ప్రజలకు అత్యంత సమర్థంగా వైద్య సేవలు 

 ‘వైద్య ఆరోగ్య రంగంలో నాడు–నేడు’పై సభలో స్వల్ప వ్యవధి చర్చలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్  

చంద్రబాబు హయాంలో వైద్య రంగాన్ని పట్టించుకోలేదు

ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడం గతంలో చూశాం

నెట్‌వర్క్‌ ఆసుపత్రుల బిల్లులను గత ప్రభుత్వం చెల్లించలేదు

 మేం వచ్చాక ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ చెల్లించాం

బసవ తారకం ఆసుపత్రిలో గతంలో కన్నా ఇప్పుడే సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాం

రూ.16,255 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తున్నాం

ఆరోగ్యశ్రీతో వైద్య చికిత్సలను 3,118కి పెంచాం

మూడేళ్లలో వైద్యశాఖలో 45 వేల ఉద్యోగాలు కల్పించాం

రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు

ప్రతి గ్రామంలో వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేస్తున్నాం

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను తీసుకొస్తున్నాం

అమ‌రావ‌తి:  రాష్ట్రంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప్రజలకు అత్యంత సమర్థంగా వైద్య సేవలు అందుతున్నాయ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. మనం అధికారంలోకి రాక ముందు ఆస్పత్రుల పరిస్థితి చూస్తే, గ్రామం మొదలు రాష్ట్ర స్థాయి వరకు శిధిలావస్థ‌కు చేరుకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మనం చూశాం. ఆస్పత్రిలో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడం చూశాం. చివరకు సెల్‌ఫోన్‌ లైట్‌ వెలుగులో ఆపరేషన్‌ చేయడం కూడా చూశాం. దీంతో మనసు పెట్టి ఈ రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్నది ఆలోచించామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు.  ‘వైద్య ఆరోగ్య రంగంలో నాడు–నేడు’పై సభలో స్వల్ప వ్యవధి చర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు.

 వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి:
    విద్యా రంగం మాదిరిగా వైద్య ఆరోగ్య రంగంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా, దేశంలో ఎక్కడా జరగని విధంగా మార్పులు చోటు చేసుకున్నాయి. అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం అధికారంలోకి రాక ముందు ఆస్పత్రుల పరిస్థితి చూస్తే, గ్రామం మొదలు రాష్ట్ర స్థాయి వరకు శిధిలావస్తకు చేరుకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మనం చూశాం. ఆస్పత్రిలో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడం చూశాం. చివరకు సెల్‌ఫోన్‌ లైట్‌ వెలుగులో ఆపరేషన్‌ చేయడం కూడా చూశాం. దీంతో మనసు పెట్టి ఈ రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్నది ఆలోచించాం.
    ఎందుకంటే మనకు టయర్‌–1 సిటీలు లేవు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు లేవు. అందువల్ల మనకు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, అత్యాధునిక వైద్య సదుపాయాలు లేవు.
    అందువల్ల ఇక్కడ వైద్య రంగంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఎలా అందించాలన్న ఆలోచనతో మార్పులకు మార్గం ఏర్పడింది.

‘ఆరోగ్యశ్రీ’ తొలి అడుగు:
    అందులో భాగంగా ఆరోగ్యశ్రీ. అసలు ఆనాడు ఈ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది దివంగత నేత, ప్రియతమ నాయకుడు వైయస్‌ రాజశేఖర్‌రెడ్డిగారు. ఆయన హయాంలో సామాన్యులు కూడా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం పొందారు. నిరుపేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్న ఉద్ధేశంతో ఆయన పని చేశారు.

