివారి భూములన్నింటినీ 22ఏలో పెట్టారు. ఆ రోజు నుంచి భూ యజమానులు నానా అవస్థలు పడుతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ బాధితుల‌కు ఊర‌ట కలిగింది. 2024లో మ‌ళ్లీ చంద్ర‌బాబు సీఎం అయ్యాక అసైన్డ్ భూములు, ఇతరత్రా కేటగిరీల భూములకు సంబంధించిన ఫ్రీ హోల్డ్ విషయంలో నానా ఆరోపణలు చేసి, ఇప్పటికీ భూ యజమానులను నానా కష్టాలకు గురిచేస్తున్నారు. అక్రమాలు జరిగాయని ఎన్ని ఆరోపణలు చేసినా  ఎలాంటి ఆధారాలు లేవని మీ అధికారులే చెప్పారు. 

● అమ‌రావ‌తిలో పేద‌ల భూములు కాజేసింది మీరు కాదా? 

నిజంగా అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడింది కూడా టీడీపీ నాయ‌కులే. 2014-19లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదలకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. రాజధాని అని పేరు చెప్పి అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను మభ్యపెట్టి, మోసం చేసి 1100 ఎకరాలు కొట్టేశారు. అసైన్డ్ దారుల చేతిలో భూములు ఉంటే పరిహారం రాదని, ప్లాట్లు రావని ఒక పథకం ప్రకారం ప్రచారం చేసి లాగేసుకుని ఆ తర్వాత జీవో ఇచ్చి, వాటిని పప్పుబెల్లాలకు కొనుగోలు చేసి, చేతులు మారిన తర్వాత అవే భూములను పూలింగ్ లోకి  తీసుకుని ప్లాట్లు కేటాయించుకుని, వాటిని తిరిగి అమ్ముకుని కోట్లు కొల్లగొట్టారు. 1336 మంది బినామీలు ఇలా ఉన్నారు. ఆ కేసులను కూడా ఇప్పుడు చంద్రబాబునాయుడు ఎత్తివేయించుకున్నాడు. తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. 

● అసైన్డ్ భూముల స‌మ‌స్య‌కు జ‌గ‌న్ ప‌రిష్కారం

అసైన్డ్ భూముల సమస్య ఈనాటిది కాదు. ఈ భూములు ఉన్న పేదలు, రైతులు అందరూ దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారు. భూమి ఉన్నా క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు అమ్ముకోలేని ప‌రిస్థితి. రికార్డుల్లో ఒక పేరు.. భూమి దగ్గరకు వస్తే, సంవత్సరాల తరబడి మరొకరి పేరు. దేనికీ పొంతన లేదు. అందుకే పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వైయ‌స్ జ‌గ‌న్ గారు సీఎం అయ్యాక అసైన్డ్ చట్టానికి సవరణలు చేసింది. గత ఏడాది అక్టోబరు 27న దీనికి సంబంధించిన గెజిట్ జారీ అయ్యింది. చట్టానికి సవరణలు చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడా అవినీతి లేదా ఒరిజనల్ అసైన్డ్ దారులకు ఎలాంటి నష్టం రాకుండా సీనియర్ అధికారులు, న్యాయనిపుణులు, సీనియర్లు అంతా కలిసి కూర్చుని చక్కటి నిర్ణయాలు తీసుకుని చట్టానికి సవరణలు చేశారు. ఒరిజనల్ అసైనీలకు మాత్రమే న్యాయబద్ధంగా, తమ ఇష్టపూర్వకంగా అవసరానికి అమ్ముకునే హక్కును కల్పించారు. ఒకవేళ ఇప్పటికే చేతులు మారిన సందర్భాల్లో కూడా  కొనుక్కున్న వారికి కాకుండా ఒరిజనల్ అసైన్డ్ దారులకు మాత్రమే పూర్తి హక్కులు వచ్చేలా ఈ చట్టం పూర్తిగా పేదలకు అండగా నిలిచింది. మరి ఇలాంటి సందర్భాల్లో కుంభకోణాలకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? 

● 9 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు మోక్షం 

ఈ చట్టం చేస్తున్న సమయంలో చాలామంది చాలా రకాల ఒత్తిళ్లు తెచ్చారు. అసైన్డ్ దారుల  నుంచి కొనుగోలు చేసి 20 సంవత్సరాలు పూర్తయిన వారికి లేదా పదేళ్లు పూర్తయిన వారికి సర్వహక్కులు కల్పించేలా సవరణల్లో చోటు కల్పించాలని డిమాండ్ చేసినా వైయ‌స్ జ‌గ‌న్ గారు ససేమిరా అన్నారు. అలా  చేస్తే మొత్తం ఉద్దేశం నీరుగారిపోయే ప్రమాదం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒరిజనల్ అసైన్ దారుల‌కు తప్ప వేరొకరికి అవకాశం ఇవ్వొద్దని తేల్చిచెప్పారు. ప్ర‌తి విష‌యంలోనూ ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. ఈ రకంగా దాదాపు 9 లక్షల ఎకరాలను 22 ఏ నుంచి తొలగించారు. అలాంటిది కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక రిజిస్ట్రేషన్లు నిలిపేయమని, ఫ్రీ హోల్డ్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చి భూ యజమానులు ఇబ్బంది పెడుతున్నారు. నిజానికి అసైన్డ్ భూములు కానీ, చుక్కల భూములు కానీ, షరతు గల పట్టాల భూములు కానీ.. రైతులు నానా ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో, వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరవాతే వారికి మేలు జరిగింది. 27.40 లక్షల ఎకరాలకు సంబంధించి 15.2 లక్షల మంది రైతులకు మేలుచేసింది. 22ఏ నుంచి మినహాయించామంటూ రెవెన్యూ మంత్రి మేమే చేస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. మా హయాంలో సమగ్ర సర్వే జరిగితే రైతుల భూములు పోతాయని తప్పుడు ప్రచారం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ ని భూతంగా చూపారు. ఇప్పుడు మళ్లీ సమగ్ర సర్వే అంటూ.. మా పద్ధతులే ఫాలో అవుతున్నారు. 

● బెదిరించి లాక్కుంటున్నారు

ఇప్పుడు టీడీపీ ఎక్కడ అసైన్డ్ భూములుంటే అక్కడ వాలిపోతున్నారు. రూపాయి భూమిని ఇప్పుడు పది పైసలకు, పావలాకు అడిగి అధికార బలాన్ని ప్రయోగించి భూములు కొట్టేస్తున్నారు. ప్రభుత్వం మాది, మీకు హక్కులు ఇచ్చేది లేదని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు పంచేసుకుని వారి ముఠాలను రంగంలోకి దించి వసూళ్లకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి.. చట్ట సవరణల ద్వారా లబ్ధి పొందిన పేదలను కూడా బెదిరించి, లొంగదీసుకుని ఆ భూ వ్యవహారాలను తిరిగి తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

Back to Top