ఓటీఎస్‌ పూర్తి స్వచ్ఛందం

పేదలకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాం 

పేదలపై ఉన్న రూ.10వేల కోట్ల రుణ‌ భారాన్ని తొలగిస్తున్నాం

క్లియర్‌ టైటిల్‌తో గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లోనే ఉచితంగా రిజిస్ట్రేషన్‌

డిసెంబర్‌ 21 నుంచే రిజిస్ట్రేషన్‌ పత్రాలు ల‌బ్ధిదారుల‌కు అంద‌జేత‌

గతంలో అసలు, వడ్డీ కడితే బీ-ఫారం పట్టా మాత్రమే ఇచ్చేవారు 

`జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ హ‌క్కు` ద్వారా ఇంటిపై సంపూర్ణ హక్కు

గృహనిర్మాణంపై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి

ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ఉండాలి..  అధికారులు ప్రత్యేక శ్రద్ధపెట్టాలి

ఉన్న‌తాధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

తాడేపల్లి: జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ హ‌క్కు (ఓటీఎస్‌) ప‌థ‌కం పూర్తిగా స్వ‌చ్ఛంద‌మ‌ని, పేద‌ల‌కు మంచి చేయాల‌నే ఉద్దేశంతో ఈ ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. పేద‌ల‌పై ఉన్న రూ.10 వేల కోట్ల రుణ భారాన్ని తొలగిస్తూ.. ఇంటిపై పూర్తి హ‌క్కును క‌ల్పిస్తున్నామ‌న్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్‌), గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఓటీఎస్‌పై అవగాహన కల్పించాలని.. ప్రజలకు ఏ రకంగా మంచి జరుగుతుందో చెబుతూ, వారికి అవగాహన కలిగించాలని అధికారుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశించారు. ఓటీఎస్‌ పురోగతిపై ముఖ్య‌మంత్రికి అధికారులు వివరాలు అందించారు. 22-ఏ తొలగింపునకు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశామని అధికారులు తెలిపారు. ఓటీఎస్‌ వినియోగించుకున్నవారికి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, యూజర్‌ ఫీజులను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ పనులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఓటీఎస్‌ వినియోగించుకున్నవారికి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్, ఫీల్డ్‌స్కెచ్, లోన్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌లు ఇస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ ఏమన్నారంటే..

``ఓటీఎస్‌ అన్నది పూర్తి స్వచ్ఛందం. క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది. రూ.10వేల కోట్ల భారాన్ని పేదలపై తొలగిస్తున్నాం. వారి రుణాలు మాఫీచేస్తున్నాం, రిజిస్ట్రేషన్‌ కూడా ఉచితంగా చేస్తున్నాం. వారికి సంపూర్ణ హక్కులు వస్తాయి, వీటిపై ప్రజలకు అవగాహన తీసుకురావాలి. ఈ పథకం అమలు కాకుండా చాలామంది చాలారకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదలనూ గత ప్రభుత్వం పరిశీలించలేదు. సుమారు 43వేలమంది గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీకూడా కట్టారు. ఇవాళ మాట్లాడుతున్నవారు.. అప్పుడు ఎందుకు కట్టించున్నారు?. గతంలో అసలు, వడ్డీ కడితే బి–ఫారం పట్టా మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఓటీఎస్‌ పథకంద్వారా అన్నిరకాలుగా సంపూర్ణహక్కులు ఇస్తున్నాం. అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చు, అమ్ముకునే హక్కుకూడా ఉంటుంది. పేదలకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఆ అవకాశాలను వాడుకోవాలా? లేదా? అన్నది వారి ఇష్టం. 

డిసెంబర్‌ 21 నుంచే రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వడం ప్రారంభమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో రుణాలు చెల్లించిన 43 వేల మందికి కూడా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తాం, వారికీ సంపూర్ణ హక్కులు కల్పిస్తూ మేలు చేస్తాం. భవిష్యత్తులో కూడా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ పనులు జరుగుతాయి``. 

గృహ నిర్మాణంపై సీఎం ఏమన్నారంటే..
``గృహనిర్మాణంపై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. కోర్టు కేసులు పరిష్కారం అయ్యాయి. వర్షాలు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం విషయంలో గేర్‌ మార్చాల్సిన సమయం వచ్చింది. గృహ నిర్మాణంలో నాణ్యత బాగుండాలి,  దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సొంతంగా ఇళ్లు కట్టుకునేవారికి నిర్మాణంలో మంచి సలహాలు ఇచ్చేలా చూడాలి. ఇళ్లు క్వాలిటీతో కట్టుకునేలా చూడాలి. ఇంటి నిర్మాణ ఖర్చులను తగ్గించేలా అన్ని రకాల విధానాలూ అవలంభించాలి. నిర్మాణానికి అవసరమయ్యే ఇటుకలు ఆయా కాలనీలకు సమీపంలోనే తయారయ్యేలా చూడాలి. లేబర్‌ క్యాంపు, సిమెంటు గోదాములు వంటివి లేఅవుట్లలో ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలి. దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయి``.

ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్ వై. శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్ ఎం. ఎం. నాయక్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top