పర్యాటక రంగం ఆదాయంపై ప్రత్యేక దృష్టి

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

అమరావతి: పర్యాటక రంగం ఆదాయన్ని పెంచే లక్ష్యంతో అభివృద్ధి, విస్తరణ చర్యలు చేపడుతున్నట్టు పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్‌తో దెబ్బతిన్న పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే గాడినపడుతోందన్నారు. వచ్చే ఆర్థిక ఏడాది రూ.200 కోట్ల ఆదాయ ఆర్జన లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  

పర్యాటక సంస్థ ఆస్తులకు సంబంధించి రూ.31.08 కోట్ల లీజు బకాయిలు రావాల్సి ఉందన్నారు. సకాలంలో లీజు అద్దెను చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఏజెన్సీలను రద్దు చేస్తామని హెచ్చరించారు. 13 ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సెవెన్‌ స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి వేగంగా చర్యలు చేపడుతున్నామన్నారు. రూ.35 కోట్లతో 18 చోట్ల రెస్టారెంట్లు, హోటళ్లను ఆధునికీకరించనున్నట్టు వివరించారు. ఉగాది నాటికి పర్యాటక యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.

తాజా వీడియోలు

Back to Top