అమరావతి: రాష్ట్రంలో వివిధ నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం శ్రీ వైయస్.జగన్ ఆదేశించారు. ఉదయం తన కార్యాలయ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద సమగ్ర పరిశీలనచేయాలన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద నిర్వహణా పరిస్థితులు సరిదిద్దాలని, రాష్ట్ర విభజన నాటినుంచి దీనిగురించి పట్టించుకోలేదన్నారు. దీనివల్ల ముప్పు ఏర్పడే పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా నిర్వహణ కోసం తగినంత సిబ్బంది ఉన్నారా? లేదా? అన్నదానిపై లెక్కలు తీయాలన్నారు. అవసరమైన సిబ్బందిని నియమించాలని ఆదేశాలు జారీచేశారు. గత సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ దిశగా ప్రభుత్వ యంత్రాంగం కొన్ని చర్యలు చేపట్టిందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జవనరులశాఖ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ, రెవిన్యూ–విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జలవనరులశాఖ ఇంజినీర్‌ఇన్ ఛీఫ్‌లతో కమిటీని ఏర్పాటుచేసిన విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఐఐటీ, జేఎన్‌టీయూ నిపుణుల కమిటీకి జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఛైర్మన్‌గా ఉన్నారని, తీసుకోవాల్సిన చర్యలను అత్యున్నత కమిటీకి తెలియజేస్తున్నారని వివరించారు. సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు వివిధ∙ప్రాజెక్టులు, నిర్వహణలపై గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన నివేదికలను కూడా అత్యున్నతస్థాయి కమిటీ పరిశీలిస్తోందన్నారు.తాజా వచ్చిన వరదలను, కుంభ వృష్టిని పరిగణలోకి తీసుకుని ఆమేరకు తగిన సూచనలు చేస్తుందన్నారు. ఆటోమేషన్ రియల్‌టైం డేటాకూ కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించే వ్యవస్థపైనాకూడా చీఫ్ సెక్రటరీతో కూడిన అత్యున్నత బృందం దృష్టిసారించిదని ముఖ్యమంత్రికి వివరించారు. అన్ని మేజర్, మీడియం రిజర్వాయర్లు, బ్యారేజీల నిర్వహణకు అదనపు సిబ్బంది నియామకం, అలాగే వాటర్ రెగ్యులేషన్‌కోసం కూడా సిబ్బంది నియామకంపై ప్రతిపాదనలు సిద్దమయ్యాయని అధికారులు తెలియజేశారు. వీరి నియామకానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పెద్దమొత్తంలో నీటిని విడుదల చేసిన పక్షంలో ఆస్తినష్టం, ప్రాణనష్టానికి ఆస్కారమున్న లోతట్టుప్రాంతాలను గుర్తించే పనినికూడా కమిటీ చేస్తోందని కూడా అధికారులు తెలిపారు.