బద్వేల్‌లో వైయ‌స్ఆర్‌సీపీ నేతల అరెస్టు

నామినేషన్లకు అడ్డంకులు.. అట్లూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు

వైయ‌స్ఆర్ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను అడ్డుకుంటూ, వారికి మద్దతుగా నిలిచిన పార్టీ నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైయ‌స్ఆర్‌సీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర సీఈసీ సభ్యుడు కె. సురేష్‌బాబు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి. అంజాద్‌ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్‌ పాకా సురేష్‌, కమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బి. నరేన్‌రెడ్డి, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పులి సునీల్‌కుమార్‌తో పాటు పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి  వైయ‌స్సార్‌ కడప జిల్లాలోని అట్లూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సంద‌ర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ..భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య సూత్రాలను కూటమి ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఈ పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో సమాధానం చెబుతారని అన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, అరెస్టులు, అడ్డంకులపై సమగ్ర విచారణ జరిపి ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని  కోరారు.

Back to Top