తాడేపల్లి: వైద్యపరంగా అవసరాలను గుర్తించి, ఆ మేరకు ఆక్సిజన్, మందులను సిద్ధం చేయాలని, టెలిమెడిసిన్ ద్వారా కాల్చేసిన వారికి వైద్యం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రికాషన్ డోస్ వేసుకునేందుకు ఇప్పుడున్న 9 నెలల వ్యవధిని 6 నెలల వ్యవధికి తగ్గించేలా కేంద్రానికి లేఖరాయాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో కోవిడ్ విస్తరణ పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, సెకండ్ వేవ్‌తో పోల్చిచూస్తే.. ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స కోసం పడకల సంఖ్య కూడా పెంచామని అధికారులు తెలిపారు. అన్నిజిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయన్నారు. వారం రోజులకు ముందే డిశ్చార్జ్ దాదాపు 27వేల యాక్టివ్ కేసుల్లో కేవలం 1,100 మంది మాత్రమే ఆస్పత్రి పాలయ్యారని వివరించారు. ఇందులో ఆక్సిజన్ అవసరమైన వారి సంఖ్య సుమారు 600 మంది మాత్రమేనని తెలిపారు. గతంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలంటే కనీసం 14 రోజులు ఉండేదని, ఇప్పుడు వారం రోజులకు ముందే డిశ్చార్జ్ అవుతున్నారని అధికారులు వివరించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కోవిడ్‌కేర్ సెంటర్‌ను గుర్తించామని.. సుమారు 28 వేల బెడ్లను సిద్ధంచేశామని అధికారులు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు వివరించారు. వైద్య పరంగా అవసరాలను గుర్తించాలని, ఆ మేరకు ఆక్సిజన్‌ను, మందులను సిద్ధం చేయాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. 104 కాల్‌సెంటర్.. కాల్‌సెంటర్ పటిష్టంగా పనిచేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారు. టెలిమెడిసిన్ ద్వారా కాల్చేసిన వారికి వైద్యం అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రికాషన్ డోస్ వేసుకునేందుకు ఇప్పుడున్న 9 నెలల వ్యవధిని 6 నెలల వ్యవధికి తగ్గించాలంటూ కేంద్రానికి లేఖరాయాలని సీఎం నిర్ణయించారు. దీనివల్ల ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, అత్యవసర సర్వీసులు అందిస్తున్న వారికి ఉపయోగమని సీఎం అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆస్పత్రిపాలు కాకుండా చాలామందిని కోవిడ్‌నుంచి రక్షించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి రెండో డోస్ వ్యాక్సినేషన్లో మిగతా జిల్లాలతో పోలిస్తే కాస్త దిగువన ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి, గుంటూరు, వైయస్ఆర్ కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రెండో డోస్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. 15 నుంచి 18 ఏళ్లవారికీ వ్యాక్సినేషన్ నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు 100 శాతం పూర్తిచేశాయని, మరో 5 జిల్లాల్లో 90శాతానికిపైగా ఈ వయసులవారికి వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. ఇంకో నాలుగు జిల్లాల్లో 80శాతానికిపైగా వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ ఉద్ధృతంగా వ్యాక్సినేషన్ చేయాలని సీఎం ఆదేశించారు. మిగిలిన జిల్లాలతో పోలిస్తే తక్కువగా ఉన్న విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. కేంద్రం కొత్త మార్గదర్శకాలపై చర్చ.. కోవిడ్ పరీక్షల్లో కేంద్రం కొత్త మార్గదర్శకాలపైన ఈ సమావేశంలో చర్చించారు. కోవిడ్ లక్షణాలు లేనివారికి ఎలాంటి పరీక్షలు చేయొద్దని ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొందని అధికారులు తెలిపారు. కోవిడ్ పాజిటివ్ తేలినవారి కాంటాక్ట్స్‌లో కేవలం హైరిస్క్ ఉన్నవారికి పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ స్పష్టంచేసిందని అధికారులు వివరించారు. 104, 108 ఎస్ఓపీల పరిశీలన.. ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న మెడికల్‌కాలేజీల నిర్మాణ ప్రగతిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్షించారు. ఆరోగ్య శ్రీపై పూర్తి వివరాలు తెలిపేలా విలేజ్, వార్డ్ క్లినిక్స్‌లో, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెద్ద హోర్డింగ్ పెట్టాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్య శ్రీ రిఫరల్ పాయింట్‌గా క్లినిక్స్ వ్యవహరించాలని, వైద్యం కోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై పూర్తి వివరాలతో సమాచారం లభించాలన్నారు. ఆరోగ్యశ్రీ కింద పేషెంట్ రిఫరల్ వ్యవస్థపై రూపొందించిన స్టాండర్డ్ ఆపరేషన్‌ప్రొసీజర్‌ను సమగ్రంగా సమీక్షించారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలకు, గ్రామ–వార్డు సచివాలయాల్లో ఆరోగ్య మిత్రలకు, పీహెచ్సీ ఆరోగ్య మిత్రలకు, 104 మెడికల్ ఆఫీసర్‌కు, 108 మెడికల్ ఆఫీసర్‌కు రూపొందించిన ఎస్ఓపీలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిశీలించారు. ఆరోగ్య మిత్రలు కీలకంగా వ్యవహరించాలి.. ఆరోగ్య శ్రీ కింద రోగులకు సమర్థవంతంగా సేవలందించాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. విలేజ్‌క్లినిక్‌కు వెళ్లినా, పీహెచ్‌సీకి వెళ్లినా, లేదా నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్లినా.. ఇలా పేషెంట్ ఎక్కడకు వెళ్లినా.. వారి ఆరోగ్య పరిస్థితిని వెంటనే తెలుసుకుని, వైద్యంకోసం ఎక్కడకు పంపాలన్న విధానం చాలా పటిష్టంగా ఉండాలని సూచించారు. 104, 108, పీహెచ్‌సీలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో ఉండే డాక్టర్లు కూడా ఈ ప్రక్రియలో భాగమయ్యేలా, వారికి మంచి సేవలు అందించేలా ఈ రిఫరల్ విధానం ఉండాలన్నారు. ఆరోగ్య మిత్రలు కీలకంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ సేవల సమన్వయంకోసం యాప్ పనిచేయాలని ఆదేశించారు.