175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా..?

చంద్రబాబుకు, దత్తపుత్రుడికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సవాల్‌

మేనిఫెస్టోలోని 98.5 శాతం హామీలను నెరవేర్చామని సగర్వంగా చెబుతున్నా

మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా నిలబడండి

చేసిన మంచిని గడప గడపకూ వివరిస్తూ మళ్లీ అధికారంలోకి వస్తాం..

ఇప్పటి వరకు డీబీటీ ద్వారా పేదలకు అక్షరాల రూ.1.93 లక్షల కోట్లు అందించాం

రాష్ట్రంలో పేదల ప్రభుత్వానికి, పెత్తందార్ల పార్టీకి మధ్య యుద్ధం జరుగుతోంది

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు ఈ గజదొంగల ముఠా చేసేది దోచుకో, పంచుకో, తినుకో..

చంద్రబాబు హయాంలో బటన్‌ నొక్కే స్కీమ్‌లు ఎందుకులేవో ఆలోచన చేయండి

అప్పట్లో ఆ డబ్బులన్నీ ఎవడి జేబుల్లోకి వెళ్లాయో గట్టిగా ఆలోచన చేయండి

మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా తోడుగా నిలబడండి

గుంటూరు: ‘‘175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా..?’’ అని తెనాలి బహిరంగ సభ నుంచి చంద్రబాబుకు, దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఈ రాష్ట్రంలో పేదల ప్రభుత్వానికి, పెత్తందార్ల పార్టీకి మధ్య యుద్ధం జరుగుతుందని, ప్రజలంతా ఆలోచన చేయాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో, మీ బిడ్డ వైయస్‌ జగన్‌ పరిపాలనలో మీ కుటుంబంలో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా ఉండండి అని ప్రజలను సీఎం వైయస్‌ జగన్‌ కోరారు. గర్వంగా చెప్పగలుగుతున్నా.. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో 98.5 శాతం హామీలను నెరవేర్చి.. మీ బిడ్డ మిమ్మల్ని ఓటు అడగటానికి ముందుకొస్తున్నాడన్నారు. తెనాలి బ‌హిరంగ స‌భ వేదిక నుంచి ప్ర‌తిప‌క్షాల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌వాళ్లు విసిరారు. వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌భుత్వం గ‌డిచిన మూడు సంవ‌త్స‌రాల 8 నెల‌ల పాల‌న‌లో చేసిన మంచివివ‌రిస్తూ..ప్ర‌తిప‌క్షాల తీరును ఎండ‌గ‌ట్టారు. 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగం..

  • రైతులకు ఒకే ఒక్క మాట చెబుతున్నా.. రైతులను వంచించిన చంద్రబాబు ఒకవైపున ఉంటే.. రైతన్నకు అండగా ఉంటున్న మనందరి ప్రభుత్వం మరోవైపు ఉండి యుద్ధం చేస్తోంది. 
  • వచ్చే ఎన్నికల్లో యుద్ధం కరువుతో ఫ్రెండ్‌షిప్‌ ఉన్న చంద్రబాబుకు.. వరుణ దేవుడి ఆశీస్సులు ఉన్న మనందరి ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతోంది.
  • వచ్చే ఎన్నికల్లో యుద్ధం గవర్నమెంట్‌ బడుల్లో పేద పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం వద్దన్న బాబుకు.. గవర్నమెంట్‌ బడుల్లో నాడు–నేడుతో రూపురేఖలు మారుస్తూ, సీబీఎస్‌ఈ ఇంగ్లిష్‌ మీడియం తీసుకువచ్చిన మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతోంది. 
  • వచ్చే ఎన్నికల్లో యుద్ధం మొదటి సంతకంతోనే పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసి, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను రోడ్డు మీదకు తీసుకువచ్చిన చంద్రబాబుకు, వైయస్‌ఆర్‌ ఆసరా, సున్నావడ్డీ, వైయస్‌ఆర్‌ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న అమ్మ ఒడి, 30 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి.. అందులో ఇప్ప‌టికే 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తున్న మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య ఈ రోజు యుద్ధం జరుగుతుంది. 

