వైయ‌స్‌ జగన్ అభినంద‌న‌ల వెల్లువ‌

వైయ‌స్ జగన్‌ సీఎం అవుతారని పార్టీ స్థాపించినప్పుడే చెప్పా: మోహన్‌బాబు

ఈ మాట ఇప్పుడు చెబితే అతిశయోక్తి అనుకుంటారేమో. జగన్‌ పార్టీ పెట్టినప్పడే ఆంధ్రప్రదేశ్‌కి కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పా. తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని నాకు తెలియదు కానీ తను(జగన్‌) కచ్చితంగా సీఎం అవుతాడని చెప్పా. జగన్‌ పట్టు వదలని విక్రమార్కుడు. తనలో ఓ కసి, కృషి, పట్టుదల చూశా. వీటన్నిటికీ మించి నేను సాధించగలను అనే నమ్మకం తనలో కనిపించేది. ‘‘నా ప్రయాణంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ప్రవాహాలు వచ్చినా నా దారి, ధ్యేయం ఒకటే. ఆంధ్రప్రదేశ్‌ బాగుండాలన్నదే నా పట్టుదల’’ అని అనుకున్నాడు జగన్‌. తన న్యాయమైన కోరికకు భగవంతుడు, ముఖ్యంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులు, తల్లి విజయమ్మ దీవెనలు అన్నిటికీ మించి ప్రజల ఆశీస్సులతోపాటు జగన్‌ టీమ్‌ కృషి ఫలితమే ఈ విజయం. శ్రీకాకుళం నుంచి వైజాగ్, చిత్తూరు వరకు నేను కూడా ప్రచారం చేశా.

130 సీట్లు సాధించి జగన్‌ ముఖ్యమంత్రి అవుతాడని అప్పుడే చెప్పా.  అలాగే జగన్‌ 3,648 కిలోమీటర్లు నడిచాడంటే చిన్న విషయం కాదు. నా నట జీవితం 44 సంవత్సరాలు. అంతకుముందు, నాకు ఊహ తెలిశాక కూడా అన్ని  కిలోమీటర్లు నడిచిన మానవుడు ఎవరూ లేరు. అన్ని కిలోమీటర్లు నడవడం మానవ సాధ్యమా? వాస్కోడిగామా సముద్ర మార్గంలో వచ్చి ఇండియాను కనుక్కున్నాడు. స్వాతంత్య్ర పోరాటం టైమ్‌లో వినోబా భావే ఇండియా మొత్తం తిరిగి ఐక్యం చేయాలనుకున్నాడు. ఇవన్నీ నిజాలే. చరిత్రలో చెరిగిపోని నిజాలు. నా దృష్టిలో జగన్‌ కూడా అంత గొప్ప వ్యక్తి. పాదయాత్రలో ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నాడు జగన్‌.

హీరోలకే హీరో : జయసుధ
వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలని కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న 95 ›శాతం మంది ఆయనకు మద్దతు పలికారు. ఆ టైమ్‌లో జగన్‌కు, రాజకీయాలకు అసలు సంబంధమే లేదు. ఆయనో సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌ అంతే. కానీ రాజశేఖరరెడ్డి గారి కోసం, ఆయన మీద అభిమానంతో ఓటేసిన ప్రజల కోసం ఆయన ముందుకు వచ్చారు. ఆ టైమ్‌లో ఆందరితోపాటు నేను కూడా ఆయనకు మద్దతు తెలిపా. ఎన్ని పెద్ద తలకాయలు ఎదురు నిలిచినా ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర మొదలు పెట్టాడు. ఎంత రాజకీయ కుటుంబంలో పుట్టినా ఇంతమందికి ఎదురు నిలబడి గెలుస్తాడా? నిలుస్తాడా? అని సహజంగానే సందేహాలు తలెత్తాయి.

అలా అనుకున్నవాళ్లందరి నోర్లను జగన్‌ తన విల్‌ పవర్‌తో మూయించాడు. కొందరు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తే వెళ్లిపోతాడనుకున్నారు. కానీ ఎంత ఇబ్బందులపాలు చేస్తే అంత గట్టిగా తయారయ్యాడు జగన్‌. దేశ చరిత్రలో జగన్‌ పాదయాత్ర ఓ రికార్డుగా మిగిలిపోతుంది. రాబోయే రోజుల్లో యువతరానికి ఒక ఐకాన్‌లా నిలుస్తాడు. సినిమాల్లో మనం అనేక కథలు చూస్తుంటాం. ‘స్టాలిన్‌’,  ‘భరత్‌ అనే నేను’ సినిమాలు చూశాం. ఇవన్నీ సినిమాలకే కాదు నిజంగా కూడా సాధ్యమే అని జగన్‌ తన గెలుపుతో నిరూపించాడు. హీరోలకే  హీరో.. నిజమైన హీరో జగన్‌.

