కడప : జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు.. ఆరోగ్య సమాజం కోసం ఎంతో మంది వైద్యులను అందిస్తున్న రిమ్స్.. మెడికల్ హబ్ గా రాయలసీమకే తలమానికంగా మారిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసించారు. శనివారం కడప రిమ్స్ ప్రాంగణంలో అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మించిన డా.వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డా. వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, డా.వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ సెంటర్ లతో పాటు రిమ్స్ సమీపంలోని డా.వైయస్ రాజశేఖరరెడ్డి క్యాంపస్ లో నూతనంగా నిర్మించిన ఎల్.వి. ప్రసాద్ ఐ హాస్పిటల్ భవనాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వరుసగా వేర్వేరుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో.. ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇంఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, APMSIDC ఎండి మురళీధర్, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, కడప నగర మేయర్ కె.సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రా రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి, జేసీ గణేష్ కుమార్, కడప నగర కమీషనర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రిమ్స్ ఆసుపత్రి.. కేవలం జిల్లా ప్రజలకు మాత్రమే కాకుండా రాయలసీమ స్థాయిలో కూడా ప్రజలకు అత్యుత్తమ, మెరుగైన వైద్య సేవలు అందిస్తోందన్నారు. సువిశాలమైన, ఆహ్లాదకరమైన వాతావరణంతో మెరుగైన వైద్యసేవలతో వేలాది మంది ప్రజలకు ప్రతి నిత్యం ప్రాణ రక్షణ కల్పిస్తూ సంజీవనిగా సేవాలందిస్తోందన్నారు. రిమ్స్ భోధనాసుపత్రి ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించే క్రమంలో కోట్లాది రూపాయలను వెచ్చించి.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కేన్సర్ రీసెర్చ్ ఆసుపత్రి, మానసిక వైద్యశాల, ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్యశాలలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. రాయలసీమలోనే అత్యాధునిక వైద్య సేవలు అందించే మెడికల్ హబ్ గా రిమ్స్ అనుబంధ ఆసుపత్రుల్లో సేవలు విస్తృతం కానున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసిందన్నారు. వైద్య విభాగాధిపతులు కేవలం వైద్యం వరకే పరిమితం కాకుండా.. ఆయా విభాగాల్లో పరికరాల నిర్వహణ, యాజమాన్యంపై ప్రత్యేక దృష్టి సారించి వైద్యరంగం పటిష్టత కోసం కృషి చేయాలని కోరారు. డాక్టర్ వైయస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాష్ట్ర ప్రభుత్వం APMSIDC ద్వారా రిమ్స్ ప్రాంగణంలో 452 పడకల సామర్థ్యంతో జి+4 అంతస్థులతో ఏ, బి, సి, డి & ఈ బ్లాకులుగా డా. వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. 2,38,062.46 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆసుపత్రి కోసం.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 125 కోట్లను వెచ్చించింది. అందులో రూ.75 కోట్లు నిర్మాణ పనులకు గాను, రూ.50 కోట్లు వైద్య పరికరాల కోసం ఖర్చు చేయడం జరిగింది. ఇందులో కార్డియాలజీ, న్యూరాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, కార్డియో థొరాసిక్ & వాస్కులర్ సర్జరీ, న్యూరో సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ మొదలైన 10 సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి వైద్య సేవలు అందనున్నాయి. ఇందులో సాధారణ వార్డులో (పురుషులు & స్త్రీలు) 300 పడకలు, పేషెంట్ కేర్ యూనిట్లు, 100 పడకలు ICUS, 12 పడకల క్యాజువాలిటీ, 40 పడకలు ఇతరులకు కేటాయించారు. అంతేకాకుండా 12 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, అన్ని సూపర్ స్పెషాలిటీలకు అనువైన సెంట్రల్ లాబొరేటరీ, రేడియాలజీ విభాగం, CSSD, సెంట్రల్ ఫార్మసీ, అధునాతన క్యాథ్ ల్యాబ్, అధునాతన బ్లడ్ బ్యాంక్, అధునాతన CT & MRI స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. డా. వైయస్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ మానసిక రోగులకు అత్యుత్తమ ఉపశమనం కలిగించేలా.. నిపుణులైన మానసిక వైద్యులచే వైద్యం, కౌన్సిలింగ్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వైద్య సదుపాయాలతో.. రిమ్స్ ప్రాంగణంలో 100 పడకల మానసిక వైద్యశాలను రూ.40 కోట్లు వెచ్చించి నిర్మించింది. 