నేడు గ్యాస్‌ ప్రభావిత గ్రామాల ప్రజలకు పరిహారం

  సీఎం వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ప్రారంభం

ఒక్కొక్కరికీ రూ.10 వేలు 

తాడేపల్లి: ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ బాధితులకు ఇచ్చిన హామీని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నెరవేర్చారు.  గ్యాస్‌ లీకేజీ ప్రభావిత గ్రామాల ప్రజలకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించిన పరిహారం ఇవాళ అందజేయనున్నారు. ఇప్పటికే గ్రామాలు, కాలనీల్లో ఎన్యూమరేషన్‌ పూర్తి చేసి అర్హుల జాబితా వార్డు సచివాలయాల్లో ఉంచారు. ప్రతి ఒక్కరి ఆధార్‌ నంబర్‌తోపాటు ఇంటి యజమాని లేదా కుటుంబ సభ్యుడి బ్యాంక్‌ ఖాతా వివరాలను వలంటీర్లు సేకరించారు. దీని ప్రకారం పరిహారం బ్యాంకు ఖాతాలో డబ్బు జమ కానుంది. క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ బటన్‌ నొక్కగానే పరిహారం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి.  గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు, ఆసుపత్రుల్లో చికిత్స పొందినవారికి ప్రభుత్వం ఇప్పటికే పరిహారం అందచేయగా కంపెనీ పరిసరాల్లోని ఐదు ప్రభావిత గ్రామాలు, ఎనిమిది కాలనీల్లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున చెల్లిస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రకటించారు. ఆ మేరకు సోమవారం వారి బ్యాంకు ఖాతాల్లో రూ.20 కోట్ల మేర పరిహారాన్ని జమ చేయనున్నారు.

► 12 మంది మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబీకుల బ్యాంకు ఖాతాల్లో పరిహారాన్ని ఇప్పటికే జమ చేశారు. 
► తీవ్ర అస్వస్థతతో కేజీహెచ్‌లో మూడు రోజులకు పైగా చికిత్స పొందిన 319 మందికి, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఉన్న 166 మందికి రూ.లక్ష చొప్పున పరిహారం అందజేశారు. వెంటిలేటర్‌పై ఉన్న ఒకరికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించారు.
► అస్వస్థతతో సీహెచ్‌సీల్లో చికిత్స పొందిన 94 మందికి, కేజీహెచ్‌లో చికిత్స పొంది డిశ్చార్జి అయిన మరో ఐదుగురికి రూ.25 వేలు చొప్పున చెక్కులు అందజేశారు.  
► స్టైరీన్‌ ప్రభావిత ఐదు గ్రామాలు, పరిసర ఎనిమిది కాలనీల్లో  ప్రతి ఒక్కరికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామన్న సీఎం హామీ మేరకు అధికారులు తాజాగా ఎన్యూమరేషన్‌ పూర్తి చేశారు. ఈ ప్రాంతంలో 6,297 ఇళ్లు ఉండగా 20,554 మంది నివాసం ఉంటున్నారు. వారికి పరిహారంగా ప్రభుత్వం రూ.20.55 కోట్లు (రూ.20,55,40,000) మంజూరు చేసింది. 
 

Back to Top