ఆ బాధ్య‌త నాది.. రెండేళ్ల టైమ్ ఇవ్వండి ఆ మాట‌ను తుడిచేస్తా..

తిరువూరు బ‌హిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

కాలేజీల ఫీజులు ఎంతైనా.. పిల్లలు ఎంతమంది చదివినా.. పూర్తి ఫీజుల బాధ్యత నాది

రెండేళ్ల టైమ్ ఇవ్వండి కార్పొరేట్‌ బడులు గవర్నమెంట్‌ బడులతో పోటీపడేలా చేస్తా

కుటుంబ తలరాతను, వెనుకబడిన కులాల తలరాతను, దేశం తలరాతను మార్చే శక్తి చదువుకే ఉంది

జ‌గ‌న‌న్న విద్యా దీవెన ప‌థ‌కం ద్వారా విద్యార్థుల చ‌దువుల‌కు అండ‌గా నిలిచాం

2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి విద్యా దీవెన నిధులు విడుద‌ల 

9.86 లక్షల మంది పిల్ల‌ల‌కు మంచిచేస్తూ 8,91,180 మంది తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ

దేశంలో విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాలు ఎక్కడా లేవు

విద్యా దీవెన ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు రూ. 9,947 కోట్లు అందించాం, 27 ల‌క్ష‌ల మంది పిల్ల‌ల‌కు మేలు చేశాం

గత ప్రభుత్వం పెట్టిన రూ.1777 కోట్ల‌ బకాయిల‌ను సైతం చిరునవ్వుతో చెల్లించాం

ఏప్రిల్ 11న రెండవ విడత వసతి దీవెన నిధులు అంద‌జేస్తాం

జీఈఆర్ రేషియో 32% నుండి 72 శాతానికి తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నాం

కొత్తగా 14 డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చాం.. 17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి

45 నెలల్లో డీబీటీ ద్వారా నేరుగా రూ.1.98 లక్షల కోట్లు అందించాం

విలువలు లేని దుష్టచతుష్టయంతో మీ జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం యుద్దం చేస్తోంది

మ‌నంద‌రి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంది కాబ‌ట్టే తోడేళ్ల‌న్నీ ఏక‌మ‌వుతున్నాయి

రామాయ‌ణం, భార‌తం చూసినా.. బైబిల్‌, ఖురాన్ చ‌దివినా చివ‌ర‌కు మంచే గెలిచేది

తిరువూరు: ‘‘కాలేజీల ఫీజులు ఎంతైనా సరే.. పిల్లలు ఎంతమంది చదివినా సరే.. ఆ పూర్తి ఫీజుల బాధ్యత మీ జగనన్నే తీసుకుంటాడు. చదువులకు పేదరికం అడ్డురాకూడదు. మన పిల్లలు బాగా చదవాలి.. ప్రపంచంతో పోటీపడాలి.. రెండు సంవత్సరాల టైమ్‌ ఇవ్వండి గవర్నమెంట్‌ బడులు కార్పొరేట్‌ బడులతో పోటీపడలేవనే మాటను తుడిచేస్తా.. కార్పొరేట్‌ బడులు గవర్నమెంట్‌ బడులతో పోటీపడేలా చేస్తా’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్‌–డిసెంబర్‌ 2022 త్రైమాసికానికి సంబంధించిన నిధులును సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. 9.86 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ 8,91,180 మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా  రూ.698.68 కోట్లను జమ చేశారు.  అంతకుముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు.

తిరువూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పూర్తి ప్రసంగం..

