భూముల రీస‌ర్వేతో రెవెన్యూ వ్య‌వ‌స్థ ప్ర‌క్షాళ‌న‌

గ్రామంలో సర్వే పూర్త‌యిన వెంట‌నే  అన్నిరకాలుగా ఈ ప్రక్రియను ముగించాలి

భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలి

ఎక్కడా సర్వే అసంపూర్తిగా మిగిలిపోయిందన్న మాట రాకూడదు

దోషాలు, తప్పులతో ఒక్క హక్కు పత్రం కూడా రైతులకు వెళ్లకూడదు

అధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశం

వైయ‌స్ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్షపై సీఎం స‌మీక్ష‌

తాడేపల్లి: భూముల రీసర్వే ద్వారా రెవెన్యూ వ్యవస్థ పూర్తిస్థాయిలో ప్రక్షాళన అవుతుంద‌ని, రికార్డులు, డేటా అంతా కూడా స్వచ్ఛీకరణ జరుగుతుంద‌ని, ఈ అంశాలను అధికారులు దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలని అధికారులను ఆదేశించారు. అలాగే,  ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచేలా, వారి భూ సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారాలు చూపేలా రీసర్వే ఉండాలని స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష కార్యక్రమంపై సీఎం వైయ‌స్‌ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు ప‌లు విష‌యాల‌పై దిశానిర్దేశం చేశారు. 

సీఎం వైయ‌స్‌ జగన్‌ కీలక ఆదేశాలు.. 
రీసర్వేలో నాణ్యత చాలా ముఖ్యం.. ఒక గ్రామంలో రీసర్వే చేసిన తర్వాత అన్నిరకాలుగా ఈ ప్రక్రియను ముగించాలి. ఆ గ్రామంలో మనదైన ముద్ర కనిపించాలి. భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలి. రీసర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నాం.. వాటి ఫలాలు ప్రజలకు అందాలి. క్వాలిటీ అనేది కచ్చితంగా ఉండాలి. ఎక్కడా కూడా సర్వే అసంపూర్తిగా మిగిలిపోయిందన్న మాట రాకూడదు.  మొబైల్‌ ట్రిబ్యూనల్స్‌, సరిహద్దులు, సబ్‌డివిజన్లు.. ఇవన్నీకూడా చాలా క్రమ పద్ధతిలో ముందుకు సాగాలి. రీసర్వే చేస్తున్నప్పుడు ఉత్పన్నమైన సమస్యలను అత్యంత ప్రణాళికా బద్ధంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి. ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచేలా, వారి భూ సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారాలు చూపేలా రీసర్వే ఉండాలి.

భూముల సర్వే ద్వారా రెవెన్యూ వ్యవస్థ పూర్తిస్థాయిలో ప్రక్షాళన అవుతుంది. రికార్డులు, డేటా అంతా కూడా స్వచ్ఛీకరణ జరుగుతుంది. ఈ అంశాలను అధికారులు దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. రీ సర్వే ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే కారణంతో చాలామంది ఈ కార్యక్రమంపై దుష్ప్రచారం చేస్తున్నారు. అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. 100 ఏళ్ల తర్వాత సర్వే చేస్తున్నాం, దీనికోసం కొన్ని వేల మందిని రిక్రూట్‌ చేసుకున్నాం. అత్యాధునిక పరికరాలను కోట్లాది రూపాయలు ఖర్చుచేసి కొనుగోలు చేశాము. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎవ్వరూ కూడా వేలెత్తి చూపని విధంగా సర్వే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.

దోషాలతో, తప్పులతో ఒక్క హక్కు పత్రం కూడా రైతులకు వెళ్లకూడదు. సంబంధిత గ్రామ సచివాలయంలో సర్వే పూర్తికాగానే అక్కడే రిజిస్ట్రేషన్‌ కార్యాలయం కూడా ఏర్పాటయ్యేలా చూడాలి. సర్వే పూర్త‌యిన తర్వాత ప్రతీ గ్రామంలో ఆర్డీఓలు, జేసీలు హక్కుపత్రాలను తనిఖీలు చేయాలి. ఉన్నతాధికారులు గ్రామాల్లో సందర్శించడం వల్ల అందరూ కూడా బాధ్యతాయుతంగా తమ పనులు నిర్వర్తిస్తారు. అలాగే సిబ్బందిలో జవాబుదారీతనం కూడా వస్తుంది. 

సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆదేశాల మేరకు తప్పులు, పొరపాట్లు లేని విధంగా హక్కు పత్రాలు జారీచేస్తామని అధికారులు వెల్లడించారు. అలాగే, భూ సర్వే ప్రక్రియలో ఏ దశలో అభ్యంతరాలు వ్యక్తమైనా వాటిని పరిష్కరించే వ్యవస్థలను బలోపేతం చేస్తామన్నారు. ఈ సర్వే పూర్తిచేయడం ద్వారా భూ యజమానుల హక్కులను తరతరాలపాటు కాపాడుగలుగుతామని, ఆక్రమణలు, కబ్జాలు, రికార్డుల్లో అవకతవకలు ఇలాంటి వాటికి పూర్తిస్థాయిలో చెక్‌ పడుతుందని వెల్లడించారు. కేవలం ఐదు సెంటీమీటర్ల వ్యత్యాసంతో కచ్చితమైన పద్ధతుల్లో సర్వే జరుగుతుందని అధికారులు తెలిపారు.

భూ యజమానులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, వారిని పూర్తిస్థాయిలో సంతృప్తపరిచే పద్ధతుల్లో సర్వే జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకూ 6,037 గ్రామాల్లో డ్రోన్లను ఎగురవేశామని, ఇందులో 1,545 గ్రామాల్లో రెవెన్యూ రికార్డులు కూడా ఖరారయ్యాయని అన్నారు. ప్రతీనెలా 13,335 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని లక్ష్యంగా చేసుకుని సర్వే చేస్తున్నామన్న అధికారులు తెలిపారు. డ్రోన్లు ఎగురవేయడానికి అనువుగాలేని ప్రాంతాల్లో విమానాలు, హెలికాప్టర్ల ద్వారా సర్వే చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యామని స్పష్టం చేశారు. నవంబర్‌ మొదటివారంలో తొలివిడత గ్రామాల్లో హక్కుపత్రాలను అందిస్తామని, ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.

అలాగే, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌.. 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని 15,02,392 ఎకరాల్లో సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే పూర్తైన తర్వాత ఇక్కడ కూడా పత్రాలను అధికారులు తనిఖీ చేయాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు.. వచ్చే జనవరిలో సర్వే ప్రక్రియ ప్రారంభించి మే నెల నుంచి హక్కుపత్రాల పంపిణీ ప్రారంభమయ్యేలా ముందుకుసాగుతామన్నారు. ఆగస్టు 2023 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకున్నామని స్పష్టం చేశారు. 

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ సమీక్షా సమావేశంలో విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి.సాయి ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ (సర్వే సెటిల్మెంట్స్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌) కమిషనర్‌ సిద్దార్ధ జైన్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్, సీసీఎల్‌ఏ కార్యదర్శి ఏ ఎండీ ఇంతియాజ్, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ ఐజీ వి రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top