గోవిందరాజస్వామి ఆలయ అపచారం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం

రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం ప్రజలనే కాదు భగవంతున్ని కూడా మోసగిస్తోందనడానికి తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో జరిగిన అపచారమే నిదర్శనమని  వైయ‌స్ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ  విమర్శించారు. గురువారం రాజమహేంద్రవరంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, మద్యం మత్తులో పవన్‌ కళ్యాణ్‌ అభిమాని చేసిన దారుణాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనించాలని అన్నారు. సనాతనవాదినని చెప్పుకునే పవన్‌ కళ్యాణ్‌ ఈ ఘటనపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. గత 18 నెలల్లో భగవంతుడి వద్ద ఎన్నో ఘోర అపచారాలు జరిగాయని ప్రజలు చూస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నాలు రాష్ట్రానికి ఎంత అపచారం చేశాయో గుర్తుచేశారు. తిరుపతిలో తొక్కిసలాటలు, సింహాచలంలో, కాశీబుగ్గలో జరిగిన ఘటనల్లో ఎంతమంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయారో ప్రభుత్వం గమనించిందా అని నిలదీశారు.

ద్రాక్షారామంలో జరిగిన ఘటనలో హడావుడిగా మరో విగ్రహాన్ని ప్రతిష్టించి, మొక్కుబడిగా కార్యక్రమం ముగించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. భగవంతున్ని కూడా రాజకీయాల కోసం వాడుకోవడం ఇంతకంటే దారుణమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. గోవిందరాజస్వామి ఆలయంలో జరిగిన అపచారం చూస్తే రాష్ట్రంలో మద్యం మత్తు ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ఆత్మస్తుతి, పరనిందకే పరిమితమైందని, వాస్తవ సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆలయాలకు నిజంగా భద్రత ఉందా అని కూటమి నాయకులను ప్రశ్నిస్తున్నానని, గోవిందరాజస్వామి ఆలయంలో జరిగిన మహాపచారంపై ఇప్పుడైనా ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్‌ చేశారు.
 

Back to Top