అమరావతి: ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకే వైయస్ఆర్ చేయూత పథకాన్ని తెచ్చామని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా సభను తప్పుదారి పట్టిస్తున్నారని, టీడీపీ సభ్యుడు రామానాయుడు వ్యాఖ్యలపై సీఎం వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామానాయుడికి సభలో మాట్లాడే అర్హత లేదని పేర్కొన్నారు. రామానాయుడు డ్రామా నాయుడిగా మారారు. రామానాయుడిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. గతేడాది ఇదే సభలో అచ్చెన్నాయుడు అలాగే మాట్లాడితే ఇది తప్పు అని చూపించాం. మోసం చేయకండి, సభను తప్పుదోవ పట్టించకండి అని ప్రతిపక్షానికి సూచించాం. తప్పుదారి పట్టించే వ్యక్తులను ఉపేక్షిస్తే వాస్తవాలు మరుగునపడుతాయి. సభకు గౌరవం, మర్యాద ఉండదు. అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడే వ్యక్తులను ఉపేక్షించకూడదు. రాజకీయంగా లబ్ధి పొందాలని కావాలని అబద్ధాలు చెప్పే వ్యక్తులను వదలకూడదు.సెప్టెంబర్ 3,2018న నా పాదయాత్రలో రకరకాల ప్రజల సమస్యలు వింటూ అడుగులు ముందుకు వేశాను. చంద్రబాబు మాదిరిగా 600 పేజీల మేనిఫెస్టో మేం ఇవ్వం. మా మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీత అంటూ రెండే పేజీల మేనిఫెస్టోను రూపొందించాం. అదే మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్లాం. ప్రజల వద్ద నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా స్కీమ్‌ను మార్పు చేస్తూ ..దాన్నే మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తున్నాం. 45 ఏళ్లకు పింఛన్ ఇవ్వాలని ఆ రోజు చెబితే వెటకారం చేశారు. ఆ సూచన కూడా పరిగణలోకి తీసుకొని వైయస్ఆర్ చేయూత అనే పథకానికి నాందీ పలికాం. ఈ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తాం. ఈ కార్పొరేషన్లను ప్రక్షాళన చేస్తామని ఆ రోజు చెప్పాను. 45 ఏళ్లు నిండిన మహిళలకు రూ.75 వేలు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చాను. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నాం. వచ్చే జులై నుంచి రూ.2500 పింఛన్ అందిస్తాం. తప్పు ఎక్కడ జరిగినా చర్యలు తీసుకుంటాం. రామానాయుడి తప్పుడు మాటలను ఉపేక్షించవద్దు.