ప్రతి పేద కుటుంబం, ప్రతి పేద కులం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో బాగుండాలనే సంకల్పంతో నవరత్నాల్లోంచి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే ఈరోజు విద్యా దీవెన కార్యక్రమం కూడా జరుగుతుంది. నేను గట్టిగా నమ్మే అంశం.. మన పిల్లలకు మనం చెరగకుండా ఇచ్చే ఆస్తి చదువే అని గట్టిగా నమ్ముతున్నాను. అజ్ఞానాన్ని చీకటితోనూ, విజ్ఞానాన్ని వెలుగుతోనూ ఎప్పుడూ పోల్చుతుంటాం. అలాంటి చీకటి నుంచి వెలుగులోకి ఒక మనిషి పేదరికం నుంచి బయట పడాలంటే అది సాధ్యమయ్యేది ఒక్క చదువుతోనే అని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. 

మనిషి తలరాతను, ఓ కుటుంబం తలరాతను, వెనకబడిన కులాల తలరాతలను, దేశ తలరాతలను కూడా మార్చగలిగిన శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఈరోజు 17 నుంచి 20 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న నేటి తరం మరో 80 సంవత్సరాల పాటు వాళ్ల జీవితాలు సాఫీగా జరగాలంటే, మెరుగైన జీతాలతో, ఆదాయాలతో వారి బతుకులు సాగాలంటే, వారి జీవన ప్రమాణాన్ని, వారి జీవన ప్రయాణాన్ని రెండింటినీ నిర్దేషించేది ఒక్క చదువే అని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను.. గర్వపడుతున్నాను. కాబట్టే మన రాష్ట్రంలో ఈ రోజు ఎల్‌కేజీ లేదా పీపీ1 నుంచి చదువులు ప్రారంభిస్తున్న బిడ్డ దగ్గర నుంచి.. అక్కడ మొదలైన ఆ బిడ్డ జీవితం ఆ బిడ్డ ఎదిగి ఒక మంచి డాక్టర్‌ కావాలని, మంచి ఇంజినీర్‌ కావాలని కోరుకుంటున్నాను. మన కళ్లెదుటే మన కలెక్టర్‌ ఢిల్లీరావు ఉన్నారు. అత్యంత సాధారణ కుటుంబం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి ఈరోజు కలెక్టర్‌గా మీ కళ్లెదుటే కనిపిస్తున్నారు. ఇలా బతుకులు మారాలి.. మన జీవితాలు మారాలని అడుగులు ముందుకేస్తున్నాం. 

అలాంటి చదువులకు పేదరికం అడ్డురాకూడదు. పిల్లలు పెరగాలి, ఎదగాలి. పేదరికం వల్ల చదువులు మానేస్తున్న పరిస్థితులు ఎప్పటికీ రాకూడదు. ఆ చదువులకు భరోసా ఇస్తూ ఈ పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌తో జగనన్న విద్యా దీవెన పథకాన్ని గొప్పగా అమలు చేస్తున్నామని సగర్వంగా ప్రతి చెల్లెమ్మకు అన్నగా, ప్రతి తమ్ముడిగా మంచి అన్నగా అని తెలియజేస్తున్నాను.
ఇలాంటి పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇచ్చే కార్యక్రమం. చదువులే కాకుండా.. ఆ పిల్లలను చెయ్యిపట్టుకొని నడిపిస్తూ వసతి దీవెన అనే కార్యక్రమం కూడా తీసుకువచ్చాం. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఈ రెండు పథకాల ద్వారా ఈ స్థాయిలో మంచి జరిగిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది మీ జగనన్న ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

కాలేజీల ఫీజులు ఎంతైనా సరే.. పిల్లలు ఎంతమంది చదివినా సరే.. ఆ పూర్తి ఫీజుల బాధ్యత మీ జగనన్నే తీసుకుంటాడని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని పెద్ద చదువులు చదివిస్తున్న తల్లుల ఖాతాల్లోకి వారి పిల్లలకు సంబంధించిన పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ డబ్బులు జమ చేసే ఈ కార్యక్రమాన్ని తిరువూరులో ప్రారంభిస్తున్నాం. 