ఏపీకి శుభారంభం : జయప్రద
ఎన్నో రోజుల తర్వాత ప్రజలకి అద్భుతమైన సమయం వచ్చింది. శుభారంభం ఇది. దివంగత నేత మన వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పేదవాళ్లను నేనున్నానంటూ అక్కున చేర్చుకుని వారి కన్నీళ్లు తుడిచేవారు. వైఎస్‌గారి దగ్గర నుంచి జగన్‌ రాజకీయంగా చిన్నప్పటి నుంచి ఎంతో నేర్చుకొని ఉంటారు. ఏపీని బాగా అభివృద్ధి చేయాలని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏపీని కేంద్ర బిందువుగా చేయాలనే తపన జగన్‌లో కనిపించేది. చంద్రబాబునాయుడి ధాటిని ఎదుర్కొంటూ ఒక సమర్థవంతమైన ప్రతిపక్ష నాయకునిగా నిలబడి ప్రజల కష్టాలు, కన్నీళ్లు తనవి అనుకుంటూ ప్రజల పక్షాన న్యాయం కోసం పోరాడినది ప్రజలు మరచిపోలేరు. ప్రజల మధ్యనే ఉంటూ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. దాదాపు 10ఏళ్లుగా ప్రజల మధ్యలోనే ఉంటూ తన కుంటుంబాన్ని, తన వాళ్లకి దూరంగా ప్రజల మనిషిగా అయిపోయి ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని వారి నుంచి సమస్యలు తెలుసుకున్నారు. 2019 ఎన్నికల సమరంలో తన విజయ దుందుభి మోగించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న ఈ సమయంలో జగన్‌బాబుకి నా అభినందనలు, శుభాకాంక్షలు.

దేవుడికి బిడ్డ...ప్రజలకు అన్న...
నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి  

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొలిటికల్‌ ట్రావెల్‌ నార్మల్‌గా ఉండి ఉంటే నిదానంగా ఎప్పటికో ముఖ్యమంత్రి అయ్యేవారు. ఆయన్ను అణిచి అణిచి, తొక్కి తొక్కి పడేయాలనుకున్నారు చంద్రబాబునాయుడు. ‘జగన్‌ అనే వ్యక్తి మనిషే కాదు రౌడీ, గుండా, అవినీతిపరుడు’ అని ఇంటర్నేషనల్‌గా ప్రచారం చేసి, వ్యవస్థలను మ్యానేజ్‌ చేసి ఆయన్ను జైలుకు పంపించారు. జగన్‌ జైలు నుంచి బయటకు రాగానే కంగారుపడి మళ్లీ జైల్లో పెట్టించాలనే ప్రయత్నం చేశారు. అది మిస్‌ఫైర్‌ అయింది. లోపల జరిగేవన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. కళ్ల ముందు కనిపించేవన్నీ ప్రజలు చూశారు. ఈ అన్యాయం చూడలేక జగన్‌ను దేవుడు తన బిడ్డగా చూసుకున్నాడు. ప్రజలందరూ అన్నగా భావించారు. కుల, మత, జాతి అనే బేధం లేకుండా జగన్‌కు ఓటు వేసేశారు. ఈ క్రెడిట్‌ అంతా జగన్‌ది, అతని వెనకున్న ప్రజలది. జనం ఎందుకు జగన్‌ని ప్రేమించారంటే.. అతని సిన్సియారిటీ, డెడికేషన్, నడత, నడక.. ఇలా ప్రతి కదలికలోనూ వాళ్లందరూ అతనిలో ఓ బిడ్డను చూసుకున్నారు. అయితే ఏదైనా డబ్బులతో కొనొచ్చు అని చంద్రబాబు అనుకున్నారు. కానీ, ప్రజలను ప్రేమతో చూసే జగన్‌కు ఓట్లు వేశారు. ఇప్పటి వరకూ జగన్‌ గొప్ప లీడర్‌. రేపటి నుంచి గొప్ప ప్రజా సేవకుడిలా ఉండిపోవాలని ఆశిస్తున్నాను. గాడ్‌ బ్లెస్‌ హిమ్‌. జై జగన్‌.