నీరుగారిస్తే.. బాగు చేశాం:
    మహానేత మరణం తర్వాత, ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చారు. మనం అధికారంలోకి వచ్చే సమయానికి గత ప్రభుత్వం రూ.680 కోట్లు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయిపెట్టి పోయింది. దీంతో ఆయా ఆస్పత్రుల్లో సామాన్యులకు ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం అందలేదు.
అలాంటి పరిస్థితి నుంచి వాటిని బాగు చేయడం కోసం ఒక డాక్టర్‌గా చికిత్స మొదలుపెట్టాను.
    అందులో భాగంగా ఆస్పత్రి ఎవరిది అన్నది చూడకుండా, అన్ని ఆస్పత్రులకు వెంటనే బకాయిలు చెల్లించాం. అందుకే బాలకృష్ణకు చెందిన ఆస్పత్రికి కూడా ఇవాళ చంద్రబాబు హయాంలో కంటే ఇప్పుడు చాలా వేగంగా బిల్లుల చెల్లింపు జరుగుతోంది.

మరింత మందికి మరిన్ని సేవలు:
    వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్న అన్ని కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడంతో 95 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో కేవలం 1059 ప్రొసీజర్లు మాత్రమే అందుబాటులో ఉంటే, ఈ అక్టోబరు 5వ తేదీ నుంచి ఏకంగా 3118 ప్రొసీజర్లకు పథకం వర్తింప చేస్తున్నాం.
    ఆ విధంగా ఒకవైపు ప్రొసీజర్లు పెంచడంతో పాటు, మరోవైపు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు పెండింగ్‌లో పెట్టకుండా నెల నెల చెల్లిస్తున్నాం. ప్రతి ప్రభుత్ర ఆస్పత్రిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, జీఎంపీ మందులు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా గట్టి చర్యలు తీసుకుంటున్నాం.

నాడు–నేడు:
    వైద్య–ఆరోగ్య రంగంలో నాడు–నేడు కింద ఆస్పత్రుల రూపురేఖలు మార్చడం కోసం రూ.16,255 కోట్లు వ్యయం చేస్తున్నాం. కొత్తగా ఆస్పత్రులు, ప్రస్తుతం ఉన్న ఆస్పత్రుల్లో మొత్తం 11,888 పనులు చేపట్టగా, వాటిలో ఇప్పటి వరకు 4,851 పనులు పూర్తి చేయడం జరిగింది. 
    విలేజ్, వార్డు క్లినిక్స్‌ మొదలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రులు (ఏహెచ్‌), జిల్లా ఆస్పత్రులు (డీహెచ్‌).. చివరకు టీచింగ్‌ ఆస్పత్రుల వరకూ నాడు–నేడు కింద అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
    ప్రతి చోటా రూపురేఖలు మారుతున్నాయి. ప్రతి చోటా పూర్తి సదుపాయాలు ఏర్పడుతున్నాయి. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైద్య రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ప్రివెంటివ్‌ కేర్‌. క్యురేటివ్‌ కేర్‌:
    అందులో భాగంగా వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.. ఈ రెండూ కూడా ప్రివెంటివ్‌ కేర్‌లో చాలా కీలకమైన మార్పులు తీసుకొస్తాయి. ఇక సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రుల పరిధిలో క్యురేటివ్‌ కేర్‌ అనేది క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.

