రాష్ట్రంలో ఒక్కబడి కూడా మూతపడలేదు

ఈనాడు అసత్య కథనాలపై మంత్రి బొత్స ఆగ్ర‌హం
 

తాడేపల్లి: ప్రభుత్వ పాఠశాలలపై ఎల్లోమీడియా తప్పుడు కథనాలు రాసింద‌ని.. రాష్ట్రంలో ఒక్కబడి కూడా మూతపడలేద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. ఏ పాఠశాల మూతపడిందో చూపించాల‌ని స‌వాలు విసిరారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలపై ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురించిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బొత్స గురువారం మీడియాతో మాట్లాడారు.

దేశ చరిత్రలోనే విద్యారంగంలో సంస్కరణలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. ఈ సంస్కరణలు నూతన విద్యా విధానానికి అనుగుణంగానే సాగుతున్నాయి. 
ప్రతీ ఒక్కరికీ విద్య అందాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. పాఠశాల స్థాయి నుంచి ఉత్తమమైన విద్య అందించడం కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారు. బడి ఎక్కడ మాయమైందో రామోజీరావు చెప్పాలి. చదువుల్లో మీకు గందరగోళం వచ్చింది. ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మీకు గందరగోళానికి గురవుతున్నారు. 

ఈ రాతలన్నీ పట్టుకుని చంద్రబాబు మాట్లాడతాడు. డ్రాప్ ఔట్స్ తగ్గించి పిల్లల్ని బడి బాట పట్టించడానికి అమ్మఒడి పెట్టాము. రాష్ట్రంలో 42,750 స్కూల్స్ ఉన్నాయి. 5,280 స్కూల్స్ మాత్రమే మ్యాపింగ్ చేసాము. సెంట్రల్ స్కూల్స్ విధానం తీసుకుని సబ్జెక్ట్ టీచర్స్‌ను పెట్టాము. ఈ విధానం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి?. కేరళ, గుజరాత్‌కు ధీటుగా ఇక్కడి విద్యార్థులు నిలబడాలని ఇవన్నీ చేస్తున్నాము. చంద్రబాబు విద్యాకానుక ఐటమ్స్ ఇచ్చాడా?. బైజూస్ వల్ల 40 లక్షల మందికి లబ్ది చేకూరుతోంది. 

ప్రభుత్వంపై అవాస్తవ కథనాలను ప్రచురిస్తున్నారు. రాజకీయ లబ్దికోసం లేనిది ఉన్నట్టుగా చూపించే కుట్ర జరుగుతోంది. అమ్మఒడి పథకంపై ఎల్లో మీడియాకు కడుపుమంటగా ఉంది. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడితే వారికి ఏంటి ఇబ్బంది?. పాఠశాల విద్యను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. కొంతమంది ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడే విధంగా శిక్షణ ఇస్తున్నాము’’ అని తెలిపారు.

 
 

Back to Top