వచ్చే ఎన్నికల్లో యుద్ధం గ్రామాల్లో జన్మభూమి కమిటీల గజదొంగల ముఠా నుంచి పైస్థాయిలో రామోజీరావు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈ గజదొంగల ముఠాలో మరొకరు దత్తపుత్రుడు. ఈ గజదొంగల ముఠా చేసేది దోచుకో, పంచుకో, తినుకో.. డీపీటీ, ఈ స్కీమ్‌ను సృష్టించిన చంద్రబాబుకు, గ్రామ రూపురేఖలు మారుస్తూ మన కళ్ల ఎదుటనే కనిపిస్తున్న గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్లు, ఆర్బీకేలు, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం చదువులు, విలేజ్‌ క్లినిక్‌లు, రాబోతున్న డిజిటల్‌ గ్రంథాలయాలు ఇటువంటి వాటి ద్వారా గ్రామ స్వరూపాన్ని మారుస్తూ.. ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా ఏ ఒక్క అర్హుడు కూడా మిస్‌ కాకూడదనే ఉద్దేశంతో సోషల్‌ ఆడిట్‌ కోసం అర్హుల జాబితాను ప్రదర్శించి వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా అక్షరాల రూ.1.93 లక్షల కోట్లు (డీబీటీ) కేవలం బటన్‌ నొక్కడం ద్వారా నేరుగా నా అక్కచెల్లెమ్మల బ్యాంక్‌ అకౌంట్‌లోకి డబ్బులు జమ చేశాం. లక్షా 93 వేల కోట్లు డీబీటీగా ప్రతి అక్కచెల్లెమ్మల కుటుంబానికి అందించిన మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతుంది. 

అందరినీ ఆలోచన చేయండీ అని అడుగుతున్నా.. ఎందుకంటే ఆరోజున కూడా ఇదే బడ్జెట్, ఆరోజున కూడా ఇదే రాష్ట్రం. ఆరోజు కంటే.. ఈరోజు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌ అప్పులలో పెరుగుదల గ్రోత్‌ రేట్‌ కూడా అప్పటి కంటే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో తక్కువే. మీ బిడ్డ మాత్రమే ఎందుకు బటన్‌ నొక్కగలుగుతున్నాడు.. అప్పట్లో చంద్రబాబు హయాంలో బటన్‌ నొక్కే స్కీమ్‌లు ఎందుకులేవో ఆలోచన చేయండి. అప్పట్లో ఆ డబ్బులన్నీ ఎవడి జేబుల్లోకి వెళ్లాయో గట్టిగా ఆలోచన చేయండి. ఆ డబ్బులన్నీ గ్రామస్థాయిలో మొదలుపెడితే జన్మభూమి కమిటీలు ఆ తరువాత ఆ గజదొంగల ముఠా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు వీళ్లందరికీ బాసు ఆ చంద్రబాబు దోచుకో, పంచుకో, తినుకో.. ఆలోచన చేయండి.. మీ బిడ్డ పరిపాలనకు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఒక్కసారి గమనించండి. 

వచ్చే ఎన్నికల్లో యుద్ధం ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా..? బీసీల తోకలు కత్తిరిస్తాం.. ఇంగ్లిష్‌ మీడియానికి వ్యతిరేకం, పేదల ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వడానికి వ్యతిరేకం అన్న పెత్తందారి పార్టీ చంద్రబాబుకు.. బలహీనవర్గాలను, దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలకు మండల అధ్యక్షుల నుంచి కేబినెట్‌ వరకు రాజకీయ సాధికారతను ఇచ్చి, ప్రతి మాటకు ముందు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా పేదవర్గాలు అని చెప్పి.. చరిత్రలో ఎప్పుడూ, ఎవ్వరూ చేయని విధంగా వారి మీద ప్రేమ చూపిస్తూ నామినేటెడ్‌ పదవుల దగ్గర నుంచి రాష్ట్రంలో పాలించే పదవుల వరకు ప్రతి అడుగులోనూ భాగస్వాములను చేసిన మీ బిడ్డ ప్రభుత్వానికి – చంద్రబాబుకు మధ్య యుద్ధం జరుగుతుంది. 

