కుప్పం: టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 35 ఏళ్లు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యే.. ఆయన వల్ల మంచి జరిగిందా?.. మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిందా అనేది ఆలోచించుకోవాలని కుప్పం ప్రజలను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ఎవరి వల్ల కుప్పం నియోజకవర్గానికి మంచి జరిగిందో ఆలోచన చేయాలని సీఎం సూచించారు. తాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ... కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట నిలబెట్టుకున్నానని చెప్పారు. రెండు లక్షల మంది ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలని మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కలను సాకారం చేసిందని సీఎం వైయస్ జగన్ చెప్పారు. హంద్రీనీవా నుంచి కుప్పానికి సీఎం వైయస్ జగన్ నీటిని విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే...: మీ చిక్కటి చిరునవ్వుల మధ్య, ఇంతటి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు చూపిస్తూ ఇక్కడికి వచ్చిన నా ప్రతిఅక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. కుప్పంలో పండగ వాతావరణం... దేవుడి దయ, ప్రజలందరి చల్లనీ దీవెనలతో ఈరోజు మనం కుప్పంలో మరో మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం. కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. కొండలు, గుట్టలు దాటుకుని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. కృష్ణమ్మ నీళ్లు కుప్పంలో– సువర్ణాధ్యాయం. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు?, ఎక్కడ కుప్పం? 672 కిలోమీటర్ల దూరంలో ఉండి, ఏకంగా 540 మీటర్ల ఎత్తు అంటే 1600 అడుగుల ఎత్తు.. పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది. 2022, సెప్టెంబర్ 23న ఇదే కుప్పం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు.. ఆరోజు నేను హాజరైనప్పుడు ఆనాడు మీ అందరికీ ఒక మాటిచ్చాను. చంద్రబాబునాయుడు హయాంలో లాభాలున్న పనులు మాత్రమే చేసి, దోచేసుకొని ఆ తర్వాత ఆపేసిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు మనమే పూర్తి చేస్తామని, కృష్ణా జలాలు తరలిస్తామని, కుప్పం నియోజకవర్గానికి ఆ నీళ్లు తెస్తామని ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కుప్పానికి ఈరోజు కృష్ణా జలాలు తీసుకురాగలిగానని సగర్వంగా తెలియజేస్తున్నాను. మరో రెండు ప్రాజెక్టు పనులకూ శ్రీకారం... కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా మరో రెండు ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ, మరో రెండు రిజర్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా శ్రీకారం చుట్టే దిశగా.. వాటికి కూడా పరిపాలన అనుమతులు ఇచ్చాం. కృష్ణా జలాలలను ఇక్కడకు తీసుకురావడం ద్వారా...దాదాపు 6300 ఎకరాలకు సాగునీరు అందిస్తూ, కుప్పం నియోజకవర్గం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులు నింపుతూ ఇప్పటికే అడుగులు పూర్తి కావచ్చాయి. ఈరోజు మరింత స్టోరేజీ క్రియేట్ చేస్తూ కుప్పం నియోజకవర్గంలో 1 టీఎంసీ సామర్థ్యంతో అన్ని కోణాల్లోనూ పరిశీలన, సర్వే అండ్ లెవలింగ్ ఆపరేషన్స్ అన్నీపూర్తి చేసి రెండు చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి అనువుగా ఉందని గుర్తించడం జరిగింది. గుడిపల్లి మండలంలోని