మండ‌లిలో మంత్రుల దాట‌వేత ధోర‌ణి

కూటమి సర్కార్‌కు ఊపిరి సలపనివ్వని వైయ‌స్ఆర్‌సీపీ

అమరావతి: ఏపీ శాసనమండలిలో బడ్జెట్‌పై వాడీవేడి చర్చ జరుగుతోంది. పలు అంశాలపై వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించగా.. మంత్రులు దాటవేత ధోరణి ప్రదర్శించారు. కనీసం జవాబు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. తాము ఎందుకు సమాధానం చెప్పాలనే విధంగా ప్రవర్తించడం గమనార్హం.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, సాయి కల్పలత పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. దీపం పథకంపై ఎమ్మెల్సీలు ప్రశ్నించగా.. లబ్ధిదారుల సంఖ్య చెప్పకుండా సమాధానం మంత్రి నాదెండ్ల మనోహర్ దాట‌వేశారు. దీంతో మంత్రిపై ఎమ్మెల్సీలు మండిపడ్డారు. దీపం పథకం అంటే ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టడమా?. దీపం పథకం లబ్ధిదారులు ఎంత మందో ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు?. తొమ్మిది నెలలకు ఒకే సిలిండర్ ఇస్తారా?. కోటి 54 లక్షల మందికి ఎందుకు దీపం పథకం అమలు చేయడం లేదు. లబ్ధిదారుల సంఖ్య చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.

ఇదే సమయంలో మండలిలో డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ రుణాలపై కూడా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సాయి కల్పలత ప్రశ్నలు వేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. సున్నా వడ్డీ పథకాన్ని డ్వాక్రా మహిళలకు అమలు చేస్తున్నారా లేదా?. గతంలో చంద్రబాబు 2016లో సున్నా వడ్డీని నిలిపేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన సున్నా వడ్డీని అమలు చేయాలి. డ్వాక్రా మహిళలకు 10 లక్షల సున్నా వడ్డీ రుణాలు ఇస్తామన్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పుడు నుండి ప్రారంభిస్తుంది? అని అడిగారు. దీనికి కూడా కూటమి మంత్రులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

 
రాష్ట్రంలో బెల్టు షాపుల విషయమై మండలిలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు మాధవరావు, రమేష్‌ యాదవ్‌, దువ్వాడ శ్రీనివాస్‌ ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు మాట్లాడుతూ..‘రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూమ్‌లు పెడుతున్నారు. మద్యం అమ్మకాలపై నియంత్రణ లేకుండా ఎక్కడంటే అక్కడ షాపులు పెడుతున్నారు. చర్యలు ఎందుకు లేవు? అని ప్రశ్నలు సంధించారు. దీనికి కూడా కూటమి నేతలు స్పందించలేదు. 

Back to Top