గుంటూరు జిల్లా న‌ల్ల‌పాడు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

గుంటూరు: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు చేరుకున్నారు. దేశంలోనే అతిపెద్ద మెగా టోర్నీ ``ఆడుదాం ఆంధ్రా``ను ప్రారంభించేందుకు గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్‌ స్కూల్‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, క్రీడాకారులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. మ‌రికాసేప‌ట్లో ల‌యోలా ప‌బ్లిక్ స్కూల్‌లోని క్రీడా మైదానంలో ఆడుదాం ఆంధ్రా పోటీల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు.  

3.33 లక్షల జట్లు పోటీ పడేందుకు అనువుగా 9,478 క్రీడా మైదానాలను తీర్చిదిద్దింది. నేటి నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు నిర్విరామంగా ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. తొలి దశలో జనవరి 9వతేదీ నాటికి గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలను పూర్తి చేయనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం జనవరి 10 నుంచి 23 వరకు మండల స్థాయిలో, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 6వతేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి.

ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలను నిర్వహిస్తోంది. 15 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలను క్రీడల వైపు ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే దాదాపు 1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకుల రిజిస్ట్రేషన్లతో ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం చరిత్ర సృష్టిస్తోంది. ఇందులో 34.19 లక్షల మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. వీరిలో పది లక్షల మందికిపైగా మహిళలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం విశేషం. కాంపిటీటివ్‌ విభాగంలోని ఐదు ప్రధాన క్రీడాంశాల్లో క్రికెట్‌లో అత్యధికంగా 13 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. నాన్‌ కాంపిటీటివ్‌ విభాగంలోని మారథాన్, యోగ, టెన్నీ కాయిట్‌లో 16 లక్షల మంది (కాంపిటీటివ్‌ విభాగంలో ఉన్నవారితో కలిపి) ఆసక్తి చూపించారు.   

Back to Top