సీఎం ఆదేశాలతో స్టైరెన్‌ తరలింపు ప్రారంభం

ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో సాధారణ పరిస్థితి ఉందన్న కలెక్టర్‌

ఏపీలోని మిగతా పరిశ్రమల్లో తనిఖీలు చేయాలని సీఎం ఆదేశం

తాడేపల్లి:ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో నిల్వ ఉన్న స్టైరెన్‌ను ఇతర ప్రాంతాలకు తరలించే కార్యక్రమం ప్రారంభమైందని కలెక్టర్‌ విజయ్‌ చంద్‌ పేర్కొన్నారు. సోమవారం సీఎం వైయస్‌ జగన్‌ మంత్రులు, అధికారులతో గ్యాస్‌ లీక్‌ ఘటన, సహాయక చర్యలపై క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితిని కలెక్టర్‌ సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. స్టైరెన్‌ తరలింపు కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో సాధారణ పరిస్థితి ఉందని తెలిపారు.ట్యాంకుల్లోని స్టైరెన్‌ కూడా దాదాపు వంద శాతం పాలిమరైజ్‌ అయ్యిందని వివరించారు.ఇంకో ఐదు ట్యాంకుల్లో 13 వేల టన్నుల స్టైరెన్‌ ఉందని, దాన్ని కొరియాకు తరలిస్తున్నామని వెల్లడించారు. 

కేంద్రం వేసిన కమిటీల అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకోండి
గ్యాస్‌ లీకేజీ ఘటనపై కేంద్రం వేసిన కమిటీ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ కలెక్టర్‌కు, మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు.స్టైరెన్‌ ఇతర ప్రాంతాలకు తరలించే అంశంపైనా చూడాలన్నారు. ప్రోటోకాల్‌ తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆదేశించారు. అదే సమయంలో ప్రమాదకర పరిశ్రమలను గుర్తించాలని, విశాఖ కాకుండా ఏపీలోని మిగతా పరిశ్రమల్లో తనిఖీలు చేయాలన్నారు. పరిశ్రమలపై ఒక ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. శానిటేషన్‌ కార్యక్రమం ముగిసిన వెంటనే మంత్రులంతా ఐదు గ్రామాల్లో ఈ రాత్రి బస చేయాలన్నారు. గ్రామాల్లోకి వచ్చిన వారికి భోజనాలు ఏర్పాటు చేయాలన్నారు.

ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు ఇవ్వండి
గ్యాస్‌ లీకేజీ ఘటనతో ఇబ్బంది పడిన ఐదు గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌  ఆదేశించారు. చిన్నారులు సహా అందరికీ రూ.10 అందేలా చూడాలన్నారు.ఇంటి అక్కచెల్లెమ్మల ఖాతాల్లో  ఈ డబ్బు బ్యాంకులు జమ చేసుకోలేని విధంగా అన్‌ ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లో వేయాలని సూచించారు. రేపు ఉదయం వాలంటీర్లతో బ్యాంకు ఖాతాలు సేకరించాలన్నారు. పారదర్శకంగా, ఫిర్యాదులు లేకుండా ఆర్థిక సహాయం కార్యక్రమం సాగాలన్నారు.ఆర్థికసాయం పొందే వారి జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాలన్నారు. ఎవరి పేరైనా బాధితుల జాబితాలో కనిపించకపోతే వారు ఎలా నమోదు చేసుకోవాలో వారి వివరాలను అందులో ఉంచాలన్నారు. బాధిత గ్రామాల ప్రజలకు ఆర్థిక సహాయం మూడు రోజుల్లో పూర్తి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. డబ్బు బ్యాంకు ఖాతాలో జమ అయిన తరువాత వాలంటీర్లు స్లిప్‌ అందించి వారి నుంచి రశీదు తీసుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. ఆసుపత్రి పాలైన వారికి కూడా వీలైనంత త్వరగా ఆర్థిక సహాయం అందించాలని , ఈ ఐదు గ్రామాల్లో ప్రజలకు వైద్యపరమైన సేవల కోసం క్లినిక్‌ ఏర్పాటు చేయాలని, ఆంధ్రా మెడికల్‌ కాలేజీ వైద్య బృందాన్ని నియమించాలని సీఎం వైయస్‌ జగన్‌ కలెక్టర్‌ను ఆదేశించారు.

Back to Top