గత ప్రభుత్వంలో కాలేజీల ఫీజుల విషయంలో ఎలా ఉండేదో మనందరికీ గుర్తుంది. ఇచ్చే ఫీజులు అరకొర.. ఫీజులు చూస్తే రూ.70 వేలు, రూ.80 వేలు, లక్ష రూపాయలు, కొన్ని కాలేజీల్లో అయితే రూ.1.20 లక్షలు కూడా ఉన్నాయి. ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చూస్తే అరకొర. రూ.35 వేలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. సంవత్సరాల తరబడి బకాయిలు పెట్టిన పరిస్థితి చూశాం. ఆ కాలేజీల ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు పడుతున్న అవస్థలు చూశా.. ఆ ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చూశా.. ఈ రెండింటినీ మార్చాలని అధికారంలోకి వచ్చిన వెంటనే అడుగులు వేగంగా ముందుకువేశాం. వంద శాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ తెచ్చాం. ఫీజులు ఎంతైనా కానీ, 60 వేలు, 70 వేలు, 80 వేలు, లక్ష రూపాయలు కానీ, రూ.1.20 వేలు కానీ, ఫీజులు ఎంతైనా కానీ, కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదివినా కానీ, ఆ ఫీజుల కోసం ఏ తల్లి, ఏ తండ్రి అప్పులపాలు కాకూడదు. ఆ ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేసే పరిస్థితి రాకూడదు. అందుకోసమే మీకు తోడుగా నిలబడేందుకు మీ జగనన్న ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ కోసం ఉన్నాడని చెప్పడానికి గర్వపడుతున్నా. 

ప్రతి విద్యా సంవత్సరంలో ఫీజులు చెల్లించడమే కాదు.. అవి సకాలంలో చెల్లించాలి. అలా చెల్లిస్తేనే పిల్లలు ఇబ్బందులు పడకుండా చదువులు ముందుకుసాగిస్తారు. ఈ ఉద్దేశంతోనే ప్రతి మూడు నెలలకు ఒకసారి అంటే త్రైమాసికం ముగిసిన వెంటనే ఆ పిల్లలకు పూర్తి ఫీజులు తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ 9.86లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ నా ప్రసంగం అయిపోయిన వెంటనే బటన్‌ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నాం. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా 8,90,180 మంది తల్లుల ఖాతాల్లోకి 698 కోట్ల రూపాయలు జమ చేయబోతున్నాం. 

రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి క్రమం తప్పకుండా, ఎలాంటి బకాయిలూ లేకుండా పిల్లలకు నూటికి నూరు శాతం పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇస్తూ.. జగనన్న విద్యా దీవెన పథకంతో ఇప్పటి వరకు అక్షరాల రూ.9,947 కోట్లు ఇవ్వడం జరిగింది. 27 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. 

గత ప్రభుత్వంలో చంద్రబాబు పాలనలో చివరి రెండు సంవత్సరాలకు సంబంధించి (2017–18, 2018–19) ఎగ్గొట్టి పోయిన రూ.1777 కోట్లు కూడా చిరునవ్వుతో మీ జగనన్న ప్రభుత్వం చెల్లించిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఆ పెద్ద మనిషి బకాయిలు పెట్టిపోతే చిరునవ్వుతో చెల్లించింది మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నా. 

ఈ ఫీజులు మొత్తం నేరుగా కాలేజీలకు ఇవ్వకుండా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఇదొక గొప్ప మార్పు. కారణం.. ఆ తల్లులకు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించే హక్కు ఇవ్వడం కోసం చేస్తున్నాం. ఆ తల్లులు ప్రతి మూడు నెలలకు ఒకసారి కాలేజీలకు వెళ్లాలని, తమ పిల్లల బాగోగులు తెలుసుకోవాలని, స్వయంగా వారే ఫీజులు కట్టే కార్యక్రమం జరగాలని, కాలేజీల్లో వసతులు లేకపోతే బాగుచేయమని యాజమాన్యాన్ని ప్రశ్నించే హక్కు ఆ తల్లులకు రావాలని ఈ కార్యక్రమంలో మార్పులు చేశాం. కాలేజీ యాజమాన్యాలు ఎవరైనా వినకపోతే ఆ తల్లులు 1902కు ఫోన్‌ చేస్తే నేరుగా మీ బిడ్డ ప్రభుత్వంలోని సీఎంఓ ఆ కాలేజీలతో మాట్లాడే కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ భరోసా ఇస్తున్నా. 

