దేవుడి పేరుతో రాజకీయం.. వీళ్లు మనుషులేనా..? 

దేవుడి విగ్రహాలను ధ్వంసం చేస్తే ఎవరికీ లాభం..?

ఎవరిని టార్గెట్‌ చేసి ఈ దుర్మార్గాలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలి

దేవుడి పేరుతో రాజకీయ లబ్ధిపొందే కలియుగ క్లైమాక్స్‌లో మనం ఉన్నాం

ప్రభుత్వానికి వచ్చే మంచిపేరును తట్టుకోలేక ప్రతిపక్షం కుట్రలు

ప్రజల దృష్టిని డైవర్ట్‌ చేయడానికి ఆలయాలపై దాడులు

పొలిటికల్‌గా జరుగుతున్న గొరిల్లావార్‌ ఫేర్‌ను కూడా అరికట్టాలి

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్లు అసలు మనుషులేనా..?

పోలీస్‌ డ్యూటీ మీట్‌ ప్రారంభంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: పోలీస్‌ శాఖ పనితీరు, ఆలోచన తీరును మార్చేందుకు, అవగాహన పెంచుకునేందుకు పోలీస్‌ డ్యూటీ మీట్‌ చాలా ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇక నుంచి ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డ్యూటీ మీట్, ఇగ్‌నైట్‌ అని రెండూ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గత ఆరు సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాన్ని జరపలేదని, మంచి సంప్రదాయానికి ఈ రోజు మన ప్రభుత్వం నాంది పలికిందన్నారు. డ్యూటీ మీట్‌లో పోలీస్‌ సిబ్బంది వాళ్లకున్న స్కిల్స్‌ అని ప్రదర్శిస్తారని, ఎలాంటి నేరాలకు.. ఏరకమైన విచారణ చేస్తారు.. ఆధారాలను ఏరకంగా సేకరించి దర్యాప్తు చేస్తారనేది చూపిస్తారన్నారు. 

ఇంకా మెరుగైన పనితీరు కోసం ఇగ్‌నైట్‌ (స్ఫూర్తిని రగిలించే) కార్యక్రమం ద్వారా పోలీసులు అవగాహన పొందుతారని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. సైబర్‌ క్రైమ్స్, మహిళా భద్రత, టెక్నాలజీ వినియోగం, బెటర్‌ మెథడాలజీ, బెస్ట్‌ ప్రాక్టీసెస్‌పై చర్చలు జరుగుతాయన్నారు. ఇందు కోసం పేరొందిన టెక్నాలజీ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారని, సైబర్‌ సెక్యూరిటీ, మహిళా రక్షణ రెండూ అంశాలపై నాలుగు రోజుల పాటు చర్చ జరుగనుందన్నారు. 

పోలీస్‌ డ్యూటీ మీట్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మంచి కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వానికి వచ్చే మంచి పేరును తట్టుకోలేక ఎలాగైనా ప్రజల దృష్టిని మరల్చాలని ప్రతిపక్షాలు  దుష్ట కార్యక్రమాలకు పాల్పడుతున్నాయి. ‘దేవుడి విగ్రహాలను పగులగొడితే ఎవరికీ లాభం..? ఆలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో అరాచకాలు చేస్తే ఎవరికీ లాభం..? ఉద్రేకాలు రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం..? ప్రజా విశ్వాసాలను దెబ్బతీసి విష ప్రచారాలు చేస్తే ఎవరికీ లాభం..? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి. ఎవరిని టార్గెట్‌ చేసి ఈ దుర్మార్గాలు చేస్తున్నారో ప్రజలు కూడా ఆలోచించాలి. కలియుగం క్లైమాక్స్‌లో ఇలాంటి అన్యాయమైన మనుషుల మధ్య ఉన్నామని మనమంతా గమనించాల్సిన అవసరం ఉంది’ అని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు.

ఇంకా సీఎం ఏం మాట్లాడారంటే..

‘క్రైం చేసేవారి మనసత్వాలు కూడా పూర్తిగా మారినట్లుగా కనిపిస్తున్నాయి. ఏ సమాజం తీసుకున్నా.. ఏకాలం చూసుకున్నా.. ఏ మతవిశ్వాసాలను గమనించినా.. రెండు శక్తులు కనిపిస్తాయి. ఎప్పుడూ చెడు చేస్తూ.. చెడుపై ఆధారపడి బతికే శక్తులు కొన్ని కనిపిస్తాయి. నాణెంకు రెండో సైడ్‌ ఆ చెడును అడ్డుకుంటూ మంచిని కాపాడేశక్తులు మరోవైపు కనిపిస్తాయి. 

గడిచిన 18 నెలల పరిపాలనలో.. నా మొట్టమొదటి కలెక్టర్లు, ఎస్పీలతో కాన్ఫరెన్స్‌లో గత ప్రభుత్వం ఏ రకమైన సంకేతాలు ఇచ్చింది.. మన ప్రభుత్వం వచ్చాక ఎలాంటి మెసేజ్‌లు ఇచ్చాం అని బేరీజు వేసుకుందాం. గతంలో మా వాళ్లు ఏం చేసినా చూసిచూడనట్లు పోవాలని ఏమాత్రం జంకు లేకుండా.. కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలిచ్చారు. 

అదే కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్‌లో మన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు. ‘ అన్యాయం ఎవరు చేసినా పార్టీలు, రాజకీయాలు చూడాల్సిన అవసరం లేదు. కులాలు, మతాలు చూడాల్సిన అవసరం లేదు.. తప్పు ఎవరు చేసినా తప్పే.. మావాళ్లు చేసినా వదిలేయొద్దు’ అని ఆదేశాలిచ్చాం. న్యాయం, ధర్మం అనే రెండు అంశాలను పరిగణలోకి తీసుకొని అడుగులు వేయాలని ఆదేశిచ్చాం. 

రాజకీయాలు ఎలా మారిపోయాయి అంటే.. నిజంగా ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. మన 18 నెలల పాలన ప్రతిపక్షాల్లో భయాన్ని పుట్టించాయేమో..  18 నెలల కాలంలో కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీలు చూడకుండా అర్హత ఒక్కటే ప్రాతిపదికన తీసుకొని ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చాం. ప్రతిసంక్షేమ పథకం కూడా మనకు ఓటు వేయని వారికి కూడా అందాలని ఆరాటపడ్డాం. సంక్షేమ పథకాలు వివక్ష, అవినీతికి తావులేకుండా అర్హులకు అందిస్తున్నాం. లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లోకి నేరుగా బదిలీ చేస్తున్నాం. అక్కచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం కనిపిస్తుంటే.. తట్టుకోలేని పరిస్థితుల్లోకి ప్రతిపక్షం పోయిన పరిస్థితులు గమనిస్తున్నాం. 

ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కష్టం అని, ప్రతిపక్షాలు కుట్రలు, కుయుక్తులు పన్నుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. పూర్వపు రోజుల్లో పోలీస్‌ శాఖ ఎటువంటి నేరాలను విచారించేదంటే.. వస్తువులు ఎత్తుకెళ్లే దొంగతనం కేసులను, తాళాలు పగలగొట్టే కేసులు విచారణ చేసేవాళ్లు. కాలాలు మారాయి.. సైబర్‌ నేరాలు, సోషల్‌ మీడియా పేరుతో యధేశ్చగా అబద్ధాలు చెప్పే యుగంలో ఉన్నాం. వైట్‌ కాలర్‌ నేరాలు కూడా పెరిగిపోయాయి. యుగం మారింది.. కలియుగంలో క్లైమాక్స్‌ పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

దేవుడు అంటే భక్తి, భయం లేని పరిస్థితికి వ్యవస్థ దిగజారిపోయింది. రాజకీయాల కోసం కొందరు దేవుడిని కూడా వదలడం లేదు. దేవుడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి.. దేవుడి ద్వారా చేసే రాజకీయాల్లో కూడా లబ్ధిపొందాలనే దారుణమైన కలియుగం క్లైమాక్స్‌లో ఉన్నాం. దేవుడి విగ్రహాలతో చెలగాటం ఆడుతున్న పరిస్థితులు చూస్తే.. వీళ్లు మనుషులేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇటువంటి నేరాలను కూడా ఎక్కడో ఒక చిన్న గ్రామంలో అర్ధరాత్రి పూట.. మనుషులు లేని సమయంలో దేవుడి విగ్రహాలను విరగొట్టి.. మరుసటి రోజు సోషల్‌ మీడియాల్లో.. మరో రోజు ప్రతిపక్ష పార్టీల నాయకులు అక్కడకు వెళ్లి.. రచ్చ చేయడం, దానికి పబ్లిసిటీగా ఎల్లో మీడియా టీవీలు, పత్రికల్లో చూపించడం. 

కులాలను, మతాలను ఈ మాదిరిగా రెచ్చగొట్టే పరిస్థితి చూస్తుంటే.. ఎటువంటి నేరాలపై మనం విచారణ చేయాల్సిన పరిస్థితి ఉందో ఆలోచన చేయాలి. ఏరకంగా మనం ఇటువంటి నేరాలను విచారణ చేయాలో అవగాహన పొందాలి. టెక్నాలజీని, పనితీరును మెరుగుపరుచుకునే అడుగులు వేయాలి. 

దేవుడి విగ్రహాలను పగులగొడితే ఎవరికీ లాభం..? ఆలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో అరాచకాలు చేస్తే ఎవరికీ లాభం..? ఉద్రేకాలు రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం.. ప్రజా విశ్వాసాలను దెబ్బతీసి విష ప్రచారాలు చేస్తే ఎవరికీ లాభం..? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి. ఎవరిని టార్గెట్‌ చేసి ఈ దుర్మార్గాలు చేస్తున్నారో ప్రజలు కూడా ఆలోచించాలి. కలియుగం క్లైమాక్స్‌లో ఇలాంటి అన్యాయమైన మనుషుల మధ్య ఉన్నామని మనమంతా గమనించాల్సిన అవసరం ఉంది. 

ప్రభుత్వం నుంచి మంచి కార్యక్రమం ఏదైనా జరుగుతుందంటే.. ఆ కార్యక్రమానికి పబ్లిసిటీ ఎక్కడొస్తుందో అనే కడుపుమంటలతో మంచి కార్యక్రమాన్ని డైవర్ట్‌ చేయడానికి చేసిన కుట్రలో భాగంగా దేవుడి ఆలయాలను కూడా వదిలిపెట్టకుండా దిగజారుడు పరిస్థితులు చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. 

తొమ్మిది ఉదాహరణలు.. 

 • 2019 నవంబర్‌ 14న ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించాలని ఒంగోలులో ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం ప్రారంభించాం. పేదల కోసం చేస్తున్న ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలని చెప్పి.. ఆ రోజున గుంటూరులో దుర్గగుడి ధ్వంసం అంటూ రచ్చ చేశారు. తీరా చూస్తే పచ్చి అబద్ధం. గుడి రోడ్డుకు అడ్డంగా ఉందని, వేరే చోట గుడి నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేశాకే.. రోడ్డు విస్తరణ చేపట్టారు. కానీ, అదే రోజు సోషల్‌ మీడియాలో గుడి కూల్చేశారని రచ్చ చేశారు. 
 • 21 జనవరి 2020 పిఠాపురంలో ఆంజనేయస్వామిలో 23 విగ్రహాలు ధ్వంసం అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం. దీనికి సరిగ్గా వారం ముందు జనవరి 15న దేశ చరిత్రలో తొలిసారిగా రైతులకు అండగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కార్యక్రమం ప్రారంభించాం. ఆ కార్యక్రమానికి పబ్లిసిటీ రాకూడదని ఆంజనేయస్వామి గుడిలో విగ్రహాలు ధ్వంసం అంటూ ప్రచారం చేశారు. 
 • 8 ఫిబ్రవరి 2020న మహిళా రక్షణ కోసం రాజమండ్రిలో తొలి దిశా పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభించాం. దానికి పబ్లిసిటీ రాకూడదని.. డైవర్ట్‌ కార్యక్రమం చేశారు. ఒక్క దిశా పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభిస్తే మూడు ఘటనలు చేశారు. 
 • 11 ఫిబ్రవరి 2020లో రొంపిచర్లలో వేణుగోపాలస్వామి ఆలయ విగ్రహాలు ధ్వంసం చేశారు. 
 • 13ఫిబ్రవరి 2020లో ఉండ్రాజవరం మండలంలో సూర్యపుపాలెం అమ్మవారి గుడి ముఖద్వారం ధ్వంసం చేశారు. 
 • 14 ఫిబ్రవరి 2020లో నెల్లూరు జిల్లాలో కొండ్రిబిట్టలో ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ రథం దగ్ధం చేశారు. 
 • 7 సెప్టెంబర్‌ 2020లో 55,607 అంగన్‌వాడీల్లో 31.16 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ధిచేకూరేలా తల్లీబిడ్డా వికాసం కోసం వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. ఒక్క రోజు ముందు 6 సెప్టెంబర్‌ 2020లో అంతర్వేదిలోని శ్రీలక్ష్మినరసింహస్వామి రథం దగ్ధం చేశారు. 
 • 11 సెప్టెంబర్‌ 2020లో 87 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చేలా వైయస్‌ఆర్‌ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించాం. రూ.6,700 కోట్ల పైచిలుకు చెల్లించి మేలు చేశాం. రాష్ట్రంలో ఉన్న పేద మహిళలు అంతా తమ కష్టం తెలిసిన నాయకుడు వచ్చాడని వారి ముఖాల్లో కనిపిస్తుంది. దానికి సరిగ్గా రెండ్రోజులకు 13 సెప్టెంబర్‌ 2020లో విజయవాడ దుర్గగుడి రథానికి చెందిన వెండి సింహాలు మాయం చేశారు. 
 • రైతన్నల పొలాలకు జలసిరులు అందించేందుకు.. రైతుల పొలంలో బోరు వేయించడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ ‘వైయస్‌ఆర్‌ జలకళ’ కార్యక్రమాన్ని 28 సెప్టెంబర్‌ 2020లో మొదలుపెడుతున్నామని చెప్పాం. సరిగ్గా రెండ్రోజుల ముందు సెప్టెంబర్‌ 25న నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని తుంబూరు నందు ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం. 
 • 8 అక్టోబర్‌ 2020న విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తూ జగనన్న విద్యాకానుక ప్రారంభించి.. విద్యార్థులకు అండగా ఉన్నామని భరోసా ఇవ్వడానికి మన ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సరిగ్గా మూడు రోజుల ముందు అక్టోబర్‌ 5న కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో నరసింహ స్వామి శేషపడుగలు ధ్వంసం. 
 • 16 అక్టోబర్‌ 2020న వెనుకబడిన వర్గాలైన బీసీలకు 56 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని వెనుకబడిన వర్గాలకు మంచి చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. తార్లపాడు గ్రామం వీరభద్రస్వామి ఆలయ గోపురం ధ్వంసం అంటూ ఆ తరువాతి రోజే 17 అక్టోబర్‌ 2020న మీడియాలో ప్రచారం. 
 • దేశంలో ఎక్కడా లేని విధంగా, ఎవరూ చేయని విధంగా రాష్ట్రంలోని 30 లక్షల పైచిలుకు పేద అక్కచెల్లెమ్మలకు ఇస్తుంటే.. తిరుపతి ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన పూర్ణకుంభం లైటింగ్‌ను దూరం నుంచి ఫొటో తీసి సిలువ అంటూ విష ప్రచారం చేశారు. 
 • విజయనగరంలో ఇళ్ల పట్టాలు పంచేందుకు జగన్‌ అక్కడకు వస్తున్నాడని తెలిసి.. జగన్‌ వెళ్లే స్థలానికి సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాలయంలో రాములవారి విగ్రహంపై దాడి. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రాజమండ్రిలో సుబ్రహ్మణ్యం స్వామి గుడిలో దాడి. 

ఆశ్చర్యం ఏంటంటే.. చాలా ఆలయాలు ఎండోమెంట్‌ పరిధిలోకి కూడా రావు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉన్న గుడులు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జనసంచారం లేని సమయంలో.. అర్ధరాత్రి పూట జరిగిన ఘటనలు. మరుసటి రోజు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తారు.. వాళ్లకు ఉన్న ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్లు అసలు మనుషులేనా అనిపిస్తుంది. 

మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమాలు.. ఇలాంటి నేరాలను మనం డీల్‌ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఉదాహరణకు చెప్పాను. టెక్నాలజీని ఉపయోగించుకొని ఏరకంగా పనితీరు, ఆలోచన తీరును మార్చుకునేందుకు ఇగ్‌నైట్‌ కార్యక్రమం చేపట్టామో.. అందులో భాగంగా.. పొలిటికల్‌గా జరుగుతున్న గొరిల్లావార్‌ ఫేర్‌ను కూడా అరికట్టాలి. ప్రభుత్వానికి, పోలీసులకు కావాలని చెడ్డపేరు తీసుకువచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి వెళ్లకుండా పబ్లిసిటీని డైవర్ట్‌ చేయాలనే దుర్మార్గపు బుద్ధితో చేస్తున్న కుట్రలను కూడా చేధించాలి. వీటిపై చర్చ జరగాలి.. ఎలా అరికట్టాలనే ఆలోచనలు రావాలి. 

ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా 20 వేల దేవాలయాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలను అమర్చాం. కానీ ఎక్కడో మారుమూల గుడిలో ఘటనలు చేసి.. మరుసటి రోజు ఈనాడు, ఆం«ధ్రజ్యోతి, టీవీ5 ఇలాంటి వారు రెచ్చగొట్టడం. రాజకీయ నాయకులు కూడా లబ్ధిపొందడానికి పద్ధతి ప్రకారం కుట్రలు పన్నుతున్నారు. మన ఆలోచనలు మారాలి.. ఇగ్‌నైట్‌ కార్యక్రమాల్లో దీన్ని కూడా చేర్చి చర్చించాలని విన్నవించుకుంటున్నాను. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top