అర్హుల‌కు 90 రోజుల్లో ఇంటి పట్టా అందాలి 

వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలకు ఇంటర్‌నెట్‌

ఇంటి స్థలాల కేటాయింపు, పట్టాల పంపిణీ నిరంతర కార్యక్రమం

మరో రెండు మూడు రోజుల్లో పట్టాల పంపిణీ పూర్తిచేయాలి

కాలనీల్లో సదుపాయాలు, వాటి నిర్మాణాలపై పూర్తి వివరాలు నివేదించాలి

ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పై సీఎం సమీక్ష 

తాడేపల్లి: దరఖాస్తు చేసుకున్న అర్హులకు 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టా అందించాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇంటి పట్టా కోసం దరఖాస్తు అందుకున్న తొలి 12 రోజుల్లో వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది భౌతికంగా వెరిఫికేషన్‌ పూర్తి చేయాలని సూచించారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇళ్ల స్థలాల పంపిణీ, గృహ నిర్మాణంపై సంబంధిత మంత్రి ఉన్నతాధికారులతో సీఎం చర్చించి పలు కీలక ఆదేశాలిచ్చారు. ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు, పంపిణీ అన్నది నిరంతర కార్యక్రమం అని, దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 30,06,673 ఇళ్లపట్టాలకు గానూ 26,21,049 పట్టల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటిని కూడా రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘సోషల్‌ ఆడిట్‌ ద్వారా లబ్ధిదారులను గుర్తించాలి. నిర్మాణాల్లో ఏక రూపత, నాణ్యత కోసం చర్యలు తీసుకోవాలి. ఒక కాలనీలో కల్పిస్తున్న సదుపాయాలు, వాటి నిర్మాణాలు వంటి తదితర అంశాలపై పూర్తి వివరాలు నివేదించాలి. వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో ఇంటర్‌నెట్‌  సదుపాయం కూడా కల్పించాలి. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయండి. డంపింగ్‌ యార్డుల్లో బయో మైనింగ్‌ చేయాలి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ మొదలుపెట్టాలి’ అని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.

వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మార్చి 31 నాటికి వాటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) పూర్తి చేస్తామన్నారు. వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో జనాభాను అనుసరించి అంగన్‌వాడీ కేంద్రాలు, వైయస్‌ఆర్‌ క్లీనిక్‌లు,  పీహెచ్‌సీలు, పాఠశాలలు, బస్టాప్‌లు వంటి నిర్మాణాలపై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి మంత్రి శ్రీరంగనాథ రాజు, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌ జైన్, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top