యామగానిపల్లె వద్ద ఒక రిజర్వాయర్‌ను, శాంతిపురం మండలం మాదనపల్లె వద్ద మరో రిజర్వాయర్ ను రూ.535 కోట్లతో నిర్మించడానికి, అదనంగా దీని వల్ల మరో 5 వేల ఎకరాలకు తాగు, సాగు నీరు అందించేందుకు మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటికి పరిపాలన అనుమతులు కూడా ఇప్పటికే మంజూరు చేశాం. ఈ 2 ప్రాజెక్టులే కాకుండా రాబోయే రోజుల్లో మరో ముఖ్యమైన పాలారు ప్రాజెక్టుకు సంబంధించి 0.6 టీఎంసీల కెపాసిటీతో చిన్నపాటి రిజర్వాయర్‌ను రూ.215 కోట్లతో కట్టడానికి కూడా పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. వచ్చే టర్మ్‌నాటికి మూడూ ప్రాజెక్టులు పూర్తి... కుప్పం నియోజకవర్గానికి మీ బిడ్డ నీళ్లు తెచ్చాడు. వచ్చే టర్మ్ లో ఈ మూడు ప్రాజెక్టులూ పూర్తి చేసి మీకు అందిస్తాడు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబుగారిని.. మీరందరూ చూశారు.మీకు కొత్త కాదు. 14 ఏళ్లు ఈ పెద్దమనిషి సీఎంగా కూడా చేశాడు. మూడుసార్లు సీఎం అయ్యాడు. కుప్పానికే ప్రయోజనం లేని నాయుకుడు బాబు.. 35 సంవత్సరాల్లో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడంటే, కుప్పానికే నీరు తీసుకొనిరాలేదు అంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా బాగా ఆలోచన చేయాలి. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ తెలుసు. దాన్ని నీరుపారే కాల్వగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులు కనిపిస్తాయి. కాబట్టే ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చేవారిలో ఎవరికి ఇవ్వాలి?, అంచనాలు ఎలా పెంచాలి?, మట్టి పనులు ఎలా పెంచుకోవాలి?, ఇలా ఎంత ముడుపులు పుచ్చుకోవాలనే అంశంపైనే చంద్రబాబు రీసెర్చ్ చేశాడు. ఇక్కడి ప్రజలకు గానీ, పక్కనే ఉన్న పలమనేరులో కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న 2 లక్షలమంది ప్రజలకు మంచి నీళ్లు ఎలా అందించాలి?, సాగునీరు ఎలా అందించాలన్న అంశంపై కనీసం ఆయన దృష్టి కూడా లేదు. ఆలోచన చేయమని అడుగుతున్నాను. కుప్పం, పలమనేరు ప్రజలు కలలుగన్న ఈ స్వప్నాన్ని పూర్తిచేసింది, ఈరోజు చిత్తశుద్ధి చూపించింది మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు 2015లో జలవనరుల శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేసిన తర్వాత 2015 నుంచి 2018 మధ్యలో రకరకాల కారణాలు చూపిన చంద్రబాబు.. ఆ అంచనాలను అమాంతం పెంచుకుంటూ పోయాడు. అలా రూ.561 కోట్లకు పెంచుకుంటూ తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు, తన పార్టీ వారికి, బినామీలకు పనులు అప్పజెప్పాడు. కుప్పం ప్రజల సహనానికి జోహార్లు... 2019 ఎన్నికలకు ముందు పనులు పూర్తిచేయకపోగా, లాభాలు వచ్చే పనులు మాత్రమే చేసి, మిగిలిన ముఖ్యమైన పనులు వదిలేసి, తన అస్మదీయ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు సొమ్ములు ఇచ్చాడు చంద్రబాబునాయుడు. ఇది మన కళ్లెదుటనే కనిపించిన విషయం. అందుకే కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను... కుప్పం, పలమనేరులో 4 లక్షల ప్రజలకు నీరందే కాలువలాకాకుండా చంద్రబాబు జేబులోకి నిధులు పారే కాలువగా...తన సొంత నియోజకవర్గాన్ని కూడా ఉపయోగపెట్టుకున్నాడంటే ఇంతకన్నా అన్యాయమైన వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తాడా? ఇంత అన్యాయపు నాయకుడిని, తన నియోజకవర్గ ప్రజల్నే దోచుకున్న నాయకుడిని, తన నియోజకవర్గానికి దాహార్తిని కూడా తీర్చని ఈ నాయకుడిని, ఇంతకాలం భరించిన ఈ కుప్పం ప్రజలందరికీ మీ సహనానికి, మీ మంచితనానికి నా జోహార్లు చెబుతున్నాను. ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగిందో ఆలోచన చేయాలి. 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ, 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేసిన చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా? కేవలం 58 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా? అన్నది ఆలోచన చేయాలి. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది ఎవరంటే.. మీ జగన్. కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే.. మీ జగన్.. కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది, కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది కూడా మీ జగన్. చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ లాభాల కోసం మూసేయించి, చిత్తూరు డెయిరీని తెరిపించడమే కాకుండా అమూల్ ను తీసుకొచ్చి ఇదే కుప్పం, ఇదే పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరంటే మీ జగన్. ఇదే చిత్తూరు జిల్లాకు ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన వెల్లూర్ సీఎంసీ మెడికల్ కాలేజీ. ఎవరికి బాగా లేకున్నా అక్కడికి వెళ్లి వైద్యం చేయించుకుంటారు. అటువంటి హాస్పిటల్ రాకుండా చిత్తూరు జిల్లాకు రాకుండా, కుప్పం ప్రజలకు అందుబాటులోకి రాకుండా, పలమనేరు ప్రజలకు రాకుండా చేసింది ఎవరంటే చంద్రబాబు, ఈనాడు రామోజీరావు వియ్యంకుడు, చంద్రబాబు పార్టనర్. వీళ్లిద్దరూ కలిసి ఆ కాలేజీ నిర్మాణం ముందుకు తీసుకెళ్లకపోతే మళ్లీ ఆ కాలేజీని చిత్తూరులో పున:ప్రారంభించేట్టటుగా చేసింది ఎవరంటే మీ జగన్. కుప్పంలో మరో రెండు విద్యత్తు సబ్ స్టేషన్లు నిర్మించింది, కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీసు కాంప్లెక్సులు నిర్మిస్తోంది ఎవరంటే మీ జగన్. కుప్పం మున్సిపాలిటీకి రూ.66 కోట్లు ఇచ్చి పనులు మంజూరు చేసి ఆ పనులుజరిగిస్తున్నది ఎవరంటే మీ జగన్. చంద్రబాబులా మీ జగన్ ఏనాడూ ప్రజల్ని తిట్టలేదు. ఇవి మాత్రమే కాకుండా... మరికొన్ని విషయాలను మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా నోట్లోంచి కొన్ని మాటలు వస్తుంటాయి. పులివెందులను, కడపను తిడతాడు. చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు. కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడూ కూడా ఇక్కడి ప్రజల్ని గానీ, కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఏనాడూ మీ జగన్ ఒక్క మాట అనలేదు. పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తున్నది మీ బిడ్డ. పులివెందులలో ఉన్నా, కుప్పంలో ఉన్నా, అమరావతిలో ఉన్నా, ఇచ్చాపురంలో ఉన్నా.. పేదల్ని పేదలుగా చూశామే తప్ప వారి కులం, వారి మతం, ప్రాంతం, చివరికి వారి పార్టీ కూడా చూడకుండా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గతంలో బాబుకు ఓటేసిన– పేదవాళ్లూ నా వాళ్లే.. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేసిన కుప్పంలో ఉన్న పేదలందరికీ ఓ మాట చెబుతున్నాను. మీరందరూ నావాళ్లే అని గర్వంగా చెబుతున్నాను. కాబట్టే బాబుకు మించి ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడి ప్రజలకు మనసు చూపాం. మంచి చేశాం. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. మీరు చూశారు. ఆ చంద్రబాబు పరిపాలనకు మించి ప్రతి విషయంలోనూ ఇక్కడి పేదలకు, ఇక్కడి నా అన్నదమ్ములకు, అవ్వాతాతలకు మనసు చూపాం. మంచి చేశాం. కుప్పంలో 93.29 శాతం కుటుంబాలకు సంక్షేమం.. ఇదే కుప్పాన్ని తీసుకోండి. నేను చెప్పే ఈ అంశాలన్నా ఒక్కసారి టైమ్ తీసుకొని ఆలోచన చేయండి. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 87,941 కుటుంబాలుంటే ఈ 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మన ప్రభుత్వ పథకాలు, నవరత్నాలు అందుకున్న కుటుంబాలు.. అక్షరాలా ఏకంగా 82,039. అంటే 93.29 శాతం కుటుంబాలు మన ప్రభుత్వ పథకాలు అందుకున్నారు. మన నవరత్నాలు అందుకున్నారు. మనసున్న పాలన అంటే ఇదీ కాదా? ఆలోచన చేయండి. కుప్పం అక్కచెల్లెమ్మల ఖాతాల్లోనే రూ.1,400 కోట్లు జమ. మనందరి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంటే... 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా డీబీటీ ద్వారా లంచాలు, వివక్ష లేకుండా రాష్ట్ర మొత్తమ్మీద నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.55 లక్షల కోట్లు నేరుగా వెళ్లింది. ఇందులో కుప్పం నియోజకవర్గంలోని నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసిన మొత్తం అక్షరాలా రూ.1400 కోట్లు. కుప్పంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్నీ అడుగుతున్నాను. ఇక్కడున్న మిమ్మల్నందరినీ అడుగుతున్నాను. మీ బ్యాంకులకు మీరు వెళ్లండి. 10 సంవత్సరాల మీ బ్యాంకు అకౌంట్ స్టేట్ మెంట్ కావాలని అడగండి. చంద్రబాబు 5 సంవత్సరాల పరిపాలకు సంబంధించింది, ఈ 5 సంవత్సరాలు మీ బిడ్డ పాలనకు సంబంధించినది కలిపి..ఈ 10 సంవత్సరాలకు సంబంధించి మీ బ్యాంకుల్లో మీ ఖాతాలను అడగండి. మీ బ్యాంకు ఖాతాల్లో గతంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు అకౌంట్లలోకి వచ్చిందా? చూసుకోమని అడుగుతున్నాను. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో... ఈ 57 నెలల కాలంలోనే నవరత్నాల పాలనలో మీ ఖాతాలకు అందించిన సాయాన్ని అదే మీ బ్యాంక్ స్టేట్ మెంట్ లో చూడండి. ఎన్ని లక్షలు మీరు అందుకున్నారో కనిపిస్తుంది. ఎవరిది మనసున్న పాలన– ఎవరిది పేదల ప్రభుత్వం... మరి ఎవరిది మనసున్న పాలన? ఎవరిది పేదల ప్రభుత్వం అన్నది ఆలోచన చేయమని అడుగుతున్నాను. అదే పెద్ద మనిషి మీకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 5 సంవత్సరాల ఆయన పాలనలో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మీ బ్యాంకుఅకౌంట్లలో పడలేదు. కానీ మీ బిడ్డ హయాంలో ఈ 58నెలల కాలంలో ఏకంగా రూ.1,400 కోట్ల రూపాయాలు కుప్పం నియోజకవర్గంలోని నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించగలిగాం. ప్రతినెలా ఒకటో తారీఖున ఉదయాన్నే సూర్యోదయాని కంటే ముందే, గతం గతంలో మాదిరిగా ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు, క్యూలైన్లో నిలబడాల్సిన పని లేదు. రోజులకొద్దీ నిరీక్షించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండానే..మీ ఇంటికే వచ్చి వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో పలకరిస్తూ మీ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ నెల నెలా పెన్షన్ ఇస్తున్నారు. చంద్రబాబు హయాంలో తీసుకుంటే ఇలా ఇంచికొచ్చే ఇంటికి వచ్చి ఇచ్చే వాలంటీర్ వ్యవస్థే లేదు. ఇంటికి వచ్చి మీ ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడే పరిస్థితే లేదు. క్యూలైన్లలోనిలబడి.. ఎండ, వాన, చలిలో ఆ పేదలు ఆ ఆరకొరా పెన్షన్ రూ.1000 కూడా.. కుప్పంలో కేవలం 31 వేల మందికి ఇచ్చిన పరిస్థితులు. ఈ 57 నెలల్లో ఏకంగా రూ.1000 పెన్షన్ ను 3 వేలకు పెంచింది మీ బిడ్డ ప్రభుత్వమే. గతంలో సుమారు 30 వేల మందికి ఇస్తుంటే... మీ బిడ్డ హయాంలో ఏకంగా 45,374 మంది ఇదే కుప్పం లో పెన్షన్లు తీసుకుంటున్నారు. చంద్రబాబు 5 సంవత్సరాలు.. మీ బిడ్డ హయాంలో ఈ 57 నెలల కాలం గమనిస్తే, చంద్రబాబు హయాంలో రూ.200 కోట్లు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితుల నుంచి ఈరోజు ఏకంగా రూ.507 కోట్లు నా అవ్వాతాతలకు, వికలాంగ సోదరులకు, అక్కచెల్లెమ్మలకు, వింతువులకు ఈరోజు మీ బిడ్డ ఇస్తున్నాడు. ఎక్కడా వివక్ష, లంచాలకు తావులేకుండా ఇంటికొచ్చే పెన్షన్ ఇచ్చే విధానం గతంలో లేదు. మనందరి ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతు భరోసాగా ఒక్క కుప్పంలోనే ఏకంగా 44,640 మంది రైతన్నలకు రైతు భరోసా పథకం ద్వారా ఏకంగా రూ.214 కోట్లు నేరుగా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు హయాంలో రైతన్నలకు ఇలా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏరోజూ జరగలేదు. రైతు భరోసానే లేదు. ఒక రైతు భరోసా కేంద్రం కూడా లేదు. ఈరోజు మన గ్రామ స్థాయిలో ఆర్బీకేలు మన కుప్పంలోనే ఏకంగా 83 కనిపిస్తాయి. కుప్పంలో ప్రతి గ్రామంలో ఒక విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్లు 93 కనిపిస్తాయి. వాలంటీర్ వ్యవస్థ, ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్. ఏకంగా 76 విలేజ్ క్లినిక్స్ కుప్పం నియోజకవర్గంలోనే కనిపిస్తున్నాయి. ప్రతి ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా తోడుగా నిలుస్తూ.. ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే సచివాలయాల్లో పని చేస్తున్న మన పిల్లలు 942 మంది. ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ లు వీటిలో పని చేస్తున్న పిల్లలు మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నారు. ఇవన్నీ గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జరగలేదు. కేవలం 57 నెలల మీ బిడ్డ పాలనలోనే జరుగుతోంది. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాలన్నీ కూడా మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని చంద్రబాబు దగా చేశాడు. అంతే కాకుండా 2016 అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశాడు. అక్కచెల్లెమ్మల జీవితాలు చిన్నాభిన్నమైన పరిస్థితి గతంలో ఉంటే మనందరి ప్రభుత్వం వైయస్సార్ ఆసరా కింద రాష్ట్ర వ్యాప్తంగా రూ.26 వేల కోట్లు పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఇస్తే, ఒక్క కుప్పంలోనే అక్షరాలా 44,888 మంది అక్కచెల్లెమ్మలకు రూ.172 కోట్లు ఇచ్చాం. గత ప్రభుత్వ హయాంలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నావడ్డీ ఎగ్గొడితే.... మనందరి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం కింద నా అక్కచెల్లెమ్మలకు మరో రూ.30 కోట్లు ఇచ్చింది. దీని వల్ల 6,055 సంఘాలకు మంచి జరిగిస్తూ 59,662 మంది అక్కచెల్లెమ్మలకు మరో రూ.30 కోట్లు ఇచ్చి తోడుగా నిలబడింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే. చంద్రబాబు హయాంలో చదివించే తల్లులకు అమ్మ ఒడి అనే స్కీమ్ అసలు లేనేలేదు. 