జగన్‌ను చూసి మా జీవితాలను మార్చుకున్నాం
ఈ విజయం మేం ఊహించిందే. మా నాయకుడు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి దాదాపు 14 నెలల పాటు కుటుంబానికి దూరంగా ఎండనకా వాననకా ఎన్నో కష్టాలు పడ్డారు. ఆఖరికి పదునైన కత్తి రూపంలో ఆయన ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నించింది. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే మే నెలలో 175వ రోజు పాదయాత్రలో పాలకొల్లు దగ్గర వీరమాపురం మండలంలో నేను కూడా ఆయన వెంట నడిచా. రోహిణి కార్తెలో ఆయనతోపాటు సుమారు 6 కిలోమీటర్లు నడిచేసరికి నావల్ల కాలేదు. ఆ ఎండలో ఆయన నడుస్తుంటే మహిళలు, వృద్ధులు బారులు తీరారు. వారి కష్టసుఖాలు స్వయంగా తెలుసుకున్నారు. ఆ ఓపిక, మడమతిప్పని నైజం ప్రపంచంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారికి, వైఎస్‌ జగన్‌గారికి మాత్రమే ఉంది. ఇది అతిశయోక్తి కాదు. జగన్‌ను సీఎం చేయాలని సంవత్సరం క్రితమే ప్రజలు నిర్ణయించుకున్నారు. జగన్‌ను చూసి మా జీవితాలను కూడా చాలా మార్చుకున్నాం.
- సినీ నటుడు పృథ్వీరాజ్‌

ఏదో చేయాలనే తపన జగన్‌లో కనిపిస్తోంది
జగన్‌ తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగానే నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా మాట్లాడటాన్ని చూస్తే సీఎంగా రాష్ట్ర ప్రజలకు ఏదో చేయాలనే తపన అతనిలో కనిపించింది. దాని వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అఖండ విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు జగన్‌ కమిట్‌మెంట్‌తో చేస్తారనే నమ్ముతున్నారు. తండ్రి మాదిరి మాట ఇస్తే వెనకడుగు వేయని మనస్తత్వం జగన్‌ది. గోల్‌ సాధించే వరకు అలుపెరగని పోరాట పటిమ, కమిట్‌మెంట్, రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర ద్వారా ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగహన పెంచుకోవడం జగన్‌కు కలిసి వచ్చే అంశం. పారదర్శకతతో కూడిన అవినీతిరహిత పాలనను అందిస్తానని జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఢిల్లీలో చేసిన ప్రకటన చాలా సంతోషదాయకం. ‘ఇండియాటుడే’ వంటి మీడియా సంస్థలతో జగన్‌ మాట్లాడిన తీరు భవిష్యత్‌ పాలనపై అతని వైఖరికి అద్దంపడుతోంది.

పోలవరం ప్రాజెక్టులో నిర్మాణవ్యయం పెంపు, ప్రాజెక్టు అథారిటీ అనుమతి తీసుకున్నారా?, కేబినెట్‌ ఆమోదం ఉందా? వంటి అంశాలపై క్షేత్రస్థాయి వాస్తవాలు తెలిసిన అధికారులతో జగన్‌ మాట్లాడాలి. పోలవరంలోకి జూలైలో వరద నీళ్లు చేరుతాయని అధికారులే చెబుతున్న పరిస్థితుల్లో జగన్‌ ముందు జాగ్రత్త చర్యలపై శ్రద్ధ తీసుకోవాలి. కేంద్రం నుంచి రాజ్యాంగబద్ధంగా మనకు రావలసిన అంశాలపై జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడున్న పంథానే కంటిన్యూ చేసి రాష్ట్రానికి మంచి జరిగేటట్టు చూడాలి. మునుపెన్నడూ లేని రీతిలో జగన్‌మోహన్‌రెడ్డి రికార్డు స్థాయిలో ఓట్లు తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. చిన్న తప్పు దొర్లినా, పెద్దదిగా చూపే ప్రయత్నాలు జరుగుతాయనే విషయాన్ని గుర్తెరిగి నిర్ణయాలు తీసుకుంటుండాలి. మద్యపానంతో వచ్చే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కలిపించాలి.
 – ఉండవల్లి అరుణ్‌కుమార్,  మాజీ ఎంపీ, రాజమండ్రి  

సుపరిపాలన ఫలాలు ప్రజలు అందుకుంటారు
‘నీతివంతమైన, పారదర్శక పాలనను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రజలు త్వరలోనే రుచి చూడనున్నారు. కొత్త యుగం, కొత్త శకం జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఆరంభం కానుంది. సుపరిపాలన ఫలాలను ప్రజలు అనుభవించే రోజులు వచ్చేశాయి. చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం నెలలు, ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే రోజులు ఇక ఉండబోవు. గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసే కసరత్తు తక్షణమే ఆరంభం కానుంది.  ప్రజల బాగోగుల కోసం నిత్యం తపన పడే జగన్‌ ప్రభుత్వంలో అవినీతి రహిత పాలనను ప్రజలు ప్రత్యక్షంగా చూడనున్నారు. అవినీతి రహిత సుపరిపాలన ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు త్వరలోనే అర్థమవుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ రైతులకు అన్యాయం జరిగింది. నేడు రైతు సంక్షేమ సర్కారు వచ్చింది. అన్నదాతల బాగోగులు లక్ష్యంగా పనిచేయనుంది. దారుణంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని క్రమంగా సరిదిద్ది, ప్రజలకు మంచి పాలన ఇచ్చే దిశగా అడుగులు వేయనున్నారు. సంక్షేమం, అభివృద్ధి, పారదర్శకత, నిజాయతీ అనే నాలుగు చక్రాల ధర్మ రథ పాలనను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చూడనున్నారు.  
  – అజేయకల్లాం, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

