తాడేపల్లి: ప్రజల్లో అవగాహన పెంచి, గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. గ్రామాల్లో స్వచ్చతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘జగనన్న స్వచ్చ సంకల్పం' కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు ఆయా గ్రామ సర్పంచ్‌లకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. సోమవారం ఈ శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా వైయస్సార్ కడప, చిత్తూరు జిల్లాల జెడ్పీ సీఇఓ, డీపీఓ, డ్వామా పీడీ, ఎంపీడీఓ, పంచాయతీ ఇఓ, గ్రామ సర్పంచ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడేపల్లి సీపీఆర్ కార్యాలయం నుంచి పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, స్వచ్చాంధ్ర ఎండీ సంపత్‌కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూలై 8 దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి నాడు 'జగనన్న స్వచ్ఛసంకల్పం' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గ్రామాలే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకు గ్రామ సర్పంచ్‌ల భాగస్వామ్యం కీలకమని ఆయన అన్నారు. కోవిడ్ మన గ్రామ పొలిమేరల్లోకి రాకుండా చూసే బాధ్యత సర్పంచులదేనని, వాళ్ల సారథ్యంలో స్వచ్ఛమైన పల్లెలను సృష్టించుకోవాలని తెలిపారు. ప్రజలు సర్పంచులపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే సమయం ఇదేనంటూ మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.