నెల్లూరు: సోమశిల జలాశయాన్ని సందర్శిస్తే ప్రభుత్వానికి ఏం నష్టమని వైయస్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను వెళ్లనీయకుండా హౌస్ అరెస్టులు చేయడం ద్వారా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం సోమశిల జలాశయాన్ని సందర్శించేందుకు వెళ్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసం వద్ద నుంచి సోమశిల సందర్శనకు బయలుదేరిన ఆయనతో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలను దాటుకొని వెళ్లేందుకు వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ప్రయత్నించగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను కొట్టిన కానిస్టేబుల్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమశిల సందర్శనకు అనుమతి ఇచ్చే వరకు తమ నిరసన కొనసాగుతుందని కాకాణి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు చంద్రబాబు నాయుడు చరమగీతం పాడారని ఆరోపించారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. సోమశిలను సందర్శిస్తే ప్రభుత్వానికి ఏం నష్టమని ప్రశ్నించారు. తమను వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడం ద్వారా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండించకపోవడం దారుణమన్నారు. రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ నుంచి సోమశిల, కండలేరుకు నీటిని తరలించి నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంతాలకు నీరు అందించాలనే నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. తమ హయాంలో జగన్ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు చీకటి ఒప్పందాలను త్వరలోనే బయటపెడతామని, బ్రిటిష్ పాలకుల మాదిరిగానే చంద్రబాబును కూడా ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నా చంద్రబాబు మౌనంగా ఉండటం దారుణమన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా తాకట్టు పెట్టే వ్యక్తి అని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలన రైతులను ఉరి వేసుకునే స్థితికి తీసుకువచ్చిందన్నారు. సోమశిల ప్రాజెక్ట్‌ను సందర్శించేందుకు వెళ్తే పోలీసుల చేత హౌస్ అరెస్టులు చేయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో చంద్రబాబు కుమ్మక్కయ్యాడనే కారణంతోనే తమను సందర్శనకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.