సామాజిక న్యాయానికి పెద్ద పీట వేయాలి
వైఎస్‌ విజయం బడుగు, బలహీన వర్గాల విజయం. ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి, రాష్ట్రంలోని ఏ మూల ఏ సమస్య ఉందో క్షుణ్ణంగా అధ్యయనం చేసి జీర్ణించుకున్న వైఎస్‌ జగన్‌ మహానాయకుడనడంలో సందేహంలేదు. జగన్‌పై పలు సామాజికవర్గాలు ఎన్నో ఆశలు పెంచుకున్నాయి. వారి ఆకాంక్షల్ని నెరవేర్చేలా జగన్‌ అడుగులు వేయాలి. చంద్రబాబు పోతూపోతూ రాష్ట్ర ఖజానాను దివాళా స్థితికి తీసుకువెళ్లారు. అందువల్ల జగన్‌ కొత్త ఆర్థిక వనరులను సృష్టించుకోవాల్సి ఉంది. ప్రజాభిష్టాన్ని నేరవేర్చాలంటే ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం జగన్‌ ముందున్న పెద్ద సవాల్‌ ఇది. సమాజంలో మార్పు కోసం ముందు విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలి. విద్యా రంగంలోని వ్యాపారవేత్తలను తొలగించి విద్యా సంస్థలను జాతీయం చేయాలి. వ్యవసాయ రైతులకు జగన్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలని లక్షలాది మంది కోరుకుంటున్నారు.     
– హైకోర్టు మాజీ తాత్కాలిక న్యాయమూర్తి, అఖిల భారత బీసీ సమాఖ్య అధ్యక్షుడు జస్టిస్‌ ఈశ్వరయ్య

ఆదర్శవంతమైన పాలన అందించాలి
వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశం మొత్తానికి ఆదర్శవంతమైన పాలన అందించాలని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై జగన్‌ సుధీర్ఘంగా పోరాడారని అందుకే ప్రజల మన్ననలు పొంది ఎన్నికల్లో ఘన విజయం సాధించారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎంగా వైఎస్‌ జగన్‌ దేశానికే దిక్సూచి లాంటి సమర్థవంతమైన పాలన అందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
– జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి

వైయ‌స్‌ జగన్‌ది ఇచ్చిన మాటకు నిలబడే తత్వం  
ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాటకు నిలబడే తత్వం వైఎస్‌ జగన్‌ది అని ఉమ్మడి ఏపీ మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.రామచంద్రరావు అన్నారు. పాదయాత్ర ద్వారా జగన్‌ ప్రజల మనసులో నిలిచిపోయారని అందుకే ప్రజలు ఆయనకు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. నేరుగా ఏపీలోని రెండున్నర కోట్ల మందిని కలిసేలా చేసిన పాదయాత్ర చరిత్రలోనే ఎక్కడా లేదని చెప్పారు. ఇచ్చిన హామీల్ని అమలు చేసేందుకు చాలా బాగా కష్టపడాలని జగన్‌కు సూచించారు. ప్రభుత్వ హామీలతో ప్రజల నుంచి బాండ్లు స్వీకరించి హామీల్ని అమలు చేస్తే అత్యుత్తమ సీఎంగా జగన్‌ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.   
– ఎస్‌.రామచంద్రరావు, ఉమ్మడి ఏపీ మాజీ ఏజీ

యువతకు భరోసా ఇచ్చే పాలన అందించాలి  
యువతకు భరోసా ఇచ్చే పాలనను వైఎస్‌ జగన్‌ అందించాలని తెలంగాణ తొలి పూర్వపు ఏజీ కె.రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్‌ అధికారంలోకి రావడానికి ప్రధానంగా 18–21 ఏండ్ల యువతే కీలకమని చెప్పారు. జగన్‌ను ఎలాగైనా అధికారంలోకి రానీయకూడదని అనేక పథకాల్ని అమలు చేసినా, ఎన్నో హామీలు ఇచ్చినా, మరెన్నో ఇబ్బందులకు గురిచేసినా ప్రజలు మాత్రం జగన్‌కే పట్టం కట్టారన్నారు. ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని జగన్‌ చక్కదిద్దుతారనే ఆశాభావాన్ని రామకృష్ణారెడ్డి వ్యక్తం చేశారు.   
– కె.రామకృష్ణారెడ్డి, తెలంగాణ తొలి పూర్వపు ఏజీ

 

తాజా ఫోటోలు

Back to Top