చంద్రబాబుకు బీసీలు బైబై 

పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

 వైయ‌స్ జ‌గ‌న్ కు వెన్నుదన్నుగా నిలుస్తోన్న బీసీలు 

 14 ఏళ్ళు సీఎంగా పనిచేసి బీసీలకు ఏం చేశాడో బాబు చెప్పాలి
 
బీసీలను ఓట్లేసే యంత్రాల్లా చూసిన చంద్రబాబు
 
బీసీ డిక్లరేషన్లో చెప్పింది తూచ తప్పకుండా అమలు చేస్తున్నాం
 
చంద్రబాబు ఏనాడైనా బీసీలను రాజ్యసభకు పంపాడా..?
 

తాడేప‌ల్లి:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకు బీసీలు బైబై చెబుతున్నార‌ని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు.  చంద్రబాబు బీసీలను ఓట్లేసే యంత్రాల్లా వాడుకున్నాడు. అన్ని కులాల వారికీ వెన్నుపోటు పొడిచాడ‌ని మండిప‌డ్డారు. ఇప్పటికీ ఎన్టీఆర్‌ హయాంలో బీసీలకు మేలు చేశాం అని చంద్రబాబు అంటాడు తప్ప తన హయాంలో ఏం చేశాడో మాత్రం చెప్పలేడు. బీసీలను రాజ్యసభకు పంపిన ఘనత మా నాయకుడు శ్రీ వైయ‌స్‌ జగన్‌దే. బీసీ డిక్లరేషన్లో చెప్పింది తూచ తప్పకుండా అమలు చేస్తున్న ప్రభుత్వం మాది. ఇదంతా చంద్రబాబుకు అర్ధమై తనవాళ్లు ఉన్న ప్రాంతాల్లో తిరుగుతూ..లాస్ట్‌ చాన్స్‌ అంటూ ప్రాధేయపడుతున్నాడని ధ్వ‌జ‌మెత్తారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు.

 బీసీలకు వెన్నుదన్నుగా శ్రీ వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం 
    జయహో బీసీ మహాసభను ధైర్యంగా పెడుతున్నామంటే బీసీలు మా నాయకుడికి ఎంత వెన్నుదన్నుగా ఉన్నారో స్పష్టం అవుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలను అట్టడుగువర్గాలకు సైతం అందిస్తున్న ప్రభుత్వం మాది. బీసీ జనాభా గణన చేపట్టి, వారికి సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం మాది. బీసీల గురించి చంద్రబాబుకు మాట్లాడే అర్హతే లేదు. బీసీలను మోసం చేసిన చంద్రబాబుకు వారంతా బైబై చెప్తున్నారు. బీసీల్లోని 139 కులాలను గుర్తించి వారికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, రాజకీయంగా, సామాజికంగా బీసీలకు పెద్ద పీట వేసిన నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్‌. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి బీసీలకు ఏం చేశాడో సమాధానం చెప్పాలి. ఈ మూడున్నరేళ్లలోనే రాష్ట్రంలోని బీసీలందరికీ పెద్ద పీట వేసిన ఘనత మా ప్రభుత్వానిది. 

పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసేది శ్రీ వైయ‌స్‌ జగనే:
    పోలవరం తానే కడతానని కేంద్రం నుంచి నిధులు తీసుకుని దోచుకోవడం దాచుకోవడమే చంద్రబాబు చేశాడు. పోలవరాన్ని ఒక ఏటీఎంలా వాడుకున్నాడని సాక్షాత్తు దేశ ప్రధాని ఒక వేదిక మీద చెప్పారు. ఇలాంటి వాఖ్యలు బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రిపైనా వచ్చి ఉండవు. అయినా చంద్రబాబుకు సిగ్గు, శరం లేదు. డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోవడానికి కారణం కూడా చంద్రబాబే. ప్రాజెక్టు కట్టకుండా, తన వ్యక్తిగత ప్రచారం కోసం బస్సుల్లో పోలవరానికి జనాన్ని తిప్పి భజన చేయించుకున్నాడు. పోలవరాన్ని ఆనాడు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభిస్తే.. నేటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మాత్రమే దాన్ని జాతికి అంకితం చేస్తారు. చంద్రబాబుకు చెప్పుకోడానికి కనీసం ఒక్క పథకం కూడా లేదు.