విలేజ్‌ క్లినిక్స్‌తో మొదలు..:
    ప్రివెంటివ్‌ కేర్‌లో భాగంగా అన్ని గ్రామాల్లో రూ.1692 కోట్ల వ్యయంతో మొత్తం 10,032 వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ (విలేజ్‌ క్లినిక్స్‌) ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే గ్రామాల్లో 1498 క్లినిక్స్‌ ఉండగా, కొత్తగా 8585 క్లినిక్స్‌ నిర్మించాల్సి ఉంది. వాటిలో ఇప్పటికే 3673 క్లినిక్స్‌ నిర్మాణం పూర్తి కాగా, మిగిలిన వాటిని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
    వీటిలో ఒక మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రాక్టీషినర్‌.. అంటే ఇప్పుడు వారిని కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌ఓ) అంటున్నాం. వారు విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లో ఉంటారు. వారితో పాటు ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ కూడా ఉంటారు. అక్కడే రిపోర్ట్‌ చేస్తారు. వాటిని పీహెచ్‌సీలకు అనుసంధానం చేస్తున్నాం.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌:
    ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు లేదా ఒక పీహెచ్‌సీ, ఒక సీహెచ్‌సీ లేదా ఒక పీహెచ్‌సీ, ఒక ఏరియా ఆస్పత్రి ఉండేలా చూస్తున్నాం.
ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు. ఒక 104 అంబులెన్స్‌ ఉంటుంది. అంటే ప్రతి మండలంలో నలుగురు వైద్యులు, రెండు 104 అంబులెన్స్‌ సర్వీస్‌లు ఉంటాయి. 
    ప్రతి పీహెచ్‌సీలో ఉండే ఇద్దరు వైద్యుల్లో ఒకరు రోజు విడిచి రోజు 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ)తో ఒక్కో  గ్రామం సందర్శించి, అక్కడే వైద్య సేవలందిస్తారు. ఆ విధంగా ప్రతి గ్రామానికి ఆ వైద్యుడు నెలలో రెండుసార్లు సందర్శించే అవకాశం వస్తుంది. దీని వల్ల మెజారిటీ జబ్బులకు గ్రామాల్లోనే వైద్యం అందుతుంది. వైద్యుడితో గ్రామస్తులకు అనుబంధం ఏర్పడి, అది ఒక ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌గా మారుతుంది. ప్రజలకు అత్యంత సమర్థంగా వైద్య సేవలు అందుతాయి.

మారుతున్న రూపురేఖలు:
    ఆ విధంగా ఒకవైపు ఈ ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీలు, అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ అడుగులు వేస్తుండగా, మరోవైపు ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి.
    ఈ ఆస్పత్రుల్లో ఇప్పటికే దాదాపు 40,800 మందిని నియమించాం. ప్రతి ఆస్పత్రిలో అవసరం మేరకు డాక్టర్లు, నర్సులు ఉండేలా ఈ అక్టోబరు 15 నాటికి కార్యాచరణ ఇవ్వగా, వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. ఆ మేరకు ఇప్పటికే 40 వేలకు పైగా పోస్టులు భర్తీ చేయగా, మరో 4 వేల పోస్టులు కూడా భర్తీ చేయనున్నాం. ఆ విధంగా కేవలం ఈ మూడేళ్లలోనే మనం అధికారంలోకి వచ్చాక 45 వేల పోస్టులు ఆస్పత్రుల్లో భర్తీ చేశాం.

17 వైద్య కళాశాలలు:
    ఇంకా ఇప్పుడు కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా, వాటిని సమగ్రంగా అభివృద్ధి చేస్తూ, కొత్తగా మరో 17 కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం.
    పాడేరు, విజయనగరం, నర్సీపట్నం, రాజమండ్రి, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లె, పులివెందుల, పెనుకొండ, ఆదోని, నంద్యాల, పార్వతీపురంలో వైద్య, నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ఉన్న 11 కాలేజీలను సమగ్రంగా మార్చడంత పాటు, కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు కట్టడం కోసం అక్షరాలా రూ.12,268 కోట్లు వ్యయం చేస్తున్నాం.

గతంలో ఎన్నడూ లేని విధంగా..:
    ఈ విధంగా ఒకవైపు విలేజ్‌ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్య ఆరోగ్య రంగంలో సమూల మార్పులు వస్తున్నాయి. గతంలో ఏనాడూ లేని విధంగా అభివృద్ది జరుగుతోంది.
    అలా నాడు–నేడు ద్వారా విద్య, వైద్య ఆరోగ్య రంగంలో పూర్తి మార్పులు వచ్చే ఏడాది, రెండేళ్లలో స్పష్టంగా కనిపిస్తాయి. దీని వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. అదే విధంగా ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నానంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తన ప్రసంగం ముగించారు.

తాజా వీడియోలు

Back to Top