మధ్యతరగతి ప్రజలకు మంచిచేయాలనే సంకల్పం

‘జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్స్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం

మార్కెట్‌ రేట్ల కంటే తక్కువకే క్లియర్‌ టైటిల్‌తో ఎంఐజీ ప్లాట్లు

సంవత్సరంలో నాలుగు వాయిదాల్లో నగదు చెల్లించే వెసులుబాటు

ప్రతి నియోజకవర్గ కేంద్రంలో స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌..మూడు కేటగిరీల్లో స్థలాలు 

లేఅవుట్‌ డెవలప్‌మెంట్‌ కోసం కార్పస్‌ ఫండ్‌ సైతం ఏర్పాటు

ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం.. లేఅవుట్లలో 10 శాతం ప్లాట్లు, 20 శాతం రిబేట్‌

వార్షికఆదాయం రూ.18 లక్షల వరకు ఉన్నవారంతా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు

కంప్యూటరైజ్డ్‌ లాటరీ ద్వారా పూర్తి పారదర్శకతతో ప్లాట్ల కేటాయింపు

సంక్రాంతి పండుగ వేళ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ‘‘ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేయాలనే సంకల్పంతో ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. మొదటి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు చకచకా జరుగుతున్నాయి. మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసేందుకు ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మార్కెట్‌ కంటే తక్కువ ధరకే లిటిగేషన్స్‌కు తావులేకుండా క్లియర్‌ టైటిల్స్‌తో మధ్యతరగతి ప్రజలకు మంచిచేయాలనే సద్దుదేశంతో ప్రభుత్వమే లేఅవుట్లను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేని, వివాదాలకు తావులేని క్లియర్‌ టైటిల్స్‌తో పాటు అన్ని సౌకర్యాలు ఉన్న డెవలప్డ్‌ ప్లాట్లను అందించేందుకు జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ పథకానికి సంక్రాంతి పండుగ వేళలో శ్రీకారం చుడుతున్నామని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. 

మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవలూరు, వైయస్‌ఆర్‌ జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో లేఅవుట్‌లు చేసి నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. లేఅవుట్లతో పాటు దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. అంతకు ముందు ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

మధ్య తరగతి కుటుంబాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేఅవుట్లలో మూడు కేటగిరిలలో స్థలాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎంఐజీ 1 కింద 150 గజాలు, ఎంఐజీ 2 కింద 200 గజాలు, ఎంఐజీ 3కింద 240 గజాలు ప్రతి లేఅవుట్‌లో మూడు రకాల ప్లాట్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాం.  

ఆరు జిల్లాలే కాకుండా మిగతా అన్ని జిల్లాలు కాకుండా.. ప్రతి నియోజకవర్గంలో ఈ పథకం రాబోయే రోజుల్లో విస్తరిస్తుంది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మధ్య తరగతి కుటుంబాలకు మంచి జరుగుతుంది. స్మార్ట్‌టౌన్స్‌లో ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవాలని అనుకునేవారి కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించాం. ఆ వెబ్‌సైట్‌ను ఈరోజు ప్రారంభిస్తా. https://migapdtcp.ap.gov.in/ వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంటుంది. 

రూ.18 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారంతా జగనన్న స్మార్ట్‌ టౌన్స్‌ ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మీరున్న ప్రాంతంలోనే స్మార్ట్‌ టౌన్స్‌లో స్థలాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్థలాలకు అయ్యే డబ్బును ఒక సంవత్సరంలో నాలుగు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. చెల్లింపు పూర్తయిన వెంటనే డెవలప్‌ చేసిన స్థలాన్ని అందించడం జరుగుతుంది. 

ఇంటి ప్లాట్ల కోసం దరఖాస్తు  చేసుకునేవారు ఆ ప్లాట్‌ నిర్ణిత విలువలో 10 శాతం ముందుగా చెల్లించాలి. అగ్రిమెంట్‌ చేసుకున్న నెలలోపు 30 శాతం, ఆరు నెలల్లోపు మరో 30 శాతం, 12 నెలల్లోపు లేదా రిజిస్ట్రేషన్‌ తేదీలోపు ఏదిముందైతే అది ఆ తేదీలోపు మిగిలిన 30 శాతం కూడా చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి స్థలానికి సంబంధించిన పట్టాలు అందజేస్తారు. వాయిదాలు కాకుండా ముందుగానే పూర్తి డబ్బు చెల్లించేవారికి 5శాతం రాయితీ కూడా ఇస్తారు.

