ప్ర‌జ‌ల‌కు మెరుగైన జీవనప్రమాణాలు అందాలి

నివాస ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండకూడదు

ఉపాధిహామీ పనులు ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలి

ఆర్బీకేలు, వైయస్ఆర్ హెల్త్‌ క్లినిక్, డిజిటల్‌ లైబ్రరీల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వాలి

రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, నిర్మాణంపై అత్యుత్తమ కార్యాచరణ ఉండాలి

రైతు పొలంలో బోరు వేసిన వెంటనే మోటారు బిగించాలి

గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక  శ్రద్ధపెట్టాలి

జగనన్న కాలనీల్లో రక్షిత మంచినీరు అందించాలి

ఉన్న‌తాధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

తాడేప‌ల్లి: పాదయాత్రలో గ్రామాల్లో పరిస్థితులు చూపినప్పుడు ఆవేదన కలిగిందని, అలాంటి పరిస్థితులను మార్చాలని, నివాస ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండే పరిస్థితులు ఉండకూడదని, ప్ర‌జ‌ల‌కు మెరుగైన జీవన ప్రమాణాలు అందాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. పంచాయ‌తీ రాజ్, గ్రామీణ అభివృద్ధిపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. జాతీయ ఉపాధిహామీ పథకం పనులు, జగనన్న పచ్చతోరణం, వైయ‌స్ఆర్‌ జలకళ, గ్రామీణ ప్రాంతాల్లో క్లాప్‌ కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, గ్రామీణ మంచినీటి సరఫరా తదితర కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ..

ప్రాధాన్యతా క్రమంలో ఉపాధిహామీ పనులు చేపట్టాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు.  గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్ఆర్  హెల్త్‌ క్లినిక్, వైయస్ఆర్ డిజిటల్‌ లైబ్రరీల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వాల‌న్నారు. అమూల్‌ పాలసేకరణ చేస్తున్న జిల్లాలను, ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని బ‌ల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల‌ను పూర్తిచేయాల‌ని సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి వస్తున్న నిధులను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో వీటిని పూర్తిచేయడానికి తగిన కార్యాచరణతో ముందుకు సాగాల‌ని ఆదేశించారు.

జగనన్న స్వచ్ఛ సంకల్పం..
జగనన్న స్వచ్ఛ సంకల్పం, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, ప్రాసెస్‌లపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షించారు. నవంబర్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 22 శాతం ఇళ్లనుంచి చెత్తసేకరణ ప్రారంభమై ప్రస్తుతం 61.5శాతానికి చేరుకున్నామని అధికారులు తెలిపారు. అక్టోబర్‌ కల్లా పూర్తి లక్ష్యాన్ని చేరుకుంటున్నామ‌ని సీఎంకు వివ‌రించారు. వివిధ గ్రామాల్లో మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను ప్రత్యేక సర్వేద్వారా గుర్తించామ‌ని, దాదాపు 582 ప్రాంతాలను గుర్తించినట్టు చెప్పారు. అక్కడ సాయిల్‌ బయోట్రీట్‌మెంట్, వెట్‌ ల్యాండ్‌ట్రీట్‌మెంట్, వేస్ట్‌ స్టెబిలైజేషన్‌ పాండ్స్‌ తదితర పద్ధతుల్లో శుద్ధికి ప్రణాళికను ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. 

గ్రామాల్లో పరిశుభ్రత మెరుగుపరచాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాల‌న్నారు. ప్ర‌ణాళిక ప్ర‌కారం వెంటనే ఈ పనులు చేపట్టాల‌ని, ఏడాదిలోగా పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. నిర్మాణం త‌రువాత వాటి నిర్వహణపైనా తగిన చర్యలు తీసుకోవాల‌ని సూచించారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ నిర్వహణపైనా ప్రత్యేక శ్రద్ధపెట్లాల‌న్నారు. ఎఫ్‌ఎస్‌టీపీ ప్లాంట్ల ఏర్పాటుపైనా అధికారులు ప్రణాళిక వివరించారు. వీటి నిర్వహణపైనా ప్రత్యేక దృష్టిపెట్టాల‌ని సీఎం ఆదేశించారు. 

వైయ‌స్ఆర్ జలకళ
వైయ‌స్ఆర్ జలకళ కార్య‌క్ర‌మంపైనా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక రిగ్గును అప్పగించాలని ఆదేశించారు. ఆ రిగ్గు ద్వారా రైతులకు బోర్లు వేయించాలన్నారు. దీనివల్ల బోర్లు వేసే పని క్రమంగా ముందుకు సాగుతుందని చెప్పారు. బోరు వేసిన వెంటనే మోటారును బిగించాలని సీఎం ఆదేశించారు. 

రోడ్ల నిర్మాణం, నిర్వహణ
రోడ్ల‌ నిర్మాణం, నిర్వహణపైనా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షించారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులను పూర్తిగా గాలికొదిలేశారని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రెండేళ్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లు బాగా దెబ్బతిన్నాయ‌న్నారు. క్రమం తప్పకుండా చేయాల్సిన నిర్వహణను వదిలేయడంతో అన్ని రోడ్లనూ ఒకేసారి నిర్మించి, మరమ్మతు చేయాల్సిన అవసరం ఏర్పడింద‌న్నారు. ఈసారి రోడ్ల నిర్మాణం, మర‌మ్మ‌తులను పూర్తిచేయాల‌ని సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, నిర్మాణంపై అత్యుత్తమ కార్యాచరణ ఉండాల‌ని సూచించారు. ఏ దశలోకూడా నిర్లక్ష్యానికి గురికాకుండా క్రమం తప్పకుండా మెయింటైనెన్స్‌ పనులు నిర్వహించాల‌ని సూచించారు. దీనికోసం నిధుల కొరత లేకుండా ఒక ప్రణాళికను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

జగనన్న కాలనీల్లో రక్షిత తాగునీరు
జగనన్న కాలనీల్లో రక్షిత మంచినీరు అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి అక్కడ మౌలిక సదుపాయాల ఏర్పాటుపైనా ధ్యాస పెట్టాలని చెప్పారు. గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక  శ్రద్ధపెట్టాలని అధికారుల‌కు సూచించారు. నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మెరుగైన విధానం తీసుకురావాలని సీఎం ఆదేశించారు. 

ఈ సమీక్షా సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌. రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్‌ ఎండీ పి. సంపత్‌ కుమార్, సెర్ఫ్‌ సీఈఓ ఎండి ఇంతియాజ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్‌ కమిషనర్‌ శాంతి ప్రియా పాండే ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top