మ‌న‌కు ఓటు వేయ‌ని వారికి కూడా సంక్షేమ ప‌థ‌కాలు అందాలి

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ వీడియో కాన్ఫరెన్స్‌

గ్రామ, వార్డు సచివాలయాలను అధికారులు తరచూ తనిఖీ చేయాలి

ఆగస్టు 10న నేతన్న నేస్తం. 16న విద్యా కానుక

ఫెర్మామెన్స్ బాగా లేనివారికి మెమో జారీచేయాలని ఆదేశం

తాడేప‌ల్లి: బియ్యం కార్డు, పెన్షన్‌ కార్డు, ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ పథకాలు అత్యంత ముఖ్యమైనవ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. నిర్దేశించుకున్న గడువులోగా అర్హులకు సంక్షేమ ప‌థ‌కాలు అందేలా చూడాలని అధికారుల‌ను ఆదేశించారు.  మనకు ఓటు వేయని వారికి కూడా ఇవి అందేలా చూడాల‌ని సూచించారు.  వీటిని స్వయంగా పరిశీలించాలి, పర్యవేక్షణ, సమీక్ష చేయాల‌ని, ఇందులో ఏమైనా లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాల‌ని ఆదేశాలు జారీ చేశారు. స్పందన కార్యక్రమంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరుపై ఆరా తీశారు. డీబీటీ పథకాల్లో సోషల్‌ ఆడిట్‌ కోసం జాబితాను ప్రదర్శిస్తున్నారా? లేదా అన్నది చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

వారానికి నాలుగు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శించాలని చెప్పాం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకుంటే సమస్యలెలా తెలుస్తాయని సీఎం ప్రశ్నించారు. గ్రామ, వార్డు సచివాలయాలను అధికారులు తరచూ తనిఖీ చేయాలి. తప్పులు జరిగితే వాటిని సరిచేసే అవకాశం ఉంటుందని, కలెక్టర్లు, జేసీల స్థాయిలో పర్యవేక్షణ బాగుందన్నారు. మిగిలిన అధికారులు కూడా సమర్ధవంతంగా పనిచేయాలన్నారు. 100 శాతం గ్రామ, వార్డు సచివాలయాల్లో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

పేదల గురించి ఆలోచించి మానవత్వం చూపించాలని సీఎం వైయ‌స్‌ జగన్‌ అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారుల తీరుపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెర్మామెన్స్ బాగా లేనివారికి మెమో జారీచేయాలని ఆదేశించారు.  వ‌చ్చే నెల‌లో అమ‌లు చేసే సంక్షేమ ప‌థ‌కాల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షించారు. ఆగస్టు 10న నేతన్న నేస్తం. 16న విద్యా కానుక,  రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆగస్టు 24న నగదు జమ చేయాల‌న్నారు. ఎంఎస్‌ఎంఈలు, స్పిన్నింగ్‌ మిల్స్‌కు ఆగస్టు 27న ఇన్సెంటివ్‌లు ఇస్తున్న‌ట్లు చెప్పారు. 

Back to Top