పిల్లలకు పూర్తిగా ఫీజులు మాత్రమే ఇవ్వడం కాకుండా.. వారికి వసతి కోసం, భోజనం కోసం ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆ ఖర్చులు కూడా భారమై తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదని జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ చదువుతున్న విద్యార్థులకు రూ.15 వేలు, మెడిసిన్, ఇంజినీరింగ్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి రూ.20 వేలు రెండు దఫాల్లో జగనన్న వసతి దీవెన కింద ఆ తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 

ఈ సంవత్సరానికి సంబంధించి రెండో దఫా కింద ఇచ్చే జగనన్న వసతి దీవెన సొమ్ము కూడా ఏప్రిల్‌ 11వ తేదీన విడుదల చేసేందుకు తేదీని కూడా ఖరారు చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 

ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే.. నా పిల్లలు బాగా చదవాలి.. నా పిల్లలు ప్రపంచంతో పోటీపడాలి. సత్యనాదెళ్ల మాదిరిగా మన పిల్లలు తయారవ్వాలి. దాని కోసం మీ అన్న, మీ తమ్ముడు తపన పడుతున్నాడని ప్రతి తల్లికి చెబుతున్నాను. 

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కేవలం రెండు పథకాలకు అక్షరాల ఈ 45 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం రూ.13,311 కోట్లు ఖర్చు చేసిందని చెప్పడానికి గర్వపడుతున్నా. 

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల వల్ల ఇంజినీరింగ్‌ వంటి వృత్తివిద్యా కోర్సుల్లో చేరుతున్న పిల్లల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2018–19లో 87,439 మంది పిల్లలు ఇంజినీరింగ్‌ వంటి విద్యా కోర్సును చదవడానికి ఎంచుకుంటే.. 2022–23 సంవత్సరానికి ఆ సంఖ్య ఏకంగా 1.20 లక్షల మందికి చేరిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. కారణం.. నా చదువులకు మా జగనన్న తోడుగా ఉన్నాడన్న భరోసా ఆ తల్లులకు, ఆ పిల్లలకు ఉంది కాబట్టే. 

ఇంటర్‌ ఉత్తీర్ణులై చదువులకు దూరమైన విద్యార్థుల సంఖ్య 2018–19లో చూస్తే 81,813 మంది అయితే.. మన ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాల ద్వారా 2022–23లో ఆ సంఖ్య కేవలం 22,387కు మాత్రమే తగ్గిపోయింది. ఈ సంఖ్య కూడా ఉండకూడదు.. ఈ సంఖ్య సున్నా కావాలనే ఉద్దేశంతోనే మీ జగనన్న ప్రభుత్వం పనిచేస్తుంది. 

  • 2018–19లో 37 వేలుగా ఉన్న క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు 2021–22లో ఏకంగా 85 వేలకు పెరిగింది. 
  • ఇంటర్‌తో ఆపేసే విద్యార్థుల సంఖ్య దేశంలో సగటున చూస్తే 27 శాతం అయితే.. మన రాష్ట్రంలో అది కేవలం 6.6 శాతం అని చెప్పడానికి గర్వపడుతున్నా. 
  • గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియా (జీఈఆర్‌) 17 నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు కాలేజీల్లో చదవాలని జీఈఆర్‌ గురించి మాట్లాడుతారు. దేశం సగటున జీఈఆర్‌లో 2018–19లో 32.4 శాతం.. మన రాష్ట్రంలో 70 శాతానికి తీసుకెళ్లాలనే తపన, తాపత్రయంతో మీ బిడ్డ ముందుకు అడుగులు వేస్తాడని ప్రతి తల్లికి భరోసా ఇస్తున్నాను. 

