తాడేపల్లి: వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం ద్వారా భూముల రీ సర్వేకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సర్వే ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కురుర్చుకుంది. సర్వేకు ఈ సంస్థ పూర్తి స్థాయి సాంకేతిక సహకారం అందిస్తుంది. ఇందుకోసం సిబ్బందికి అవసరమైన శిక్షణ, సాంకేతిక నైపుణ్యం అందిస్తుంది. ఒప్పంద కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భూ యజమానులకు శాశ్వత భూ హక్కుతో కూడిన కార్డులు వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం ద్వారా సమగ్ర భూముల రీసర్వే పూర్తికాగానే భూ యజమానులకు శాశ్వత భూ హక్కులతో కూడిన డిజిటల్ కార్డులు ఇస్తారు. దీంతో ఎన్నో వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. భూ రికార్డులన్నీ డిజిటలైజ్ చేయడం వల్ల ట్యాంపరింగ్‌కు ఏమాత్రం అవకాశం ఉండదు. పట్టణాలకు, నగరాలకు వెళ్లాల్సిన పని లేకుండా సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలను కూడా అందుబాటులోకి తెస్తారు. సమగ్ర భూ సర్వేను ఈ నెల 21 ప్రారంభిస్తారు. సర్వే సిబ్బందికి శిక్షణ కోసం తిరుపతిలో కనీసం 50 ఎకరాల విస్తీర్ణంలో కళాశాల ఏర్పాటు చేయాలని ఇప్పటికే సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సర్వే సందర్భంలోనే ఈ కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు