నా తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు చదువే నేనిచ్చే ఆస్తి

చదువుతోనే మన జీవితాల రూపురేఖలు మారుతాయి

3 ఏళ్ల చిన్నారి నుంచి ఇంజనీరింగ్‌ విద్యార్థి వరకు ప్రతి అడుగులోనూ తోడున్నాం

జగనన్న విద్యా దీవెన ద్వారా 10.88 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

చరిత్రలో లేని విధంగా తల్లుల ఖాతాల్లోకి ఫీజురీయింబర్స్‌మెంట్‌ నగదు

9,79,445 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.671 కోట్లు జమ 

కాలేజీలకు గత ప్రభుత్వం పెట్టిన రూ.1880 కోట్ల బకాయిలు తీర్చేశాం

కాలేజీల్లో, ఫీజురీయింబర్స్‌మెంట్‌లో సమస్య ఎదురైతే ‘1902’కు ఫోన్‌ చేయండి

విద్యా దీవెన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ‘చదువుతోనే మన జీవితాల రూపురేఖలు మారుతాయి. చదువుతోనే పేదరికం నుంచి బయటపడగలుగుతామని మనసా.. వాచా.. కర్మణా నమ్ముతున్నా. చదువు అనేది నా తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు ఇస్తున్న ఒక ఆస్తి అని గర్వంగా చెబుతున్నా’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మూడేళ్ల్ల చిన్నారి నుంచి ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థి వరకు ప్రతి అడుగులోనూ ఆ పిల్లలకు తోడుగా ఉంటూ, అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటూ ఆ కుటుంబంలో సభ్యుడిని అయ్యినందుకు సంతోషంగా ఉందన్నారు. రూ. 671 కోట్లతో అక్షరాల 9,79,445 మంది తల్లులకు దాదాపు 10.88 లక్షల మంది పిల్లలకు మేలు జరిగించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంతో పిల్లలకు, తల్లులకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. 

జగనన్న విద్యా దీవెన పథకం కింద 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజురీయింబర్స్‌మెంట్‌ మొదటి విడత నగదును తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. అంతకు ముందు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధికారులను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

సీఎం ఏం మాట్లాడారంటే.. 

‘‘అందరి జీవితాలు బాగుపడుతున్నాయని ప్రతి మంత్రి, సెక్రటరీ సంతోషంగా చెప్పే గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం నా ద్వారా జరగడం దేవుడు నాకిచ్చిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ నెల 14న బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతిని కూడా జరుపుకున్నాం. భారత రాజ్యాంగాన్ని రాసిన కమిటీకి అధ్యక్షులు అంబేద్కర్‌. ఒక పేద కుటుంబంలో, ఒక దళిత కుటుంబంలో అప్పటి సమాజంలో చదవడానికి కూడా వీల్లేని కుటుంబంలో పుట్టిన వ్యక్తి.. ఎలా ఎదిగాడు అనేది.. చివరకు రాజ్యాంగాన్ని ఎలా రాశారనేది మన కళ్ల ఎదుట కనిపించే సత్యం. 

చదువుతోనే మన జీవితాల రూపురేఖలు మారుతాయి. చదువుతోనే పేదరికం నుంచి బయటపడగలుగుతాం. మనసా.. వాచా.. కర్మణా నమ్ముతున్నది.. చదువు అనేది నా తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు ఇస్తున్న ఒక ఆస్తి అని గర్వంగా చెబుతున్నాను. 15 సంవత్సరాలకు పదో తరగతి పూర్తి చేసుకుంటారు. 17 ఏళ్లకు ఇంటర్మీడియట్‌.. 20–21 సంవత్సరాల మధ్య డిగ్రీ కూడా పూర్తి చేసుకుంటారు. తమకు 60–70 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వాళ్ల జీవితాలు ఎలా ఉంటాయని ఒక్కసారి ఊహించుకోగలిగితే.. ఒక ఇంజినీర్, డాక్టర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు చదవిన వారి పరిస్థితులు ఎలా ఉంటారు.. వారి జీవితాలు ఎలా బాగుపడతాయని ఒకసారి బేరీజు వేసుకోగలిగితే.. ఏ అప్పులపాలు కాకుండా పెద్ద చదువులు చదవగలిగి.. ఆ చదువుల వల్ల మంచి ఉద్యోగాలు వచ్చి వారి జీవితాలు ఏరకంగా మారుతాయని ఒకసారి ఊహించుకుంటే చాలా గొప్ప కార్యక్రమంగా అనిపిస్తుంది. 

ఇంత గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెడుతూ.. అక్షరాల 9,79,445 మంది తల్లులకు దాదాపు 10.88 లక్షల మంది పిల్లలకు మేలు జరిగించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో నా కళ్ల ముందటే జరిగిన కొన్ని ఘటనలు చెబుతూ తల్లిదండ్రులు, పిల్లలు బాధపడుతూ చెప్పిన సన్నివేశాలను ఈ రోజు నేను నెరవేరుస్తున్నానని గర్వంగా చెబుతున్నాను. ఆ దిశగా రెండో సంవత్సరంలోకి కూడా అడుగులు పెట్టామని ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలను. 

రూ.671 కోట్లతో ప్రతి త్రైమాసికానికి సంబంధించిన ఫీజులు.. అదే త్రైమాసికం అయిపోయిన వెంటనే ఇవ్వగలగడం చరిత్రలో మొట్టమొదటిసారి జరుగుతున్న అంశం. అధికారంలోకి రాక ముందు పరిస్థితులు గమనిస్తే.. ఫీజురీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి 2018–19 విద్యా సంవత్సర బకాయిలు దాదాపు రూ.1880 కోట్లు వదిలేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చే అరకొర కూడా ఇవ్వకుండా.. రూ.1880 కోట్లు బకాయిలు పెట్టిపోతే.. ఆ బకాయిలను కూడా చిరునవ్వుతో తీర్చడమే కాకుండా 2018 కంటే ముందుపెట్టిన బకాయిలను తీర్చడమే కాకుండా 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించిన పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ డబ్బును కూడా ప్రతి కాలేజీ యాజమాన్యానికి జమ చేయడం జరిగింది. 

మొత్తంగా రూ.4208 కోట్లు గత సంవత్సరం పూర్తిగా కాలేజీ యాజమాన్యాలకు చెల్లించి.. బకాయిలు ఎక్కడా లేకుండా చేశాం. ఈ విద్యా సంవత్సరం కోవిడ్‌ కారణంగా కాలేజీలన్నీ డిసెంబర్‌లో మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ తొలి త్రైమాసికానికి 10.88 లక్షల మంది విద్యార్థులకు మొదటి విడతగా రూ.671 కోట్లు ఆ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. గత సంవత్సరం 10.11 లక్షల మంది విద్యార్థులకు మంచి చేస్తే.. ఈ రోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదలకు అండగా ఉంటుందని నమ్మకం కలగడంతో గత సంవత్సరం 10.11 లక్షల మంది విద్యార్థులు కాలేజీల్లో చేరితే.. ఈ సంవత్సరం ఆ సంఖ్య 77 వేలు పెరిగి 10.88 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుంది. 

9,79,445 మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి తల్లుల ఖాతాల్లోకే డబ్బులు ఎందుకు వేస్తున్నామంటే.. ఇంత వరకు గత ప్రభుత్వాలు ఎప్పుడూ బకాయిలు పెట్టుకుంటే వచ్చేవి. ఏ ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే సాహసం చేయలేదు. మన ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుంటుంది. పిల్లల చదువులు త్రైమాసికం అయిపోయిన వెంటనే తల్లుల ఖాతాల్లో డబ్బులు వేయడం.. ఆ తల్లి చేతుల మీదగానే ఫీజులు చెల్లించేలా చేయడం. ఇంత వరకు ఏ ప్రభుత్వం ఇలాంటి ధైర్యం చేయలేదు. కానీ, ఆ పరిస్థితి మారాలి.. ప్రభుత్వం తోడుగా ఉందనే భావన తల్లులకు, పిల్లలకు, కాలేజీ యాజమాన్యాలకు ఉండాలనే భావనతో కమిట్‌మెంట్‌తో ఉన్నాం. ప్రతి త్రైమాసికం అయిపోయేలోపు తల్లల ఖాతాల్లోకే డబ్బులు వేయడం.. ఆ డబ్బులు అందిన వారం పది రోజుల్లో విద్యార్థి తల్లి కాలేజీకి వెళ్లి ఫీజు కడితే.. జవాబుదారీతనం పెరుగుతుంది. కాలేజీలో ఏదైనా పరిస్థితులు, సదుపాయాలు బాగులేకపోయినా, పిల్లల చదువుల గురించి తెలుసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. వెంటనే కాలేజీలను నిలదీసే పరిస్థితి ఉంటుంది. 

చెప్పినప్పటికీ వసతులు బాగలేకపోతే 1902 అనే టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేస్తే ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కాలేజీల్లో సదుపాయాలు మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటుంది. ఆ కాలేజీలను పరిస్థితులను మెరగయ్యేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇవన్నీ జరగాలి.. కాలేజీల్లో కూడా జవాబుదారీతనం రావాలి.. తల్లులు కాలేజీ వెళ్లి ఫీజులు కడితే అది జరుగుతుందనే ఉద్దేశంతో నేరుగా తల్లుల ఖాతాల్లోకే ప్రతి త్రైమాసికం డబ్బులు జమ చేయడం జరుగుతుంది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ కార్యక్రమానికి ఈ విద్యా సంవత్సరం నుంచి శ్రీకారం చుడుతున్నాం. 

3 ఏళ్లలోపు పిల్లలను అంగన్‌వాడీల్లో చేర్చడం దగ్గర నుంచి మొదలుపెడితే.. 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందించడం.. ప్రతి అడుగులోనూ ప్రభుత్వం వాళ్లకు మంచి చేయాలని ఆరాటపడుతూ అడుగులు ముందుకేస్తుంది. 3 ఏళ్ల పిల్లలు చదువుతున్న అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు పూర్తిగా మార్చేస్తున్నాం. ప్రీప్రైమరీ స్కూల్‌గా ఇంగ్లిష్‌ మీడియం చదువులకు నిలయంగా మారుస్తూ అడుగులు వేయడం మొదలుపెడితే.. పౌష్టికాహారం అందితేనే 6 ఏళ్లలోపే 85 శాతం మెదడు వృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో పౌష్టికాహారం సంపూర్ణ పోషణతో మొదలుపెట్టి.. ‘నాడు–నేడు’తో స్కూళ్ల రూపురేఖలను మార్చడ, ఇంగ్లిష్‌మీడియం చదువులు తీసుకురావడం, రోజుకు ఒక మెనూతో గోరుముద్ద కార్యక్రమం చేపట్టడం. ప్రతి అడుగులోనూ పిల్లలకు ప్రభుత్వం తోడుగా ఉంది.. ఆ పిల్లలకు వాళ్ల మేనమామ తోడుగా ఉన్నాడనే భావన ప్రతి అడుగులోనూ కనిపించేలా చేస్తున్నాం. 

చివరకు పిల్లలకు స్కూల్‌ బ్యాగ్స్, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, షూ, బెల్ట్, యూనిఫాం దగ్గర నుంచి అన్నీ సమకూర్చడం.. చివరకు ఆ పిల్లలను ఇంకా బెటర్‌గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇంగ్లిష్‌ మీడియం డిక్షనరీని కూడా విద్యా కానుక కిట్‌లో పెట్టి పంపిణీ చేస్తున్నాం. పిల్లలు చదువుల గురించి ఇబ్బంది పడకూడదు, తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో పూర్తి ఫీజురీయింబర్స్‌ బాధ్యత కూడా మనమే తీసుకున్నాం. 

విద్యా దీవెన కింద ప్రతి అడుగులోనూ సపోర్టు చేస్తూ.. విద్యా దీవెన ఒక్కటే సరిపోదూ, ఇంజనీరింగ్, డాక్టర్, డిగ్రీలు చదివే విద్యార్థులకు బోడింగ్, లాడ్జింగ్‌ ఖర్చులకు ఆ పిల్లలకు, తల్లిదండ్రులకు ఇబ్బందులు కలగకూడదని వసతి దీవెన కార్యక్రమం కూడా తీసుకువచ్చి 3 ఏళ్ల చిన్నారి నుంచి ఇంజనీరింగ్‌ అయ్యే వరకు ప్రతి అడుగులోనూ ఆ పిల్లలకు తోడుగా ఉంటూ, అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటూ ఆ కుటుంబ సభ్యుడిగా ఉంటున్నందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు ప్రారంభించే కార్యక్రమం ద్వారా పిల్లలకు, తల్లులకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. దేవుడి దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు మనందరి ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. 

9,79,445 మంది అక్కచెల్లెమ్మలకు లేఖలు కూడా రాశాం. నాలుగు దఫాలుగా ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఎప్పుడెప్పుడు ఇస్తాం అనేది లేఖలో నెలలు, తేదీలతో సహా స్పష్టంగా రాశాం. వసతి దీవెన కూడా ఏ నెలలో ఇస్తామో లేఖలో రాశాం. కాలేజీలకు వెళ్లి ఏదైనా ఇబ్బందులు పడితే 1902 నంబర్‌కు ఫోన్‌ చేస్తే ఏ రకంగా ప్రభుత్వం తోడుగా ఉంటుందని లేఖలో రాయడం జరిగింది. ఫీజురీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఎవరికైనా, ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే.. అర్హత ఉండి అందకపోతే దయచేసి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు.. 1902 నంబర్‌కు ఫోన్‌ చేస్తే పరిష్కారిస్తాం. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెన ఎల్లవేళలా ఆశిస్తున్నాను’’ అని సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top