పీఆర్సీ ప్రకటన సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ప్రతి లేఅవుట్‌లో 10 శాతం ప్లాట్లు 20 శాతం రిబేట్‌తో ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. 

జగనన్న స్మార్ట్‌ టౌన్స్‌లో పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా పట్టణ ప్రణాళిక విభాగం నియమ నిబంధనలకు లోబడి ఏడాదిలో సమగ్ర లేఅవుట్‌ అభివృద్ధి చేయడం జరుగుతుంది. నిబంధనలు పూర్తిగా పాటించడం జరుగుతుంది. మోడల్‌ లేఅవుట్‌ ఏ మాదిరిగా చేయగలుగుతామనేది మిగిలిన రియల్‌ ఎస్టేట్‌ వారందరికీ ఇదొక ఆదర్శంగా నిలుస్తుంది. 

దరఖాస్తు చేసుకున్న వారికి స్థల కేటాయింపులో పూర్తి పారదర్శకత ఉంటుంది. ఎక్కడా కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీలు చూడం.. చాలా పారదర్శకతతో కంప్యూటరైజ్డ్‌ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపులు జరుగుతాయి. ఎక్కడా ఎవరి ప్రమేయం ఉండదు. స్మార్ట్‌ టౌన్స్‌ను ప్రభుత్వమే లేఅవుట్‌ చేస్తుంది కాబట్టి కుటుంబ అవసరాలను బట్టి 150, 200, 540 గజాల స్థలాలు ఎంచుకునే వెసులుబాటు లబ్ధిదారుడికి ఉంటుంది. పర్యావరణహితంగా ఉండేలా లేఅవుట్ల విస్తీర్ణంలో 50 శాతం స్థలం కాలనీ నివసించేవారి ఉమ్మడి అవసరాలు.. పార్కులు, స్కూళ్లు, ప్లేగ్రౌండ్స్, బ్యాంకులు, షాపింగ్‌ రీక్రియేషన్‌ సదుపాయల వంటి వాటికోసం స్థలాలు కేటాయిస్తారు. అంతేకాకుండా విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్‌ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు, ఎవెన్యూప్లాంటేషన్స్‌ ఉంటాయి. ఇవేకాకుండా మంచినీటి సరఫరా, అండర్‌ గ్రౌండ్‌డ్రైనేజీ, వరద నీటి డ్రైన్స్‌కు కూడా ఈకాలనీల్లో అన్ని రకాల ఏర్పాటు చేస్తారు. కరెంట్‌ వీధి దీపాలతో కూడిన నాణ్యమైన మౌలిక సదుపాయలు కచ్చితంగా ఉంటాయి. 

పథకం రూపొందించేటప్పుడు మంత్రికి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీకి ఇద్దరికీ క్లియర్‌గా చెప్పాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా ఎవరూ వేలెత్తిచూపే పరిస్థితి ఉండకూడదని, బ్రహ్మాండంగా లేఅవుట్లు ఉండాలని క్లియర్‌గా చెప్పాను. లేఅవుట్‌లోని కాలనీ నిర్వహణ కోసం కార్పస్‌ ఫండ్‌ కూడా ఏర్పాటు చేసి.. ప్లాట్ల ఓనర్స్‌ అసోసియేషన్స్‌కు, పట్టణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహించేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. మంచి లేఅవుట్‌లు రావాలని, మధ్య తరగతి కుటుంబాలకు దీనివల్ల మంచి జరగాలని, తక్కువ ధరలకు స్థలాలు అందుబాటులోకి వస్తే.. మార్కెట్‌లో పోటీతత్వం వస్తుంది. మిగిలిన లేఅవుట్స్‌ వేసేవారు కూడా రేట్లు తగ్గించక తప్పనిపరిస్థితి ఉంటుంది. క్వాలిటీ లేఅవుట్లు, క్లియర్‌ టైటిల్స్‌ అందుబాటులోకి వస్తాయి. మధ్య తరగతి ప్రజలకు మంచి జరగాలని గొప్ప కార్యక్రమానికి దేవుడి దయతో శ్రీకారం చుడుతున్నాం. ప్రజలందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఎంఐజీ ప్లాట్లతో మంచి జరగాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top