పంటల ప్రణాళిక, ఇ–మార్కెటింగ్‌పై సీఎం సమీక్ష

ఆర్‌బీకే పరిధిలో పంటలపై మ్యాపింగ్‌ చేయాలి

వ్యవసాయ సలహా బోర్డులను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం

తాడేపల్లి: పంటల ప్రణాళిక, ఇ–మార్కెటింగ్‌ విధానంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాల పరిధిలో పంటలపై మ్యాపింగ్‌ చేయాలని ఆదేశించారు. మండల, జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహా బోర్డులను త్వరితగతిన ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మార్కెట్‌ చేయలేని పంటలు వేస్తే రైతులు నష్టపోతారని, ఇ–క్రాపింగ్‌ గైడ్‌లెన్స్, ఎస్‌ఓపీలను వెంటనే తయారు చేయాలన్నారు.

ఇ–క్రాపింగ్‌ విధానాలను గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో పెట్టాలని, ప్రభుత్వం 30 శాతం పంటలను కొనుగోలు చేయాలని నిశ్చయించిందన్నారు. మిగతా 70 శాతం పంటలు అమ్ముడయ్యేలా ప్రయత్నాలు చేయాలన్నారు. ఇ– మార్కెటింగ్‌ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయాలని, గ్రామస్థాయిలో గ్రేడింగ్, ప్యాకింగ్‌ సదుపాయాలు ఉండాలన్నారు. ఇ– మార్కెటింగ్‌ మీద పంటను అమ్మాలంటే నాణ్యత చాలా ముఖ్యమని, ఖరీఫ్‌ పంట చేతికొచ్చే సమయానికి గ్రేడింగ్, ప్యాకింగ్‌ అందుబాటులోకి తేవాలన్నారు. వచ్చేకాలంలో జనతా బజార్లకు ఈవిధానాలు దోహదపడతాయన్నారు. 
 

Back to Top