అమరావతి: నాలుగేళ్లగా చెప్పినవన్నీ నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ 2023–24 ఏం చెబుతుందంటే.. ప్రభుత్వం తరపున మనం ఏదైతే ప్రజలకు మాటిచ్చామో.. ఏ మేనిఫెస్టో అయితే రిలీజ్ చేసి దాన్ని ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి చెప్పామో అలా చెప్పిన ప్రతీహామీని గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి బడ్జెట్‌లోనూ దానికి డబ్బులు కేటాయిస్తూ.. ప్రతి అడుగులోనూ ఆ పనులు పూర్తి చేస్తూ వచ్చాం. ఈ రాష్ట్ర బడ్జెట్ 2023–24 కు సంబంధించి మన ఫిలాసపీని కొనసాగిస్తూ.. మనం చెప్పిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తూ అడుగులు ముందుకువేస్తున్నాం. ఈ ఒక్క బడ్జెట్‌లో మాత్రమే కాకుండా ఇంతకముందు ప్రవేశపెట్టిన నాలుగు బడ్జెట్‌లలో కూడా ఇదే మానవత్వం కనిపిస్తోంది. అక్కచెల్లెమ్మలు - రైతన్నల పక్షపాత బడ్జెట్.... మనం ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్, నాలుగేళ్లుగా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లు ఏది చూసినా ఇవి మన అక్కచెల్లెమ్మల పక్షపాతబడ్జెట్‌లు. ఇవి మన రైతన్నల పక్షపాత బడ్జెట్‌లు. ఇవి మన గ్రామ స్వరాజ్య బడ్జెట్‌లు. ఇవి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సామాజిక న్యాయ బడ్జెట్‌లు. ప్రతియేటా బడ్జెట్‌తోపాటు ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏ స్కీం డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తున్నామో అన్న సంక్షేమ కేలండర్‌ను కూడా మనం ఒక ఆనవాయితీగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత విడుదల చేస్తున్నాం. నాలుగు సంవత్సరాలుగా అదే చేస్తున్నాం. దేవుడి దయ వలన మనం ఏ నెలలో ఏకార్యక్రమం చేస్తామని సంక్షేమ కేలండర్ రిలీజ్ చేస్తామో.. ఆ మేరకు పెద్ద వ్యత్యాసం లేకుండా ఒక నెల అటూ ఇటుగా ఆ పథకం అమలు చేస్తున్నాం. ఆమ్మఒడి, ఆసరా, చేయూత ఇలా ప్రతి స్కీం ఏ డబ్బు, ఏ సమయానికి లబ్దిదారులకు అందుతుందో వివరిస్తూ.. ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్న సంక్షేమ కేలండర్‌ను ఈ సంవత్సరం కూడా విడుదల చేస్తున్నాం. సంక్షేమ కేలండర్... ఏఫ్రిల్‌లో జగనన్న వసతి దీవెన, వైయస్సార్ ఆసరా ఇస్తున్నాం. రేపటి నుంచి వైయస్సార్ ఆసరా మొదలుపెడుతున్నాం. పదిరోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. వైయస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ఇదే నెలలో అమలు చేస్తాం. మే నెలలో వైయస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ కార్యక్రమం జరుగుతుంది. ఇదే నెలలో ఉచిత పంటల బీమా కార్యక్రమం కూడా జరుగుతుంది. జగనన్న విద్యాదీవెన తొలివిడత కూడా ఇదే నెలలో ఉంటుంది. వైయస్సార్ కళ్యాణమస్తు తొలిదశ, వైయస్సార్ మత్స్యకార భరోసా కూడా మేనెలలోనే ఉంటాయి. జూన్ నెలలో స్కూళ్లు తెరిచిన వెంటనే జగనన్న విద్యా కానుక కార్యక్రమం ఉంటుంది. జగనన్న అమ్మఒడి కూడా జూన్‌లోనే ఉంటుంది. వైయస్సార్ లా నేస్తం తొలిదశ కూడా ఇదే నెలలో ఉంటుంది. అదే విధంగా సంవత్సరానికి