నంద్యాల జిల్లా: రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పాలన ‘సూపర్’ ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వైయస్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు కల్పలతారెడ్డి అన్నారు. బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం డోన్ పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాల్లో పార్టీ డోన్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొత్త పింఛన్ల మంజూరు తదితర హామీలను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది అన్నారు. హామీలు నీటిమూటలేనా? మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ఆర్‌సీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగిస్తూ అదనంగా ‘సూపర్ సిక్స్’ హామీలు ఇచ్చి ప్రజలను టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారన్నారు. అబద్ధాల వాగ్దానాలు ఇచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచారని, త్వరలోనే చంద్రబాబుకు బుద్ధిచెబుతారన్నారు. హామీలు అమలు కాకున్నా జనసేన, బీజేపీ నేతలు నోరు మెదపకపోవడం విచారకరం అన్నారు. వీరందరిదీ మోసగాళ్ల కూటమి అనే విషయం ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. భయపడేవారు ఎవరూ లేరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి ప్రజలు నిలదీస్తారనే భయంతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. వైయస్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. అక్రమ కేసులకు భయపడేవారు ఎవరూ లేరన్నారు. అధికారం శాశ్వతం అనే భ్రమలో కూటమి నాయకులు ఉండటం విచారకరం అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు తెరతీసి ప్రజాస్వామాన్ని మంటగలిపారని విమర్శించారు.