దిశ చ‌ట్టంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: దిశ చట్టం యాప్‌, నంబ‌ర్ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను పోస్ట‌ర్ల ద్వారా ప్ర‌చారం చేయాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. వీలైనంత త్వ‌ర‌గా ఫోరెన్సిక్ ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేయాల‌ని, దిశ యాప్ ద్వారా వ‌చ్చే ఫిర్యాదుల‌కు క్వాలిటీ సేవ‌లు అందించాల‌ని ఆదేశించారు. దిశ చ‌ట్టం అమ‌లుపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించిన స‌మావేశానికి హోంమంత్రి మేక‌తోటి సుచ‌రిత‌, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. మ‌హిళ‌లు, చిన్నారుల‌పై నేరాల‌కు సంబంధించిన వివ‌రాల కోసం ప్ర‌త్యేక కోర్టుల ఏర్పాటు ప్ర్రక్రియ‌పై వివ‌రాలను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర హోంశాఖ వ‌ద్ద ఫైల్ పెండింగ్‌లో ఉంద‌ని అధికారులు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. వీలైనంత త్వ‌ర‌గా ప్ర‌త్యేక కోర్టులు ఏర్పాట‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఆ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వంతో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. క్రిమిన‌ల్ లాలో స‌వ‌ర‌ణ‌లు చేస్తూ పంపిన బిల్లుకు కేంద్రం ఆమోదం వ‌చ్చేలా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ప్ర‌త్యేక ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ల నియామ‌కంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆరా తీశారు. దిశ చ‌ట్టం కింద కేసుల విచార‌ణ‌కు 13 జిల్లాల్లో 11 మంది ప్రాసిక్యూట‌ర్లు.. పోస్కో కేసుల విచార‌ణ‌కు 8 మంది ప్రాసిక్యూట‌ర్ల‌ను నియ‌మించామ‌ని అధికారులు తెలిపారు. మిగిలిన చోట్ల కూడా ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ల‌ను త్వ‌ర‌గా నియ‌మించాల‌ని సీఎం ఆదేశించారు.

Back to Top