రెండు దఫాలుగా వివిధ కార్యక్రమాల్లో, పథకాల్లో మిగిలిన పోయిన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే, వారిని రీ వెరిఫై చేసి అందించే కార్యక్రమం కూడా జూన్‌లోనే ఉంటుంది. జూలైలో జగనన్న విదేశీ దీవెన మొదటిదశ ఉంటుంది. ఇదే నెలలో వైయస్సార్ నేతన్ననేస్తం, అదే విధంగా ఎంఎస్‌ఎంఈ ఇన్సెంటివ్‌లు అందించే కార్యక్రమం కూడా ఉంటుంది. జూలైలోనే జగనన్న తోడు తొలిదశ కార్యక్రమం, వైయస్సార్ సున్నావడ్డీ కార్యక్రమం, వైయస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమం రెండో విడత కూడా జూలై నెలలో ఉంటుంది. ఆగష్టులో జగనన్న విద్యాదీవెన రెండో దశ కార్యక్రమం, వైయస్సార్ కాపునేస్తం, వైయస్సార్ వాహనమిత్ర ఉంటాయి. సెప్టెంబరులో వైయస్సార్ చేయూత, అక్టోబరులో వైయస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ రెండో విడత, జగనన్న వసతి దీవెన తొలిదశ కార్యక్రమం ఉంటుంది. నవంబరులో వైయస్సార్ సున్నావడ్డీ పంట రుణాలకు సంబంధించిన కార్యక్రమంతోపాటు, వైయస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా మూడో విడత, జగనన్న విద్యాదీవెన మూడోదశ కూడా ఇదే నెలలో జరుగుతుంది. డిసెంబరులో జగనన్న విదేశీ విద్యాదీవెనకు సంబంధించి రెండో ఇన్‌స్టాల్‌మెంట్ కూడా ఉంటుంది. ఇదే నెలలో రజకులు, టైలర్లు, నాయీ బ్రాహ్మణులకు సంబంధించి జగనన్న చేదోడుతో పాటు, జూన్ నుండి డిసెంబరు వరకు వివిధ పథకాలలో మిగిలిపోయిన లబ్ధిదారులకు సంబందించి వాళ్లకు అందించే కార్యక్రమం జరుగుతుంది. 2024లో సంక్షేమ కేలండర్... జనవరి 2024లో వైయస్సార్ రైతుభరోసా పీఎం కిసాన్‌కు సంబంధించిన మూడో విడత చెల్లింపులుతో పాటు వైయస్సార్ ఆసరా కార్యక్రమం కూడా ఉంటుంది. జగనన్న తోడు పథకానికి సంబంధించి వడ్డీలేని రుణాలందించే కార్యక్రమం, వైయస్సార్ లా నేస్తం రెండో విడత ఇన్‌స్టాల్‌మెంట్ అందించే కార్యక్రమం ఉంటుంది. రూ.3వేలకు పెన్షన్ పెంపు... అదే విధంగా జనవరి 1వ తేదీన పెన్షన్‌లు పెంపు కార్యక్రమం రూ.2750 నుంచి రూ.3000 కు పెంచుతూ అందించే కార్యక్రమం ఉంటుంది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పెన్షన్‌ను పెంచుకుంటూ రూ.3000 వరకూ తీసుకునిపోతామని చెప్పామో ఆ మాటను కూడా సంపూర్ణంగా నెరవేర్చి.. ప్రతి అవ్వ, తాతల మొహంలో చిరునవ్వుల చూసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఫిబ్రవరిలో జగనన్న విద్యాదీవెనతో పాటు వైయస్సార్ కళ్యాణమస్తు – షాదీ తోపా నాలుగో విడత కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాం. ఇదే నెలలో వైయస్సార్ ఈబీసీ నేస్తం పూర్తి చేస్తాం. మార్చినెలలో జగనన్న వసతి దీవెన రెండో విడత అందజేస్తాం. ఎంఎస్‌ఎంఈ ఇన్సెంటివ్‌లు కూడా మార్చిలోనే పూర్తి చేస్తాం. దేవుడి దయతో ఈ నాలుగు సంవత్సరాలుగా ఈ కేలండర్‌ను తూచా తప్పకుండా ఒక నెల అటూ ఇటుగా గొప్పగా అమలు చేశాం. ఈ సంవత్సరానికి సంబంధించి కూడా ఈ కేలండర్ విడుదల చేసే ప్రక్రియ కొనసాగిస్తూ... దీనివల్ల రాష్ట్రప్రజలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం ప్రసంగం ముగించారు.