రాబోయే రోజుల్లో బీసీలకు ఏం చేస్తామో కూడా చెప్తాం:
    ఈ నెల 7వ తేదీన జరిగే జయహో బీసీ మహాసభలో ఇప్పటి వరకు చేసిందేమిటనేది చెప్తూ...చేయబోయేది కూడా మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ చెప్పబోతున్నారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలు బాగుపడాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే.. ఇదేం ఖర్మరా బాబూ అంటూ చంద్రబాబు వీధుల్లోకి వస్తున్నాడు. చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. ధాన్యం సేకరణలో భాగంగా, మా ప్రభుత్వం రైతులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. పంట దళారీల బారిన పడకుండా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసే సంస్కరణలు తీసుకొచ్చాం. దాంతో రైతులు ఆనందంగా ఉన్నారు. 

టీడీపీ మ్యానిఫెస్టో ఎక్కడ బాబూ..?
    ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకు చంద్రబాబు అలవిగాని హామీలన్నీ ఇచ్చారు. ఆ తర్వాత తానిచ్చిన హామీలను కనపడకుండా చేస్తూ మ్యానిఫెస్టోనే వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది చంద్రబాబే. మా నాయకుడు శ్రీ జగన్మోహన్‌ రెడ్డి గారు మాత్రం మ్యానిఫెస్టోనే ఖురాన్, బైబిల్, భగవద్గీత అంటూ చెప్పినవి..చెప్పనివీ అన్నీ అమలు చేస్తూ ఇచ్చిన మాట మీద నిలబడ్డారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు, తన హయాంలో ఇష్టానుసారంగా దోచుకుని దాచుకుని, మళ్లీ దోచుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇదేం ఖర్మరా బాబూ అంటూ ప్రజలు చంద్రబాబును చీత్కరిస్తున్నారు. 

గో బ్యాక్‌ అన్నా చంద్రబాబుకు సిగ్గు లేదు:
    చంద్రబాబులో ఓపిక నశించింది. జగన్మోహన్‌రెడ్డి గారిని ప్రజల నుంచి విడదీద్దామనుకుంటే అతని వల్ల కాదు. జగన్ గారు ప్రతి కుటుంబంతో మమేకం అయ్యి, వారి కుటుంబ సభ్యుడు అయ్యాడని చంద్రబాబు ప్రస్టేషన్లో ఉన్నాడు. ప్రజలు మాత్రం జగన్మోహన్‌ రెడ్డి గారే రావాలని, కావాలని కోరుకుంటున్నారు. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్‌ ధరలను కూడా చంద్రబాబు బాదుడు అంటూ మాపై నిందలు వేస్తున్నాడు. కేంద్రాన్ని విమర్శించే ధైర్యం మాత్రం చంద్రబాబుకు లేదు. రాష్ట్రంలో ధరల నియంత్రణ కోసం ఒక ప్రత్యేక కమిటీని వేసి, నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న ప్రభుత్వం మాది. అయినా ఏదో ఒక రకంగా బురద జల్లాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు. 

 తమను ఎవరో చంపడానికి చూస్తున్నారంటూ చంద్రబాబు, లోకేష్ లు సానుభూతి డ్రామాలు అడుతున్నాడు. వీళ్లు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. తన తండ్రిని చంపినవారిని కూడా చట్టమే చూసుకుంటుంది అని వదిలేసిన మంచి మనిషి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి గారు. అలాంటి కుటుంబంలో పుట్టిన వైఎస్‌ జగన్‌ గారు ప్రజల గురించచే ఆలోచిస్తారు తప్పితే..వీళ్ల గురించి క్షణం కూడా ఆలోచించే సమయం లేదని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Back to Top