దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

 తాడేప‌ల్లి: సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి స్వర్గస్తులయ్యారు. ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంతాపం వ్య‌క్తం చేశారు. కుటుంబ స‌భ్యుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ త‌న ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు.

వైయ‌స్ఆర్‌ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామానికి చెందిన శ్రీనాథ్‌రెడ్డి.. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు సంస్థలు, బీబీసీ, సాక్షి దినపత్రికల్లో ఉన్నత హోదాలో పని చేశారు. శ్రీనాథ్‌రెడ్డి చెన్నై ట్రిప్లికేన్ లోని హిందూ హైస్కూలులో పదవ తరగతి వరకు చదివారు. అనంతరం తిరుపతిలోని ప్రతిష్ఠాత్మక శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో బీకామ్ అభ్యసించారు. అనంతరం పాత్రికేయ రంగంలో అడుగు పెట్టారు.  1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాథ్‌ రెడ్డి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పాత్రికేయ రంగంలో కొనసాగారు.  
కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో ఆయన రాసిన కాలమ్స్ విశేషప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేసిన శ్రీనాథ్‌ రెడ్డి.. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కాగానే శ్రీ‌నాథ్‌రెడ్డి సేవ‌ల‌ను గుర్తించి ఏపీ ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్‌గా నియ‌మించారు. 2019 నుంచి దాదాపు మూడేళ్ల పాటు ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్‌గా ప‌ని చేశారు. ఆయ‌న మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఆర్‌.ధ‌నుంజ‌య‌రెడ్డి, దేవుల‌ప‌ల్లి అమ‌ర్‌, కొమ్మినేని శ్రీ‌నివాస‌రావు, త‌దిత‌రులు సంతాపం వ్య‌క్తం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top