ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది రాకూడ‌దు

వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో పోటీని పెంచాలి

నిరాశాజనక పరిస్థితులు ఎక్కడున్నా వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకోవాలి

ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసే రైతులకు ప్రోత్సాహాకాలు ఇవ్వాలి

ఆర్బీకేల పనితీరును దేశవ్యాప్తంగా కొనియాడుతున్నారు

రైతుల ముంగిటకే సేవలు కొంద‌రికి న‌చ్చ‌క దుష్ప్ర‌చారం చేస్తున్నారు

పాలుపోసే రైతులే అమూల్‌ సంస్థకు యజమానులు

అగ్రి ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి: వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో పోటీని పెంచేలా చూడాలని, రైతులకు మంచి ధర అందేలా ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ధరల విషయంలో రైతులకు ఎక్కడ నిరాశాజనక పరిస్థితులు ఉన్నా వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకోవాల‌ని సూచించారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకునే చర్యలను దూకుడుగా చేపట్టాల‌ని, ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. అగ్రి ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆర్బీలు, ప్రత్యామ్నాయ పంటలు, జగనన్న పాలవెల్లువ, పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఫిషింగ్ హార్బ‌ర్ల నిర్మాణంపై స‌మీక్షించారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్‌ ఏమన్నారంటే..

``ఆర్బీకేల పనితీరును దేశవ్యాప్తంగా కొనియాడుతున్నారు. నాణ్యత ఉన్న ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు రైతులకు మంచి ధరలకే లభిస్తున్నాయి. బయట మార్కెట్లో డీలర్‌ అమ్మే రేట్లకన్నా తక్కువ రేట్లకే ఆర్బీకేల్లో లభిస్తున్నాయి. రేట్లలో మోసం లేదు, క్వాలిటీలో మోసం లేదు. దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాం. ఆర్బీకేల్లో రైతులు ఆర్డర్లను ప్లేస్‌చేయగానే వాటిని వారికి అందించేలా చర్యలు తీసుకోవాలి. అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకున్నాం. దీంట్లో భాగంగా పొటాష్‌ను కూడా తెప్పించుకున్నాం. ఇలాంటి ఆర్బీకేలపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా ఎమ్మార్పీ ధరలకే నాణ్యమైన సీడ్, ఫీడ్, ఎరువులు రైతులకు అందుబాటులోకి రావడం వారికి ఇష్టం లేనట్టుంది. అధిక ధరల్లో రైతులు చిక్కుకోవాలని, ఎరువులకోసం, విత్తనాల కోసం అప్పులు చేసి వడ్డీలు మీద వడ్డీలు చెల్లించే పరిస్థితులే కొనసాగాలన్నది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్టవేస్తూ ఆర్బీకేలను తీసుకురావడం, వాటి ద్వారా రైతుల ముంగిటకే సేవలు అందించడం వారికి నచ్చడం లేదు`` అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.  

సబ్‌ డీలర్లుగా ఆర్బీకేలు..
మరో అడుగు ముందుకేసి ఆర్బీకేలను సబ్‌డీలర్లుగా మార్పు చేస్తున్నామని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. వచ్చే రబీ సీజన్ నుంచి ఇది అమల్లోకి వస్తోందని తెలిపారు. దీంతో రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు. వరి అధికంగా సాగవుతున్న ప్రాంతాల్లో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. 

బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు 
బోర్ల కింద వరిని సాగుచేసే చోట ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. మిల్లెట్స్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగును ప్రోత్సహించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసే రైతులకు ప్రోత్సాహాకాలు కూడా ఇవ్వాలన్నారు. ఇలాంటి చోట ప్రాసెసింగ్‌ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాల‌న్నారు. తద్వారా రైతులకు అండగా నిలబడగలుగుతామని సీఎం వివ‌రించారు. 33 చోట్ల సీడ్‌ కమ్‌ మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. ఈ డిసెంబరు నాటికి 20 యూనిట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. 33 యూనిట్లను మార్చి 2022 కల్లా పూర్తి చేయడానికి లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తాయని సీఎంకు వివ‌రించారు. 

పాడి రైతులకు మేలు జరుగుతోంది..
రైతులకు మేలు చేస్తున్న జ‌గ‌న‌న్న పాల‌వెల్లువ‌ కార్యక్రమంపైనా లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమూల్‌ అన్నది ప్రైవేటు సంస్థకాదని, అది పెద్ద సహకార ఉద్యమమ‌న్నారు. పాలుపోసే రైతులే ఈ సంస్థకు యజమానులు ఉంటార‌ని, లాభాలన్నీ తిరిగి రైతులకే చెందుతాయ‌న్నారు. ఇలాంటి కార్యక్రమంపైనా విషప్రచారానికి కొంద‌రు నానా ప్రయత్నాలు చేస్తున్నారని మండిప‌డ్డారు. అమూల్‌ వచ్చాక  పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితులు వచ్చాయ‌ని, దీనివల్ల రైతులకు మేలు జరుగుతోంద‌న్నారు. బీఎంసీల నిర్మాణంపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు అధికారులు వివ‌రాలు అందించారు. ప్రాధాన్యతా క్రమంలో గుర్తించిన బీఎంసీలను డిసెంబర్‌ నాటికి పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. జగనన్న పాలవెల్లువ కార్యక్రమం చేపట్టిన జిల్లాల్లో పాల సేకరణ అంతకంతకూ పెరుగుతోందన్నారు. 

పనులను వేగవంతం చేయాలి..
పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాట్లపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షించారు. ఇప్పటివరకు జరిగిన ప్రగతిని అధికారులు సీఎంకు నివేదించారు. పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు.  

ఐదు ఫిషింగ్‌ హార్బర్ల పనులపై దృష్టిపెట్టాలి..
ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణంపై సీఎం సమీక్షించారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలో పనులు జరగుతున్నాయని అధికారులు తెలిపారు. జూలైలో పనులు దాదాపుగా పూర్తవుతాయని వివ‌రించారు. మిగిలిన ఐదు ఫిషింగ్‌ హార్బర్ల పనులపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. 

ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయ మార్కెటింగ్‌ ముఖ్య కార్యదర్శి వై.మధుసూద‌న్‌ రెడ్డి, పుడ్‌ ప్రాససింగ్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి ముకేష్‌ కుమార్‌ మీనా, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, ఏపీడీడీసీఎఫ్‌ లిమిటెడ్‌ ఎండీ ఎ.బాబు, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ కమిషనర్ పి.ఎస్‌. ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, ఉద్యానవనశాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌. ఎస్‌. శ్రీధర్, సీడ్స్‌ కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీ  జి. శేఖర్‌ బాబు, మారిటైం బోర్డు సీఈఓ కె. మురళీధరన్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top