ఈరోజు యుద్ధం జరుగుతుంది కులాల మధ్య కాదు.. రాష్ట్రంలో జరుగుతుంది క్లాస్‌ వార్‌. పేదవాడు ఒకవైపు, పెత్తందార్లు మరోవైపు ఉన్నారు. పొరపాటు జరిగిందంటే రాజకీయాల్లో ఇక ఎవ్వరూ మాట ఇవ్వడం, మాట మీద నిలబడటం అనేదానికి అర్థమే లేకుండా పోతుంది. పొరపాటు జరిగితే.. పేదవాడు ఎక్కడా లేకుండా మటుమాయం అయిపోయే పరిస్థితి వస్తుంది. రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి.. విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలియాలి. ఒకమాట చెబితే.. ఆ మాట నిలబెట్టుకోలేకపోతే, రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదు అనే పరిస్థితి మళ్లీ రావాలి. 

నేను గర్వంగా చెప్పగలుగుతున్నా.. ఇచ్చిన మేనిఫెస్టోలో 98.5 శాతం హామీలను నెరవేర్చి.. మీ బిడ్డ మిమ్మల్ని ఓటు అడగటానికి ముందుకొస్తున్నాడు. మీ బిడ్డ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గడప గడపకు తిరుగుతున్నారు. మేనిఫెస్టో చూపించి అక్కా ఇవన్నీ జరిగాయా అని అడుగుతున్నారు. చిక్కటి చిరునవ్వుల మధ్య మీ ఆశీస్సులు తీసుకొని బయల్దేరుతున్నారు. మీ బిడ్డకు ఉన్నది దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు. 

మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు ఉండకపోవచ్చు. మీ బిడ్డ ఏ రోజూ వారిపై ఆధారపడలేదు. మీ బిడ్డ ఆధారపడింది.. ఒక్కటేఒకటి.. మంచి చేశాం. ఆ మంచి జరిగిందని మీకు అనిపిస్తే మీ బిడ్డకు తోడుగా ఉండండి అని మాత్రమే మీ బిడ్డ కోరుతున్నాడు. మీ బిడ్డ ఆధారపడేది దేవుడి దయ మీద, మీ అంద‌రి చల్లని ఆశీస్సుల మీద మాత్రమే ఆధారపడతాడు. అందుకే మీ బిడ్డకు భయం లేదు. అందుకే మీ బిడ్డ 175కు 175 నియోజకవర్గాలు టార్గెట్‌ అని ముందుకు అడుగులు వేస్తున్నాడు. మీ బిడ్డకున్న ధైర్యం వాళ్లెవ్వరికీ లేదు. 

నేను సవాల్‌ విసురుతున్నా.. చంద్రబాబుకు, దత్తపుత్రుడుకు సవాల్‌ విసురుతున్నా.. 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని సవాల్‌ విసురుతున్నా.. ఆ ధైర్యం వాళ్లకు లేదు. కారణం ఏంటంటే.. ఏ రోజూ వారి జీవితాల్లో వారు ప్రజలకు చేసిన మంచి లేదు కాబట్టే వారికా ధైర్యం లేదు. 

మీ బిడ్డకు ఆధైర్యం ఉంది.. కారణం మంచి చేశాం కాబట్టి.. ఆ మంచి చెప్పుకొని మీ బిడ్డ మళ్లీ అధికారంలోకి వస్తాడనే నమ్మకం, ధైర్యం మీ బిడ్డకు ఉంది. ఇదీ మీ బిడ్డకు, వాళ్లకున్న తేడా.. ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో కుట్రలు ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి.. రాజకీయాల్లో అన్యాయాలు ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి.. అన్నీ గమనించండి. నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచన చేసి తీసుకోండి. కేవలం మీ ఇంట్లో మంచి జరిగిందా.. లేదా.. అన్నదే ప్రామాణికంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా తోడుగా నిలబడండి అని అడుగుతున్నా.. 

Back to Top