తాడేపల్లి: వైయస్ఆర్ సీపీ నేత సుబ్బారావు మృతిపై పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుబ్బారావు కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పార్టీ తరఫున రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని కూడా ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం వెస్ట్ విప్పర్రు గ్రామానికి చెందిన ఎడవల్లి సుబ్బారావు (62) మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఈ నెల 7న విజయవాడలో జరిగిన జయహో బీసీ సదస్సుకు హాజరైన సుబ్బారావు అక్కడ అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను పార్టీ శ్రేణులు విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి అత్యుత్తమ వైద్యం అందించారు. సుబ్బారావు మృతి సమాచారం తెలిసిన వెంటనే డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆస్పత్రికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఈ విషయాన్ని మంత్రి కొట్టు సత్యనారాయణ సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పార్టీ తరఫున రూ.10 లక్షలు సాయం ప్రకటించారు. ఆ మొత్తాన్ని మృతుడి గ్రామానికి వెళ్లి స్వయంగా అందజేయనున్నట్లు మంత్రులు కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్ తెలిపారు. బీసీల పట్ల సీఎం వైయస్ జగన్‌కు ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని తెలిపారు.