సంక్షేమ ప‌థ‌కాలు ఎగ్గొట్టడం సుపరిపాలన అవుతుందా?

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి

మండ‌లిలో నారా లోకేష్ వితండ వాద‌న‌

మంత్రి నారా లోకేష్ తీరుపై ప్ర‌తిప‌క్ష నేత బొత్స ఆగ్రహం

అమరావతి: సూపర్ 6 పథకాలకు ఎగనామం పెట్టడం సుపరిపాలనా..?. ఉద్యోగులకు డీఏ, ఐ ఆర్, పీ ఆర్ సీ ఇవ్వకపోవడమే సుపరిపాలనా..?. అమ్మ ఒడి, రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన అవుతుందా? అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి నిలదీశారు. గవర్నర్ ప్రసంగంపై చర్చలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుద కళ్యాణి ప్రసంగాన్నిఅడ్డుకునేందుకు మంత్రులు ప్రయత్నించారు. ఆమె ప్రసంగాన్ని మంత్రి నారా లోకేష్ అడ్డుకున్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలు చెప్పలేదంటూ మంత్రి నారా లోకేష్ వాదించారు. గవర్నర్ ప్రసంగంలో కల్పించినట్టు రాశారని వరుదు కళ్యాణి అన్నారు. తాము ఇంగ్లీష్ స్పీచ్‌లో ఉన్నదే చెప్తామంటూ మంత్రి లోకేష్ వితండ వాదం చేశారు. మంత్రులు మాటిమాటికీ అడ్డు తగలడంపై విపక్ష నేత బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రుల తీరుపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఉద్యోగాలు ఇచ్చేశాం అని ఎలా చెప్తారంటూ బొత్స అభ్యంతరం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం టీడీపీ, జనసేన పై ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేదన్న వరుదు కళ్యాణి వ్యాఖ్యల పట్ల మంత్రి నారా లోకేష్ మళ్లీ అభ్యంతరం తెలిపారు.

ఓటేసిన జనం చెప్పులతో కొట్టుకుంటున్నారు
కూట‌మి నేత‌ల‌కు ఓటేసిన జనం చెప్పులతో కొట్టుకుంటున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తెలిపారు. ‘గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉంది. చంద్రబాబు పాలన గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఓటేసిన జనం చెప్పులతో కొట్టుకుంటున్నారు. తొమ్మిది నెలల్లో రైతులు, మహిళలు, పేదల జీవితాలు తలకిందులైపోయాయి. సూపర్ 6 పథకాలకు ఎగనామం పెట్టడం సుపరిపాలనా..?. ఉద్యోగులకు డీఏ, ఐ ఆర్, పీ ఆర్ సీ ఇవ్వకపోవడమే సుపరిపాలనా..?. అమ్మ ఒడి, రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన అవుతుందా.?’ అంటూ వరుదు కల్యాణి నిలదీశారు.

ఉద్యోగాలు ఎక్క‌డ ఇచ్చారో చెప్పండి
‘‘4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేశాం అని గ‌వ‌ర్న‌ర్‌తో చెప్పించారు. ఎక్కడ ఇచ్చారు..? చూపించండి. గత ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌ జగన్ 6 నెలల్లో లక్షా 25 వేల ఉద్యోగాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం.. తొలి సంతకం పెట్టిన మెగా డీఎస్సీని కూడా పూర్తి చేయలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా ఇవ్వకుండా మోసం చేశారు. రూ.15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారు. 60 శాతం నిత్యవసర వస్తువులు ధరలు పెంచారు. టీడీపీ పై ఆధారపడ్డ కేంద్ర ప్రభుత్వం ఉన్నా ప్రత్యేక హోదాను సాధించలేదు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు.

ప్యాకేజీ కోసం హోదాను వదిలేయలేదా..?
మేం కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇచ్చాం.. మా మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడిందని ఏనాడూ అనలేదంటూ మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేంద్రంలో ఉన్నది వీళ్ల ఉమ్మడి ప్రభుత్వం కాదా..?. మా మీద ఆధారపడలేదని చెప్తారా..?. రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు. అదే మా సభ్యురాలు చెప్తున్నది. 2014 నుంచి 2019 మధ్యలో ప్యాకేజీ కోసం హోదాను వదిలేయలేదా..?’’ అంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

Back to Top