ప్రతి అక్కకు మంచి తమ్ముడిగా, ప్రతి చెల్లికి మంచి అన్నగా మీ అందరికీ ఒక మాట చెబుతున్నా.. మీ పిల్లల చదువుల బాధ్యత నాదీ అని మాటిస్తున్నా.. అమ్మ ఒడితో మొదలుపెడితే విద్యా కానుక, గోరుముద్ద, నాడు–నేడు వంటి మంచి కార్యక్రమాలతో అడుగులు ముందుకేస్తున్నాం. పాఠ్యపుస్తకాలు బైలింగ్వెల్‌. ఒక పేజీ ఇంగ్లిష్, మరో పేజీ తెలుసు. స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్‌ రూమ్‌ కూడా ఇంటరాక్టీవ్‌ ప్లాట్‌ ప్యానల్స్‌ అంటే డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ కాబోతున్నాయి. నాడు–నేడు పూర్తిచేసుకున్న 15,270  స్కూళ్లలో 6వ తరగతి పై ఉన్న స్కూళ్లు దాదాపు 5,800 స్కూల్స్‌. ఇందులో 30,230 క్లాస్‌ రూమ్స్‌లో ఇంటరాక్టీవ్‌ ప్లాట్‌ ప్యానల్స్‌ పెట్టి క్లాస్‌రూమ్స్‌ డిజిటలైజ్‌ కాబోతున్నాయి. 8వ తరగతిలోకి ఏ పిల్లాడు అడుగుపెట్టినా కూడా నా పుట్టిన రోజు పిల్లలను ఎప్పుడూ జ్ఞాపం ఉంచుకోవాలనే తపన, తాపత్రయంతో 8వ తరగతిలోకి వచ్చిన ప్రతి పిల్లలకు ట్యాబ్స్‌ ఇచ్చి 10వ తరగతి వరకు తీసుకెళ్తున్నాం. రెండు సంవత్సరాల సమయం ఇవ్వండి గవర్నమెంట్‌ బడులు కార్పొరేట్‌ బడులతో పోటీపడలేవనే మాటను తుడిచేస్తా.. రెండు సంవత్సరాలు టైమ్‌ ఇవ్వండి.. కార్పొరేట్‌ బడులు గవర్నమెంట్‌ బడులతో పోటీపడేలా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 

6వ తరగతి నుంచి ప్రతి క్లాస్‌ రూమ్‌ డిజిటలైజ్‌ కాబోతోంది. ఒక్క సారి గవర్నమెంట్‌ బడులు డిజిటలైజ్‌ అయిపోతే ప్రైవేట్‌ వారు కూడా పోటీపడక తప్పదు. 8వ తరగతి పిల్లలకు గవర్నమెంట్‌ బడుల్లో ట్యాబ్స్‌ ఇస్తున్నాం. రెండో సంవత్సరం కూడా ఈ ట్యాబ్‌లు ఇస్తే ప్రైవేట్‌ బడులు కూడా గవర్నమెంట్‌ బడుల మాదిరిగా ట్యాబ్‌లు ఇవ్వకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. రెండు సంవత్సరాల టైమ్‌ ఇవ్వండి కార్పొరేట్‌ బడులు గవర్నమెంట్‌ బడులతో పోటీపడేలా చేస్తాను. 

హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో కూడా విపరీతమైన మార్పులు తీసుకువచ్చాం. మూడు సంవత్సరాల కోర్సులను నాలుగు సంవత్సరాలు చేశాం. ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేశాం. డిగ్రీ చదువులన్నీ ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చేశాం. ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ కరికుళంతో అనుసంధానం చేస్తూ తీసుకువచ్చాం. జాబ్‌ ఓరియంటెడ్‌గా కరికుళంను పూర్తిగా మార్చుకుంటూ వెళ్తున్నాం. ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ తీసుకువచ్చాం. మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్సు, ఏడబ్ల్యూఎస్, నాస్‌క్యామ్, పాలోఆల్టో వంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు ఇచ్చేలా ఉచితంగా మన పిల్లలకు అందుబాటులోకి తెచ్చేలా అడుగులు ముందుకేశాం. ఇవన్నీ కాకుండా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన తీసుకువచ్చాం. ఈ పథకాలతో రూపురేఖలు మారుతున్న మన విద్యా సంస్థలు, రూపురేఖలు మారనున్న మన విద్యార్థుల భవిష్యత్తు. 

అక్షరాల మనబడి నాడు–నేడుతో 46,447 కాలేజీలు, స్కూళ్లలో 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తూ.. ప్రభుత్వ స్కూళ్లను, జూనియర్‌ కాలేజీలను కూడా మారుస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో పిల్లల జీవితాలను మార్చే కార్యక్రమం జరుగుతుంది. 

మన ప్రభుత్వం వచ్చాక కొత్తగా 14 డిగ్రీ కాలేజీలను తీసుకువచ్చాం. ఉన్నత విద్యకు మరింత ఊతమిచ్చేలా మరెన్నో చర్యలు తీసుకున్నాం. జేఎన్టీయూ గురజాడ యూనివర్సిటీని విజయనగరంలో పెట్టాం.. ఆంధ్రకేసరి యూనివర్సిటీని ఒంగోలు, వైయస్‌ఆర్‌ అగ్రికల్చర్, వైయస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీని కడపలో పెట్టాం. కర్నూలులో క్లస్టర్‌ యూనివర్సిటీని పెట్టాం. ఈ సంవత్సరం పులివెందులలో అగ్రికల్చర్‌ కాలేజీలు తీసుకువచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 

అంతేకాదు.. వైద్య విద్యారంగంలో చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 17 కొత్త మెడికల్‌ కాలేజీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఉన్న 11 గవర్నమెంట్‌ కాలేజీలు కూడా నాడు–నేడుతో రూపురేఖలు మార్చుతున్నాం. ఇవన్నీ పిల్లల జీవితాలను బాగుచేయడానికి అడుగులు ముందుకేస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

నిండుమనసుతో ఈ బాధ్యతను నెరవేరుస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఒక ఇంట్లో ఉన్న అవ్వాతాతల పట్ల, అక్కచెల్లెమ్మల పట్ల, పిల్లల పట్ల, రైతుల పట్ల, సమాజంలో అణచివేతను ఎదుర్కొన్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పట్ల, నిరుపేదల పట్ల ఇలా ప్రతి ఒక్కరిపట్ల నిండుమనసుతో స్పందించే హృదయం నాది. సామాజిక న్యాయం, మహిళా న్యాయం, రైతన్నలకు న్యాయం వీటన్నింటినీ కర్తవ్యంగా, దైవ కార్యాలుగా భావించి ఈరోజు మన ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. 

గడప గడపలోనూ సంతోషం చూడాలని, ఇంటింటా ఆనందం ఉండాలని తపించే మనసు మన ప్రభుత్వానిది అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో ఏ పేద ఇంటికి వెళ్లినా.. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనంత విధంగా ఈ రోజు మీ అన్న ప్రభుత్వం గత 45 నెలలుగా పాలన అందిస్తుందని చెప్పడానికి గర్వపడుతున్నా. ఈ 45 నెలల పరిపాలన ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయండి.. గతాన్ని ఒక్కసారి గుర్తుచేసుకోండి. గతంలో మాదిరిగా కాకుండా ఈ 45 నెలల కాలంలో మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఆలోచన చేయండి. ఈ 45 నెలల్లో కేవలం బటన్‌ నొక్కి ఎటువంటి లంచాలకు తావులేకుండా, వివక్షకు చోటు లేకుండా అక్షరాల రూ.1.98 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబానికి అందించానని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

