పర్యాటకుల భద్రత కోసమే టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లు

టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

యాత్రికులు నిర్భయంగా పర్యాటక ప్రదేశాల్లో గడిపేలా ఇవి ప‌నిచేస్తాయి

20 పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశాం

పోలీస్‌ శాఖలో అనేక సంస్కరణలకు మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది

టూరిస్ట్‌ పోలీస్‌స్టేషన్‌ కూడా గొప్ప సంస్కరణగా నిలబడుతుంది

దిశ యాప్‌ ద్వారా అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం

దాదాపు 1.20 కోట్ల డౌన్‌లోడ్స్‌.. ఈ యాప్‌ ద్వారా 6 వేల మందిని మంచి జరిగింది

గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నాం 

టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లలో పనిచేసే సిబ్బందికి ‘ఆల్‌ ది బెస్ట్‌’

తాడేపల్లి: ‘‘పోలీస్‌ శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. పోలీసులు మీ స్నేహితులు అనే భావన తీసుకురాగలిగాం. పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేశాం. ఇది పోలీస్‌ శాఖలో మరో సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుంది. మన ప్రభుత్వం చేస్తున్న అనేక సంస్కరణల్లో టూరిస్ట్‌ పోలీస్‌స్టేషన్‌ కూడా గొప్ప సంస్కరణగా నిలబడుతుంది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు, ప్రముఖ దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. అంతకుముందు యాత్రికులు, పోలీస్‌ శాఖను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.

సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగం..
‘పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మరోమంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. పోలీస్‌ శాఖలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా, గతానికి భిన్నంగా ఎన్నెన్నో మంచి సంస్కరణలు అమలవుతున్నాయి. ఎప్పుడూ చూడని విధంగా గ్రామస్థాయిలోనే మహిళా పోలీసులు సచివాలయాల ద్వారా అందుబాటులోకి వచ్చారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. పోలీస్‌ స్టేషన్లలోకి వెళ్లినప్పుడు అక్కడ ప్రవర్తించే తీరు, రిసెప్షన్‌ గతానికి, ఇప్పటికీ విపరీతమైన తేడా కనిపించేలా.. పోలీసులు మీ స్నేహితులు అని చెప్పే భావన కల్పిస్తూ రిసెప్షనిస్టులను కూడా నియమించాం. ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారికి తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతుంది. 

గతంలో ఎప్పుడూ లేనట్టుగా దిశ యాప్‌ను 1.20 కోట్ల పైచిలుకు మంది డౌన్‌లోడ్‌ చేసుకొని రిజిస్ట్రర్‌ అయ్యారు. సెల్‌ఫోన్‌లో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే పోలీసులు, ప్రభుత్వమే మీకు అన్నగా, తమ్ముడిగా ఉంటుందనే భరోసా కల్పించాం. ఆపదలో ఉన్నప్పుడు 5సార్లు ఫోన్‌ షేక్‌చేసినా, ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కినా 10 నిమిషాల్లోపే పోలీసులు ఆ మహిళ దగ్గరికి చేరుకుంటారు. ఎస్‌ఓఎస్‌ లేదా ఫోన్‌ షేక్‌ చేసిన 5–10 సెక్షన్ల వ్యవధిలో పోలీసుల నుంచి ఆ మహిళకు ఫోన్‌ వెళ్తుంది. ఫోన్‌ రిప్లయ్‌ చేయకపోతే వెంటనే ఆ స్థలానికి వెళ్లి తోడుగా నిలబడుతున్నారు. ఇలా దాదాపు 6 వేల మందికి మంచి జరిగింది.గతంలో ఎప్పుడూ జరగని విధంగా పోలీస్‌ శాఖలో మార్పులు కనిపిస్తున్నాయి. 

పోలీస్‌ శాఖలో సంస్కరణల్లో భాగంగా 20 పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశాం. ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా ఈరోజు మార్పులు జరుగుతున్నాయి. పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే వారి భద్రత కోసం ప్రత్యేకంగా దాదాపు 20 లొకేషన్లను గుర్తించి, ఆ ప్రదేశాల్లో కియాస్క్‌లను పెట్టి, ఆ ప్రదేశాల్లోపెట్టిన కియాస్క్‌లు స్థానిక పోలీస్‌స్టేషన్లతో అనుసంధానమై ఉన్నాయి. స్థానిక పోలీస్‌ స్టేషన్లకు 20 అదనపు పోలీస్‌స్టేషన్లుగా పర్యాటక ప్రాంతాల్లో స్టేషన్లు పనిచేస్తాయి. ప్రతి కియాస్క్‌లో దాదాపు 6మంది సిబ్బంది, అందులో 8 గంటల షిఫ్ట్‌లో ఇద్దరు, 12 గంటల షిఫ్ట్‌ డ్యూటీలో ముగ్గురు పనిచేసే విధంగా రూపకల్పన చేశాం. వీరిని పర్యవేక్షించేందుకు ఎస్‌ఐ, ఏఎస్‌ఐ స్థాయి అధికారిని నియమించాం. 

వీరికి సంబంధించి ప్రత్యేకంగా టెలిఫోన్‌ నంబర్‌ కేటాయించాం. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే పోలీస్‌ సోదరుడు మీకు అండగా నిలబడినట్టే అనే భావన కల్పించేలా, దిశ యాప్‌ ఎలా డౌన్‌లోడ్‌ చేయాలో చెప్పే కరపత్రాలను కియాస్క్‌లో అందుబాటులో ఉంచాం. టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లలో పనిచేసే సిబ్బందికి ప్రత్యేకమైన టెలిఫోన్‌ నంబర్, రేడియో సెట్, ఫస్ట్‌ఎయిడ్‌ బాక్స్, ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాప్, ఎమర్జెన్సీ టెలిఫోన్‌ నంబర్, వెహికిల్స్‌ అన్నీ ఇచ్చాం. ఆయా ప్రాంతాల్లో ఉన్న పర్యాటకులు, భక్తులకు ఎలాంటి భయాలు లేకుండా పుణ్యస్నానాలు, పర్యాటక ప్రదేశాల్లో గడిపేందుకు ఒక భరోసా ఇస్తూ టూరిస్ట్‌ పోలీస్‌స్టేషన్లు పనిచేయడం మొదలుపెడతాయి. ఇవన్నీ మహిళల భద్రత పట్ల, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదనే తపనతో అడుగులు ముందుకు వేశాం. ఇది పోలీస్‌ శాఖలో మరో సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుంది. మన ప్రభుత్వం చేస్తున్న అనేక సంస్కరణల్లో టూరిస్ట్‌ పోలీస్‌స్టేషన్‌ కూడా గొప్ప సంస్కరణగా నిలబడుతుంది. స్టేషన్లలో పనిచేసే సిబ్బందిలో సగం మంది పురుషులు, మిగతా సగం మంది మహిళలు ఉంటారు. దీని వల్ల ఆడవారు ఎవరైనా కియాస్క్‌లోకి వెళితే ఒక మహిళా పోలీస్‌ తోడుగా నిలబడుతుంది. 

పర్యాటకులకు అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ. పోలీస్‌ స్టేషన్లలో పనిచేసే ప్రతి ఒక్కరూ సేవా, అంకితభావంతో పనిచేయాలని కోరుకుంటున్నాను. నా తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి మనసారా ఆల్‌ ది బెస్ట్‌ తెలియజేస్తున్నాను'.  

Back to Top