97,844 చదరపు అడుగుల విస్తీర్ణంలో APMSIDC ద్వారా జి+1 అంతస్తుతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 23 మంది వైద్యులు, 27 మంది నర్సింగ్ స్టాఫ్, 29 మంది పారామెడికల్ స్టాఫ్, 37 మంది ఇతర సహాయక సిబ్బంది కలిపి మొత్తం 116 సిబ్బందితో మానసిక రోగులకు వైద్య సేవలు అందనున్నాయి. ఇందులో ప్రతిరోజు OP సేవలతో పాటు.. డెడిక్షన్ సెంటర్, BPAD క్లినిక్, స్కిజోఫ్రెనియా క్లినిక్, సేవలతో IP సేవలు. అందుబాటులో ఉన్నాయి. జెరియాట్రిక్ క్లినిక్, చైల్డ్ గైడెన్స్ క్లినిక్, ECT, సైకోథెరపీ, ఫార్మాకో థెరపీ, RTMS థెరపీ, పేషెంట్ కేర్ యూనిట్లు అందుబాటులో వున్నాయి. ఇందులో 90 పడకల (పురుషులు - 30 పడకలు & స్త్రీలు 30 పడకలు, డెడిక్షన్ సెంటర్ - 30 పడకలు) సాధారణ వార్డులు, 5 పడకల క్యాజువాలిటీ, 5 పడకల ECT పోస్ట్ ఆపరేటివ్ వార్డు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ వై.యస్.ఆర్. క్యాన్సర్ కేర్ సెంటర్ క్యాన్సర్ బాధిత రోగులకు అధునాతన వైద్యసేవలతో సరికొత్త జీవితాన్నందించే దిశగా.. రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వైద్య సదుపాయాలతో.. రిమ్స్ ప్రాంగణంలో 100 పడకల క్యాన్సర్ కేర్ సెంటర్ ను రూ.107 కోట్లు వెచ్చించి నిర్మించింది. 1,58,295 చదరపు అడుగుల విస్తీర్ణంలో APMSIDC ద్వారా జి+2 అంతస్తుతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 33 మంది వైద్యులు, 36 మంది నర్సింగ్ స్టాఫ్, 69 మంది పారామెడికల్ స్టాఫ్, 10 మంది ఇతర సహాయక సిబ్బంది కలిపి మొత్తం 148 సిబ్బందితో క్యాన్సర్ బాధిత రోగులకు వైద్య సేవలు అందనున్నాయి. ఇందులో మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాల ద్వారా వైద్య సేవలు అందనున్నాయి. ఇందులో 96 పడకల సాధారణ వార్డు, ఐసియు, క్యాజువాలిటీ, 4 పడకల మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ వార్డు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అధునాతన పరికరాలతో లీనియర్ యాక్సిలరేటర్, డే కేర్ ఫెసిలిటీ, పెయిన్ & పాలియేటివ్ కేర్, పునరావాస సేవలు, లేబొరేటరీ & రేడియాలజీ సేవలు, బ్లడ్ బ్యాంక్ యూనిట్లు అందుబాటులో వున్నాయి. ఎల్. వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి సమాజంలోని అన్ని వర్గాలకు సమానమైన, సమర్థవంతమైన కంటి సంరక్షణను అందించడమే లక్ష్యంగా ఎల్. వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి సేవాలందిస్తోంది. గత 36 సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు కర్నాటక రాష్ట్రాల్లో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, మూడు తృతీయ స్థాయి సంరక్షణ సౌకర్యాలు, 26 సెకండరీ స్థాయి కంటి సంరక్షణ కేంద్రాలు, 259 ప్రాథమిక కంటి సంరక్షణ కేంద్రాలతో 288 స్థానాలకు విస్తరించింది. హైదరాబాద్‌లో ఉన్న దాని ప్రధాన క్యాంపస్‌తో సమగ్ర కంటి ఆరోగ్య సౌకర్యం. అంధత్వ నివారణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో నడుస్తున్న ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్.. భారతదేశంలోనే అత్యంత ప్రఖ్యాతి గాంచిన నేత్ర ఆరోగ్య కేంద్రం. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నిర్వహింపబడుతున్న ఈ నేత్ర ఆరోగ్య సంస్థ.. కంటి రోగులకు సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ, దృష్టి మెరుగుదల, పునరావాస సేవలు, అత్యంత ప్రభావితమైన గ్రామీణ కంటి ఆరోగ్య కార్యక్రమాలను అందిస్తుంది. అంతేకాకుండా అత్యాధునిక కంటి పరిశోధనలను కొనసాగిస్తూ.. అన్ని స్థాయిల నేత్ర సిబ్బందికి శిక్షణను కుడా అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 20 జిల్లాల్లో రెండు తృతీయ నేత్ర సంరక్షణ సౌకర్యాలు, 9 ద్వితీయ స్థాయి కంటి సంరక్షణ సౌకర్యాలు, 139 ప్రాథమిక కంటి సంరక్షణ సౌకర్యాలతో ఎల్‌వి ప్రసాద్ 150 స్థానాల్లో నిర్వహణలో ఉన్నారు. జిల్లాలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాంపస్ లో ఏర్పాటైన.. ఎల్‌వి ప్రసాద్ నేత్ర ఆసుపత్రి.. టెరిటరీ నెట్‌వర్క్‌లో 4వ తృతీయ నేత్ర సంరక్షణ కేంద్రం. ఆంధ్ర రాష్ట్రంలో మూడవది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఇతర దాతృత్వ ఫౌండేషన్ల మద్దతుతో అభివృద్ధి చేయబడింది. మొత్తం 66,600 చ.అ.ల విస్తీర్ణంలో 40 పరీక్షా గదులు, 4 ఆధునిక ఆపరేషన్ గదులతో నిర్మితమైంది. వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేక కంటి సంరక్షణ సేవల యూనిట్ మరియు అన్ని ఇతర ప్రత్యేక నేత్ర సంరక్షణ సేవలతో పాటు దృష్టి మెరుగుదల సేవలను అందిస్తుంది. రోజుకు సుమారు 400 లకు పైగా ఔట్ పేషెంట్లను పరీక్షలు, రోజుకు 60 కి పైగా శస్త్రచికిత్సలు నిర్వహించే సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని నిర్మించడం జరిగింది.