ఇలాంటి మనందరి ప్రభుత్వం నిత్యం మీకు మంచి చేయడం కోసం తపిస్తున్న ఈ ప్రభుత్వం నిత్యం ఎవరితో యుద్ధం చేస్తుందో తెలుసా.. కుటుంబ విలువలు, రాజకీయ విలువలు, మానవతా విలువలు లేని ఒక దుష్టచతుష్టయం అనే వ్యవస్థతో యుద్ధం చేస్తోంది. ఆలోచన చేయండి.. గతానికి, ప్రస్తుతానికి తేడాను గమనించండి. గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌.. అప్పుల పెరుగుదల శాతం చూస్తే గతం కంటే మీ బిడ్డ ప్రభుత్వంలోనే తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు..? గత పాలకులు ఎందుకు చేయలేకపోయారు..? అని ఆలోచన చేయండి.

దోచుకో, పంచుకో, తినుకో అనే డీపీటీని నడిపిన ప్రతిపక్షంతో మీ బిడ్డ ప్రభుత్వం ఈ రోజు డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ)ని నడుపుతూ యుద్ధం చేయాల్సి వస్తుందని గుర్తుచేసుకోండి. 

దోచుకో, పంచుకో, తినుకో బ్యాచ్‌ ఎవరో తెలుసా.. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు, వీరికితోడు ఒక దత్తపుత్రుడు. ఇలాంటి దుష్టచతుష్టయంతో మీ బిడ్డ యుద్ధం చేస్తున్నాడు. ఆ దుష్టచతుష్టయానికి సవాల్‌ విసురుతున్నా.. మనందరి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని వారు నమ్మితే వారెందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని అడుగుతున్నా.. ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయని అడుగుతున్నా.. గ్రామ గ్రామానికి, ఇంటింటికీ అందిన అభివృద్ధి ఫలాల మీద, సామాజిక వర్గాలు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, బడిపిల్లలకు, అవ్వాతాతలకు, అందించిన సంక్షేమ ఫలాల మీద మన ప్రభుత్వంతో పోల్చుకునేందుకు అర్హత లేనివీరంతా మన ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారు. వీరిని మరోసారి అడుగుతున్నా.. ఎన్నికల బరిలో మంచిచేసిన మనందరి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ముందా అని అడుగుతున్నా.. 

నా ప్రయాణం మీరే.. నన్ను నడిపించేదీ మీరే.. నా ప్రయాణంలో నిరంతరం ఎవరిపైనైనా ఆధారపడే పరిస్థితి ఉందంటే అది ఆ దేవుడి మీద, మీ అందరి మీదే. ఎన్ని కుతంత్రాలు పన్నినా కూడా చివరకు మంచే గెలుస్తుంది. రామాయణం చూసినా, మహాభారతం చూసినా అదే కనిపిస్తుంది, బైబిల్‌ చదివినా, ఖురాన్‌ చదివినా అదే కనిపిస్తుంది. చివరకు గెలిచేది మంచిచేసిన వాడే గెలుస్తాడు. ఏ సినిమాకు వెళ్లినా.. ఆ సినిమాలో నచ్చేది హీరో మాత్రమే తప్ప విలన్లు నచ్చరని తెలియజేస్తున్నా. 

దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉండాలని, కొండంత అండగా నిలబడిన నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలు, నా అవ్వాతాతలు, నా అక్కచెల్లెమ్మలు, నా రైతన్నలు వీరందరూ నిండు మనసుతో నాకు తోడుగా నిలబడాలని, మంచి జరిగిన ప్రతి ఇల్లు కూడా మీ బిడ్డకు అండగా నిలవాలని నిండు మనసుతో కోరుకుంటూ మరోసారి రెండు చేతులు జోడించి పేరు పేరునా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా..

Back to Top