నెల్లూరు: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మనమధ్య లేడన్న మాట నమ్మడానికి మనసుకు కష్టంగానే ఉందని, మంచి స్నేహితుడిని కోల్పోయినందుకు బాధగా ఉందని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులోని గొలగమూడి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ జరిగిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభకు హాజరైన సీఎం వైయస్ జగన్.. తన స్నేహితుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం సంతాప సభలో మాట్లాడారు. గౌతమ్ రోజూ వస్తున్నట్టుగానే అనిపిస్తుందని, ఇక లేడు, రాడు అనే సత్యాన్ని జీర్ణించుకోవడానికి సమయం పడుతుందన్నారు. గౌతమ్‌రెడ్డి లాంటి మంచి వ్యక్తిని పోగొట్టుకున్నందుకు బాధగా ఉందన్నారు. సీఎం వైయస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘‘గౌతమ్ నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. నేను లేకపోతే గౌతమ్ రాజకీయాల్లోకి వచ్చి ఉండేవాడు కాదేమో. అప్పట్లో 2009–10 ప్రాంతాల్లో కాంగ్రెస్ నుంచి నేను బయటకు వచ్చినప్పుడు యుద్ధం మొదలైంది. మేకపాటి రాజమోహన్‌రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. 2009లో నేను ఎంపీగా ఎన్నికయ్యాను. గౌతమ్‌తో ఉన్న సాన్నిహిత్యం రాజమోహన్‌రెడ్డిని కూడా నావైపు ఉండేట్టుగా గౌతమ్ ఒత్తిడి పనిచేసింది. 2009–10 నుంచి సాగిన ఈ ప్రయాణం.. ప్రతి అడుగులోనూ నాకు గౌతమ్ తోడుగా, స్నేహితుడిగా ఉన్నాడు. నాకంటే సంవత్సరం పెద్ద అయినా.. మనసులో ఆ భావన ఉండేది కాదు.. నన్నే అన్నగా భావించేవాడు. మంచి వ్యక్తిని కోల్పోయామని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా. గౌతమ్‌ను రాజకీయాల్లోకి నేనే తీసుకువచ్చాను. మంచి రాజకీయ నేతగా ఎదిగాడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. పరిశ్రమల శాఖ సహా 6 శాఖలకు ప్రాతినిధ్యం వహించి మంచి మంత్రిగా పేరుతెచ్చుకున్నాడు. చివరి క్షణం వరకు రాష్ట్రాభివృద్ధి కోసమే గౌతమ్ శ్రమించాడు. పరిశ్రమలను రాష్ట్రంలోకి తీసుకురావాలని, మన ప్రభుత్వానికి, నాకు మంచిపేరు వస్తుందని తాపత్రయపడ్డాడు. చివరిక్షణాల్లో దుబాయ్‌కి వెళ్లేముందు కలిశాడు. వెళ్లివచ్చిన తరువాత అక్కడ జరిగిన పరిణామాల మీద కలిసేందుకు సమయం అడిగాడు. అంతలోనే దురదృష్టకర వార్త వినాల్సి వచ్చింది. మంచి మంత్రిగా, ఎమ్మెల్యే, స్నేహితుడిగా అన్ని రకాలుగా మంచి వ్యక్తిని కోల్పోయామని జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది. ఆ కుటుంబానికి నేనే కాదు.. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం తోడుగా ఉంటుంది. కచ్చితంగా ఆ కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలని, మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఎంత మాట్లాడినా గౌతమ్ లోటును భర్తీ చేయలేం. గౌతమ్ అందరి మనసుల్లో చిరస్థాయిలో నిలిచిపోయి ఉంటాడు. మెరిట్స్ కాలేజీని అగ్రికల్చర్, హార్టికల్చర్ యూనివర్సిటీగా చేయాలని, అభివృద్ధి విషయాల్లో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్–2లో ఉన్న ఉదయగిరి, బద్వేలు ప్రాంతాన్ని ఫేజ్–1లోకి తీసుకువచ్చి ఆత్మకూరు, ఉదయగిరికి మంచి చేయాలని, గౌతమ్‌పేరు చిరస్థాయిగా నిలబడుతుందని మేకపాటి రాజమోహన్‌రెడ్డి అడిగారు. ఇవన్నీ కచ్చితంగా జరుగుతాయి. సంగం బ్యారేజీ మే 15లోపు పనులు పూర్తవుతాయని ఇరిగేషన్ మంత్రి అనిల్ చెబుతున్నారు. మంచిరోజు చూసుకొని నెల్లూరు వచ్చి మేకపాటి కుటుంబంతో సంగం ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తా. గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థం సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజీ అని నామకరణం చేస్తాం. గౌతమ్ కుటుంబానికి నాతో సహా పార్టీలోని ప్రతి వ్యక్తి అండగా ఉంటారని, ఆ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.