అమరావతి: పట్టణ, నగరాల్లోని పేదలకు సొంత ఇంటి స్థలం, తద్వారా సొంతింటి కలను నిజం చేసే దిశగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పట్టణాలు, నగరాల్లో వైయస్సార్ హయాంలో రాజీవ్ స్వగృహ పేరిట గతంలో ఒక కార్యక్రమం జరిగేది..మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఫ్లాట్లు ఇవ్వాలన్నది ఆ కార్యక్రమ ఉద్దేశమన్నారు. ఇప్పుడు ఫ్లాట్లకు బదులు వివాదాల్లేని విధంగా, క్లియర్ టైటిల్‌తో తక్కువ ధరకు ప్లాట్లు ఇద్దామన్నారు. ప్రభుత్వమే లే అవుట్లను అభివృద్ధిచేసి ప్లాట్లను తయారుచేసి లబ్ధిదారులకు కేటాయించాలన్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద స్థలాలు కొనుక్కుంటున్న వారికి అనేక ఆందోళనలు ఉన్నాయని, సరైన టైటిల్ ఉందా? అన్నిరకాల అనుమతులు ఉన్నాయా? లేవా? అనే భయాలు వారికి ఉన్నాయని గుర్తు చేశారు. లే అవుట్ల అభివృద్ధిని ప్రభుత్వమే చేపడితే అలాంటి ఆందోళనలు, భయాలు ఉండవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వివాదాలు లేకుండా, క్లియర్ టైటిల్స్‌తో కూడిన ఇంటి స్థలాలు, ప్రభుత్వం లాభాపేక్షలేకుండా వ్యవహరించడం వల్ల తక్కువ ధరకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు ఈ ప్లాట్లను అందించాలని సూచించారు. మధ్యతరగతి ప్రజలకోసం కూడా ఏదైనా చేయాలన్న తపనతో ఈ ఆలోచన వచ్చిందని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు.
సముద్ర తీరం వెంబడి బీచ్ రోడ్డు
భీమిలి నుంచి భోగాపురం వరకూ సముద్ర తీరం వెంబడి బీచ్ రోడ్డు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ రహదారిలో భాగంగా గోస్తనీ నదిపై సుందరమైన బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. విశాఖపట్నానికి ఒక చిహ్నంగా ఇది మిగిలిపోతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. దీనిపై సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. శాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై కొత్త విధానాలను కూడా పరిశీలించాలని సూచించారు. పట్టణ గృహనిర్మాణాన్ని వేగతవంతం చేయాలని చెప్పారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాల్టీలతో మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు సంబంధించి రూ.1000 కోట్లతో డీపీఆర్‌ను త్వరగా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ లే అవుట్లను వినూత్నంగా, అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. దీనిపై మేథోమథనం చేసి ఒక పాలసీని తీసుకురావాలన్నారు. వైయస్సార్ జగనన్న కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సహా ఇతర అంశాలపై దృష్టిపెట్టమని కలెక్టర్లకు చెప్పినట్లు తెలిపారు. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై కూడా ఆలోచించమని చెప్పినట్లు వివరించారు. బస్ బే తోపాటు, సృజనాత్మకంగా బస్టాప్ కట్టమని చెప్పినట్లు తెలిపారు. పట్టణాభివృద్ధి సంస్ధల పరిధిలో దాదాపు 16 వేలకుపైగా లే అవుట్స్ వచ్చాయని, రాష్ట్రంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉంటే.. మనం మరో 17వేల కాలనీలు కడుతున్నామని, వీటిలో పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ కూడా నిర్మిస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ పేర్కొన్నారు.