నర్సీపట్నం రూపురేఖలు మారబోతున్నాయి

జ‌గినాథునిపాలెం బ‌హిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌

రూ.500 కోట్లతో మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం

రూ.470 కోట్లతో తాండవ–ఏలేరు ఎత్తిపోతల పథకం, కాల్వల అనుసంధానికి శంకుస్థాపన చేశాం

రూ.20 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణ, అభివృద్ధికి అడుగులు వేశాం

వైద్యం అందక ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఘటనలతో ఈ ప్రాంతం తల్లడిల్లింది

అయినా గత పాలకులు పట్టించుకున్న పాపానపోలేదు

మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తున్నాం

వచ్చే నెలలో ఇదే ప్రాంతంలో ట్రైబల్‌ యూనివర్సిటీ కూడా తీసుకువస్తాం

తాండవ–ఏలేరు రిజర్వాయర్ల కాల్వల అనుసంధానం పూర్తయిపోతే.. రెండు జిల్లాల్లోని రైతుల ముఖాల్లో చిరునవ్వులు

అనకాపల్లి: ఏజెన్సీ ప్రాంతానికి గేట్‌వేగా ఉన్న నర్సీపట్నంలో దాదాపుగా రూ.986 కోట్లకు సంబంధించి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పడానికి సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సమస్యలపై దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం.. ఎవ్వరూ పట్టించుకున్న పాపానపోలేదని, మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన మూడున్నర సంవత్సరాల్లోనే మెడికల్‌ కాలేజీ నిర్మాణం, తాండవ – ఏలేరు రిజర్వాయర్ల కాల్వల అనుసంధానం, నర్సీపట్నంలో రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులకు శ్రీకారం చుట్టామన్నారు.

నర్సీపట్నంలో రూ.500 కోట్ల వ్యయంతో మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు, రూ. 470 కోట్లతో తాండవ–ఏలేరు ఎత్తిపోతల పథకం, కాల్వల అనుసంధాన ప్రాజెక్టు, రూ.20 కోట్లతో నర్సీపట్నం ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం జోగినాథునిపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తున్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ముందుగా మీ ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజున నర్సీపట్నంలో ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. నర్సీపట్నంలో దాదాపుగా రూ.986 కోట్లకు సంబంధించి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పడానికి సంతోషంగా ఉంది. నర్సీపట్నం అంటే ఏజెన్సీ ప్రాంతానికి గేట్‌వే. ఇలాంటి నర్సీపట్నంలో గత పాలకుల వల్ల ఎలాంటి అభివృద్ధి జరగని పరిస్థితి చూశాం. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే రెండు గంటలు ప్రయాణం చేసి విశాఖపట్నం చేరుకుంటే కానీ, ఆరోగ్యానికి మంచి వైద్యం అందని పరిస్థితిలో ఈ ప్రాంతంలో ఎన్నో దశాబ్దాలుగా తల్లడిల్లుతోంది. ఏ ఒక్కరూ పట్టించుకున్న పరిస్థితులు లేవు. అలాంటిది ఈరోజున మనం చేయబోయే ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతాన్ని, రూపురేఖలు మార్చబోతున్నాయి. నర్సీపట్నంలో రూ.500 కోట్లతో మెడికల్‌ కాలేజీని నిర్మించడం కోసం అడుగులు ముందుకువేస్తున్నాం. వెనుకబడిన ప్రాంతం.. ఇక్కడ కూడా అత్యుత్తమ సేవలు అందించే విధంగా విద్యాపరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ధృడమైన సంకల్పంతో మెడికల్‌ కాలేజీకి పునాదులు పడుతున్నాయి. దాదాపుగా 150 మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి. మన పిల్లలు ఇక్కడే డాక్టర్‌ చదవొచ్చు. ఈ ప్రాంతానికి ఎంత మంచి జరుగుతుందో ఒక్కసారి గమనించాలి. 

మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీని వల్ల చాలా మంది నా చెల్లెమ్మలు మంచి నర్సులుగా ఎదిగే మంచి అవకాశం కూడా జరుగుతుంది. ఒక్కసారి గమనించండి.. ఈరోజు ఏ రకంగా మన ప్రాంతాలు అన్నీ కూడా మార్పు చెందుతున్నాయి. ఉత్తరాంధ్ర చూసుకుంటే.. ఏరకంగా  మార్పు జరుగుతుందో గమనించాలని కోరుతున్నా.. నర్సీపట్నంలో ఒక మెడికల్‌ కాలేజీ, పార్వతీపురంలో మరొకటి, పాడేరులో ఇంకొకటి, విజయనగరంలో మరో మెడికల్‌ కాలేజీ.. ఇవన్నీ కేవలం మూడున్నర సంవత్సరాల కాలంలో మీ బిడ్డ ముఖ్యమంత్రిగా అయిన తరువాతే అడుగులు పడుతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నా. 