2014–19 మధ్య బాబు పాలన ఇలా ఉంటే... మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న అమ్మ ఒడి ద్వారా కుప్పం నియోజకవర్గంలో 35,951 మంది పిల్లలను బడికి పంపించే తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చినది అక్షరాలా రూ.155 కోట్లు. కుప్పంలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో అందించిన ఇళ్ల పట్టాలు సున్నా. · అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల కాలంలోనే కుప్పం నియోజకవర్గంలోనే ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇప్పటికే 15,721 పట్టాలిచ్చాం. ఈనెలలోనే మరో 15 వేల ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వబోతున్నాం. మీ బిడ్డ మీ జగన్ ప్రభుత్వంలో నా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ మొత్తం 30,755 ఇళ్ల పట్టాలు ఇవ్వగలుగుతున్నాం. చంద్ర బాబు హయాంలో కుప్పంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్లు కేవలం 3547 మాత్రమే. అందులో కట్టింది కేవలం 2,968 మాత్రమే. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాలా 7,898 ఇళ్లు మంజూరు చేసి వాటిలో ఇప్పటికే 4,871 ఇళ్లు పూర్తి చేశాం. చంద్రబాబు హయాంలో 45–60 సంవత్సరాల మధ్య వయసున్న అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత కోసం ఆయన చేసింది ఒక సున్నా. మీ బిడ్డ హయాంలో ఈ 45–60 సంవత్సరాల అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ వైయస్సార్ చేయూత ద్వారా కుప్పంలో ఏకంగా 19,921 మందికి మంచి చేస్తూ... వారి కుటుంబాల ఖాతాల్లోకి ఇప్పటికే రూ. 85 కోట్లు పంపించాం. అక్కచెల్లెమ్మలు తమ కాళ్లమీద నిలబడేట్టుగా.. వరుసగా ప్రతి సంవత్సరం వారికి చేయూత అందించడంతో పాటు అమూల్, రిలయెన్స్, పీ అండ్ జి సంస్ధలతో టైఅప్ అవడం, వారితో కిరాణాషాపులు పెట్టించడం, ఆవులు, గేదెలు కొనిపించడం, ప్రతి ఒక్కరూ వాళ్లకాళ్లమీద నిలబడేటట్టుగా, ప్రతి ఒక్కరూ రూ.7వేలు నుంచి రూ.10 వేలు అదనపు ఆదాయం సంపాదించేటట్టుగా అడుగులు వేయించింది మీ బిడ్డ మాత్రమే. వైద్య, ఆరోగ్య రంగాన్ని చూస్తే... నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని.. పునర్జీవింపజేసి కుప్పంలో కొత్త 108, 104 వాహనాలు కుయ్ కుయ్ కుయ్ అని తిరుగుతున్నాయంటే కేవలం మీ అన్న పాలనలోనే.ఆరోగ్య ఆసరా, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలు అమలవుతున్నాయంటే మనసున్న మన పాలనలోనే జరుగుతున్నాయి. చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ పేరు మార్చి నిర్వీర్యం చేసి ఎన్టీఆర్ వైద్య సేవ అని మార్చాడు. కుప్పంలో కేవలం 7002 మందికి అందించిన సాయం రూ.28 కోట్లు అయితే, మీ బిడ్డ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని మెరుగుపర్చి 1000 ప్రొసీజర్లను 3350కి తీసుకుపోయి విస్తరింపజేసి, ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ వీటి ద్వారా ఏకంగా కుప్పంలోనే 17,552 మందికి మంచి జరిగిస్తూ రూ.64 కోట్లు నేరుగా ఇచ్చాం. పేదవాడి చదువులపట్లే బాబుకు ఆరాటం లేదు. పేదవాడి కోసం, పేదవాడి పిల్లల చదువుల కోసం బాబు ఏరోజూ ఆరాటపడలేదు. బాబు హయాంలో అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ కింద కేవలం 8459 మందికి మాత్రమే రూ.27 కోట్లు. అదే మనందరి ప్రభుత్వం ప్రభుత్వం 57 నెలల కాలంలోనే ప్రతి పిల్లాడికీ 100 శాతం పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ ఇస్తూ 12,093 మందికి విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా చెల్లించిన సొమ్ము అక్షరాలా రూ.61 కోట్లు. చంద్రబాబు అన్యాయస్తుడు– మనసులేని మనిషి. చంద్రబాబు ఎంత అన్యాయస్తుడంటే ఇచ్చే అరకొర సొమ్ముకూడా తన నియోజకవర్గంలో కూడా తనవారు, తనకు కాని వారు అని ఎలా విభజించాడో నేను చెప్పిన ప్రతి పథకంలో పెరిగిన లబ్ధిదారులను చూస్తే అందరికీ అర్థం అవుతుంది. ఈ ప్రయోజనాలు మన ప్రభుత్వ హయాంలో ఈ మాదిరిగా పెంచి ప్రతి ఒక్కరికీ జల్లెడ పడుతూ ఏ ఒక్కరికీ మిస్ కాకుండా ఇస్తూ ప్రతి గ్రామ సచివాలయంలో లబ్ధిదారుల జాబితా పెట్టడం జరిగింది. ఎవరైనా ఆ జాబితా చూసుకోవచ్చు. ఎవరికి, ఏ కుటుంబానికి మంచి జరిగిందో చూసుకోవచ్చు. ఇంత పారదర్శకంగా ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పేదవాడికీ అందుతున్న పరిస్థితులు మన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి ఒక్కరికీ కనిపిస్తాయి. సొంత నియోజకవర్గ ప్రజలకే మంచి చేయని వ్యక్తి – బాబు. సొంత నియోజకవర్గంలోనే పేదలకు మంచి చేయని ఈ వ్యక్తి 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మూడు సార్లు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలకే ఎలాంటి మేలు జరగలేదంటే.. మరి ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా, కుప్పం నియోజకవర్గానికి అర్హుడేనా? ఆలోచన చేయండి. బాబు ఎలాంటి వాడో చంద్రగిరి ప్రజలు తెలుసుకున్నారు. మీకు ఎమ్మెల్యే కాకమునుపు ఈ పెద్దమనిషి చంద్రబాబు చంద్రగిరిలో ఎమ్మెల్యే. అక్కడ తన సొంత ఊరు. సొంత నియోజకవర్గం. అక్కడ మొదటిసారు ఎమ్మెల్యే అయి, ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేశాడు. 35 ఏళ్లుగా బాబు - బీసీల సీటు కబ్జా చేశాడు... అదే చంద్రగిరిలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసి పోటీ చేస్తే 1983లోనే ఏకంగా 17 వేల ఓట్లతో ప్రజలు ఓడగొట్టారు. ఆ తర్వాత ఈ పెద్దమనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఇక్కడ, తన ధనబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జా చేసి 35 ఏళ్లుగా రాజ్యం ఏలుతున్నాడు. ఆయన కనీసం ఇక్కడ ఒక ఇల్లయినా కట్టుకున్నాడా? ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కోసం మీతో పని కావాలి. కానీ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఆలోచన కూడా ఏరోజూ రాలేదంటే ఈ మనిషి మీ మీద చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. కుప్పం ప్రజలు చంద్రబాబుకు 35 సంవత్సరాలుగా చాలా ఇచ్చారు. కానీ కుప్పానికి బాబు ఏమిచ్చాడో ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ నిలదీయాల్సిన అవసరం ఉంది. తన సొంత నియోజకవర్గానికే మంచి చేయని ఈ మనిషి ..75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి దిగుతున్నాడు. పొత్తులెందుకు అని అడిగితే మాట్లాడడు. ఈ మనిషి ఏ ప్రాంతానికి మంచి చేసింది లేదు. మీ పేరు చెబితే ఒక్క మంచైనా ఉందా? గుర్తుకు వచ్చే ఒక్క స్కీమైనా ఉందా? అని అడిగితే మాట్లాడడు. ఏ గ్రామం మధ్య అయినా నిలబడి... ఈ గ్రామంలో నా మార్క్ ఫలానా మంచి చేశాను అని చెప్పగలడా అంటే అదీ మాట్లాడడు. సామాజికవర్గాలకు మీరు చేసిన న్యాయం ఏంటని అడిగితే, చివరకు కుప్పంలో కూడా బీసీ ఎమ్మెల్యేను పెట్టని తీరు చూస్తే సామాజిక న్యాయం, సామాజిక మంచి మీరు ఎక్కడ చేశారని అడిగితే అదీ మాట్లాడడు. పేద ఇంటికి వెళ్లి తలుపు తట్టి అడుగుదామా బాబు పేద ఇంటికి వెళ్దాం. తలుపు తట్టి ప్రతి పేద ఇంట్లోనూ అడుగుదాం. 