తాడేపల్లి: మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సన్నద్ధమయ్యారు. అనంతపురం జిల్లాలో మూడు రిజర్వాయర్లకు ఈనెల 9న (రేపు) సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా మూడు రిజర్వాయర్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి చొరవతో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్లు నిర్మాణం కానున్నాయి. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లిలో పైలాన్ ఏర్పాటు చేయనున్నారు. హింద్రీనీవా నుంచి పేరూరు డ్యామ్‌కు నీటి తరలింపుపై గత ప్రభుత్వం రూ.803 కోట్ల రూపాయలతో అంచనాలను రూపొందించింది. అదే డబ్బుతో నేడు నాలుగు రిజర్వాయర్లు, ప్రత్యేక కాల్వ ద్వారా పేరూరు డ్యామ్‌కు నీరు తరలించనున్నారు. తాజా ప్రతిపాదన ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.300 కోట్లు ఆదా కానుంది. రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. అదే విధంగా ఏడు మండలాల్లోని 35 గ్రామాలకు లబ్ధి చేకూరనుంది.