ఈ ప్రాంతంలోనే ఒక ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ, వచ్చే నెలలో ఇదే ప్రాంతంలో ట్రైబల్‌ యూనివర్సిటీ కూడా తీసుకువచ్చే గొప్ప అడుగు కూడా పడుతుంది. మార్పు ఏ రకంగా జరుగుతుందో చూపించడానికి ఇవన్నీ నిదర్శనాలు. 

ఈ రోజు మనం పునాదులు వేసిన మెడికల్‌ కాలేజీ ఒక్కటే కాదు. ఈ ప్రాంతంలో సాగునీటి వసతి కూడా మెరుగుపర్చడంపై మీ జగనన్న ప్రభుత్వం దృష్టిపెట్టింది. తాండవ రిజర్వాయర్‌ కింద అక్షరాల 51,465 ఎకరాల ఆయకట్టును పూర్తిగా స్థిరీకరించడంతో పాటు ఏలేరు ఎడమ ప్రధాన కాల్వ కింద కొత్తగా మరో లిఫ్ట్‌ ఏర్పాటు చేసి తద్వారా మరో 5,600 ఎకరాలకు కూడా నీరు అందించే గొప్ప కార్యక్రమం ఈరోజు జరగబోతుంది. 

ఏలేరు రిజర్వాయర్, తాండవ రిజర్వాయర్‌ను అనుసంధానం చేస్తున్న కాల్వ అభివృద్ధికి మరో ఆరు లిఫ్ట్‌లు తద్వారా పెట్టడంతో దాదాపుగా రూ.470 కోట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టుకు టెండర్ల ప్రక్రియ అంతా పూర్తయిపోయింది. నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు, తుని మండలాలకు, అదే విధంగా అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం, నాతవరం, కోటవరెట్ల మండలాలకు మేలు జరుగుతుందని చెప్పడానికి మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రాజెక్టుకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. అగ్రిమెంట్ల మీద సంతకాలు కూడా అయిపోయాయి. పనులు శరవేగంగా మొదలవ్వడానికి సర్వే కూడా పూర్తికావొచ్చిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

ఇదే నర్సీపట్నం మున్సిపాలిటీలో దాదాపుగా రూ.20 కోట్లతో ప్రధాన రహదారిని విస్తరించడంతో పాటు మరో రహదారిని కూడా అభివృద్ధి చేస్తూ.. సెంట్రల్‌ లైటింగ్, గ్రీనరీ సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఒకసారి ఆలోచన చేయండి.. ఒకవైపున మెడికల్‌ కాలేజీ, టీచింగ్‌ హాస్పిటల్, నర్సింగ్‌ కాలేజీ, పట్టణంలో ప్రధాన రహదారులన్నీ విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తవుతే.. నర్సీపట్నం రూపురేఖలు ఏరకంగా మారబోతున్నాయని ఆలోచన చేయాలని కోరుతున్నా.. 

తాండవ–ఏలేరు రిజర్వాయర్ల కాల్వల అనుసంధానం కూడా పూర్తయిపోతే.. ఆయకట్టు స్థిరీకరణ, విస్తరణ కూడా గణనీయంగా పెరిగి.. రెండు జిల్లాల్లోని రైతుల ముఖాల్లో చిరునవ్వులు ఏ విధంగా కనిపిస్తాయనేది ఆలోచన చేయాలని కోరుతున్నాను. 

ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే.. కారణం ఇవన్నీ దశాబ్దాలుగా అడుగుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకున్న పరిస్థితులు లేవు. నా పాదయాత్రలో నేను చూశా.. ఎవరికైనా బాగోలేకపోతే విశాఖపట్నం వెళ్లాలంటే కనీసం రెండు, మూడు గంటలు పట్టే పరిస్థితి. ఈలోగా ప్రాణాలు గాల్లో కలిసే పరిస్థితుల్లో ఇక్కడి ప్రాంత ప్రజలు సతమతమవుతున్నా గత పాలనలో పాలకులు ఏ రోజూ పట్టించుకున్న పాపాన పోలేదు. కళ్లెదుటనే తాండవ రిజర్వాయర్‌ పరిస్థితులు కనిపిస్తున్నా కూడా ఏ ఒక్కరూ ధ్యాసపెట్టలేదు. ఇవన్నీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తరువాత మూడున్నర సంవత్సరాల కాలంలో వేగంగా అడుగులు పడుతున్నాయని చెప్పడానికి గర్వపడుతున్నాను’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 
 

Back to Top