తాడేపల్లి: మనబడి నాడు–నేడు రెండో విడత పనులను ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభించాలని సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మనబడి 'నాడు – నేడు'పై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండో విడత నాడు–నేడు పనుల్లో భాగంగా.. 9,476ప్రైమరీ పాఠశాలలు, 822 అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, 2,771 హైస్కూళ్లు, 473 జూనియర్ కాలేజీలు, 1,668 హాస్టళ్లు, 17 డైట్ కాలేజీలు, 672 ఎంఆర్‌సీఎస్, 446 భవిత కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘నాడు–నేడు’పై సీఎం సమీక్ష
అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘నాడు–నేడు’ పనులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. 2021 మార్చి నాటికి మొదటి దశ పనులు ప్రారంభించాలని సూచించారు. రెండున్నరేళ్లలో పనులు పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొదటి విడతలో 6,407 కొత్త అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, 4,171 అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నాడు–నేడు కింద మొత్తం 27,438 కొత్త అంగన్‌వాడీ భవనాల నిర్మాణం. 16,681 అంగన్‌వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
అంగన్‌వాడీలు వైయస్‌ఆర్ ప్రీప్రైమరీ స్కూళ్లుగా రూపొందుకోనున్నాయి. ఈ మేరకు ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం రూపొందించిన పుస్తకాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిశీలించారు. ప్రీప్రైమరీ స్కూల్‌లోని చిన్నారులకు సులువుగా అర్థమయ్యే విధంగా.. బోధన కోసం ప్రత్యేక వీడియోలు రూపొందించామని అధికారులు సీఎం వైయస్ జగన్‌కు తెలిపారు.
జగనన్న విద్యాకానుకపై సమీక్ష..
జగనన్న విద్యాకానుక పథకంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్షించారు. వచ్చే ఏడాది స్కూళ్లు ప్రారంభించిన రోజే విద్యాకానుక పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను ఆదేశించారు. స్కూల్ యూనిఫామ్స్‌లో నాణ్యత తగ్గకుండా చూడాలని సూచించారు.
సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ నీలం సాహ్ని, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజా శంకర్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాథ, గృహ నిర్మాణశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, మహిళా,శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కృతికా శుక్లా, సర్వ శిక్షా అభియాన్, స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రి సెల్వి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.