తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తో సినీ నటుడు చిరంజీవి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్తో చిరంజీవి సమావేశమయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, గన్నవరం విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి సమాధానం ఇస్తూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉందన్నారు.
ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్ల సాధక బాధలు సీఎంకు వివరించాను వివరించా. నేను చెప్పిన అన్ని విషయాలను సీఎం సానుకూలంగా ఆలకించారు. సినీ ఇండస్ట్రీ విషయంలో సీఎం జగన్ స్పందన సంతృప్తినిచ్చింది. పైకి కన్పించినంత గ్లామర్ గా సినీ ఫీల్డ్ ఉండదు. రెక్కాడితే కాని డొక్కాడని పేదలు ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారు. ధియేటర్ల యజమానులకూ అనేక బాధలు ఉన్నాయి. హాళ్లని మూసేస్తేనే బెటర్ అనే భావనకు కొందరు ధియేటర్ యజమానులు ఉన్నారు. ఈ సమస్యలన్నీ సీఎంకు వివరించాను. అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారు. టిక్కెట్ ధరలపై జారీ చేసిన జీవోను జగన్ పునః పరిశీలిస్తామన్నారు. ఇండస్ట్రీ పెద్దగా కాదు ఒక బిడ్డగా చెబుతున్నా.. ఎవరూ ఆందోళన చెందొద్దు. అందరూ సంయమనంతో ఉండాలి. తొందరపడి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరుతున్నా. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా’అన్నారు.