14 ఏళ్లు మీరు చేసిన మంచి ఏంటో ఆ ఇంటికి కనీసం ఒక్క రూపాయి అయినా మీరు ఇచ్చారా అని గట్టిగా నిలదీస్తే అదీ మాట్లాడడు. మరేం మాట్లాడుతాడు అంటే... పొత్తుల గురించి మాట్లాడతాడు. ఎవరితో అంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడతాడంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని మాట్లాడతాడు. బాబు- కాపులకు వర్గశత్రువు. పోనీ కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి? వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా.. అందుకే మిమ్మల్ని వారంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారని అడిగితే దానికి కూడా మాట్లాడడు. ఇదీ బాబు మార్క్ రాజకీయం. చంద్రబాబు మార్క్ రాజకీయం ఇది. వంచన, మోసం, కుట్ర, వెన్నుపోటు. కుప్పం ప్రజలకు కూడా మంచి చేశానని చెప్పే పరిస్థితి లేకపోవడం బాబు మార్క్ రాజకీయం అయితే, కుప్పంలో గత ఎన్నికల్లో బాబుమీద గెలవలేకపోయినా కూడా మీలో ఒకరిని, బలహీనవర్గాల ప్రతినిధిగా భరత్ ను ఎమ్మెల్సీగా చేసి, అతడిని ముందు పెట్టి ఇక్కడి పేద కుటుంబాలన్నింటికీ కూడా చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రతి కుటుంబానికీ మంచి చేయడం మీ జగన్ మార్క్ రాజకీయం అని చెప్పడానికి గర్వపడుతున్నాను. భరత్‌ను, మన బలహీనవర్గాలకు చెందిన నాయకుడిని, మీ వాడిని ప్రతినిధిగా చేసి ఆయన 2019లో గెలవలేకపోయినా ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి ఈ 5 సంవత్సరాల్లో ఇంత మంచి చేశాం. భరత్‌ను ఎమ్మెల్యేగా ఎన్నుకోండి... మంత్రిగా స్ధానం ఇస్తాను. మీ భరత్ ను కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నా కేబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తాను. నా గుండెల్లో పెట్టుకుంటాను. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, సంక్షేమం చేస్తానని మాట ఇస్తున్నాను. ఏ మార్క్ రాజకీయం కావాలి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ప్రజల గురించి, పేద వాడి గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్క్ రాజకీయం కావాలా? లేకపోతే ఎన్నికల్లో మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత గాలికి వదిలేసే చంద్రబాబు చేస్తున్న రాజకీయం కావాలా? 14 సంవత్సరాలు తాను చేసింది ఏంటంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది. ఎన్నికలు వచ్చే సరికే ప్రజల్ని వెన్నుపోటు పొడవడం కోసం, మోసం చేయడం కోసం రంగు,రంగుల మేనిఫెస్టో తెస్తాడు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తానంటాడు. ఏరోజైనా ఏ మంచీ చేయని ఈ వ్యక్తి ప్రతి ఎన్నికలప్పుడు రంగు రంగుల మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఈ వ్యక్తిని నమ్మగలమా? ఆలోచన చేయండి. 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం చూశారు. ప్రతి ఇంటికీ జరిగిన మంచి చూశారు. పేదవాడి భవిష్యత్ కోసం మీ బిడ్డ పడుతున్న తాపత్రయం మీరంతా చూశారు. మీ బిడ్డను మళ్లీ ముఖ్యమంత్రిగా మీరు చేసుకుంటే పేదవాడి బతుకు బాగుపడుతుంది. పేదవాడి భవిష్యత్ బాగుపడుతుంది. మీలో ప్రతి ఒక్కరూ మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ప్రతి విషయం కూడా ఇంకో వంద మందితో చెప్పి ఓటు వేయించే కార్యక్రమానికి అందరూ పూనుకోవాలని విన్నవిస్తున్నాను. దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.